MAA Row : "మా" వివాదం కొనసాగింపు "మంచు" వ్యూహమా ? మీడియాతో మాట్లాడవద్దని చెబుతూ తామే ఎందుకు రచ్చ చేస్తున్నారు ?
"మా" రాజకీయాలను మీడియా ముందు పెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు మోహన్ బాబు. తాను ఇక మాట్లాడబోనన్నారు మంచు విష్ణు. కానీ ఇవాళ మీడియాలో విష్ణు ప్రెస్‌మీట్ హైలెట్ అయింది.
"మా" ఎన్నికల వివాదం జీడిపాకం సీరియల్‌గా సాగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ కన్నా ప్రతీ రోజూ మీడియాలో చర్చకు తీసుకొస్తోంది గెలిచిన " మంచు " ప్యానలే. మీడియాతో మాట్లాడవద్దని అదే పనిగా సలహాలు ఇస్తున్నారు కానీ పాటించడం లేదు. చివరికి మంచు విష్ణు కూడా తాను ఇక "మా" ఎన్నికల వివాదం గురించి మాట్లాడబోనని.. అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడనని ప్రకటించారు. కానీ రెండు రోజులు గడవక ముందే "మా" ఎన్నికలపై గంటల తరబడి మాట్లాడుతూ ప్రెస్‌మీట్ పెట్టారు.
Also Read : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి రఘురామ .. కానీ ఎన్నికలెప్పుడు ?
సినిమా ఇండస్ట్రీ పరపతిని ప్రజల్లో చులకన చేశాయి "మా" ఎన్నికలు . దానికి కారణం ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం, విమర్శించుకోవడం.. పోలింగ్ రోజులన దాడులకు సైతం తెగబడటం. ఎన్నికలు ముగిసిన తర్వాత అందరం ఒక్కటేనని మాటల్లో చెబుతున్నారు కానీ వివాదాన్ని ముగించడం లేదు. అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. " మా" ఎన్నికల గురించి ఇక మీడియా ముందు పంచాయతీకి పోవద్దని మోహన్ బాబు కూడా పలుమార్లు చెప్పారు. చివరికి మంచు విష్ణు ప్రమాణస్వీకార సభలోనూ అదే అన్నారు. అప్పుడే మంచు విష్ణు కూడా ఇక నుంచి "మా" రాజకీయాలపై అసలు మీడియాతో మాట్లాబోనని .. అభివృద్ధి గురించే మాట్లాడతానన్నారు.
Also Read : అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు
కానీ మంచు విష్ణు తాను చెప్పిన మాటలను రెండు రోజుల్లోనే మర్చిపోయారు. గెలిచిన తన ప్యానల్ సభ్యులందరితో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత విద్యానికేతన్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. " మా" ఎన్నికలపై మాట్లాడారు. " బై లా" కూడా మారుస్తామన్నారు. ప్రకాష్ రాజ్ చేస్తున్న విమర్శల్లో "బై లా" అంశం కూడా ఉంది. దీన్ని కూడా మారుస్తామని మంచు విష్ణు మీడియా సమావేశంలో ప్రకటించారు. సీసీ టీవీ ఫుటేజీ వివాదం గురించి మాట్లాడారు. ఆయన ప్యానల్‌లో పోటీ చేసి ఓడిపోయిన బాబూమోహన్ మరింత ఘాటుగా విమర్శలు చేశారు. చదువుకోని వాళ్లు .. విద్యావేత్త అయిన విష్ణుపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు
మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ కూడా సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడానికి జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు వెళ్లారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన మంచు విష్ణుతో తనకేం పేచీ లేదని.. సమస్య అంతా ఎన్నికల అధికారిలోనని చెప్పుకొచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాత మీడియా ముందుకు వస్తామని ప్రకటించారు. ఒక వర్గం సైలెంట్ అయితే ఆటోమేటిక్‌గా మరో వర్గం మౌన పాటిస్తుంది. కానీ గెలిచిన మంచు ప్యానల్ సంయమనం పాటించాలని అదే పనిగా చెబుతోంది కానీ తాము మాత్రం పాటించడం లేదు. దీంతో వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది.
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి