Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ
అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ... ఎల్లప్పుడూ... భారతీయ తెరపై దేశభక్తి కమర్షియల్ హిట్ ఫార్ములా... అందులో నో డౌట్! స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... సినిమాలు, సినిమాల్లో దేశభక్తి గురించి!
మనసులను వేరు చేసేది కులం, మతం...
మరి, ఆ మనసులను ఒక్కటి చేసేది? దేశం
మనుషుల మధ్య దూరం పెంచేది ప్రాంతం...
మరి, ఆ మనుషులను ఒక్కటి చేసేది మన దేశం
మృత్యుకాండకు కారణం తీవ్రవాదం...
మరి, ఆ మృత్యువుకు ఎదురు నిలిచింది భారతదేశం
మనలో అణువణువూ ప్రవహించేది రక్తం...
మనందరి రక్తం రంగు ఒక్కటే... అదే భారతీయం
కుల మతాలు వేరు కావచ్చు... వేషభాషలు వేరు కావచ్చు... కానీ, మనమంతా ఒక్కటే, భారతీయులం. మనల్ని ఒక్కటి చేసింది దేశం. భారతదేశంలో మనమంతా సమానమే.
దేశం తర్వాత మళ్ళీ మనల్ని ఒక్కటి చేసింది సినిమా! ప్రేక్షకుడిగా ప్రతి ఒక్కరికి ఒక్కో అభిరుచి ఉండొచ్చు... కానీ, దేశభక్తి సినిమా వచ్చేసరికి అందరి అభిరుచి ఒక్కటే! అందుకే, బాక్సాఫీస్ బరిలో దేశభక్తి సూపర్ డూపర్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఫార్ములా! దేశభక్తి కథాంశాలతో రూపొందిన ఒకట్రెండు సినిమాలు ఆశించిన రీతిలో విజయాలు సాధించలేదేమో!? కానీ, సక్సెస్ రేట్ ఐదు నుంచి పది శాతం కూడా లేని సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి కథల సక్సెస్ రేట్ 95 శాతం ఉండటానికి కారణం ప్రజల్లో దేశంపై ఉన్న ప్రేమ.
బ్రిటీషర్లను కొట్టిన ప్రతిసారీ బాక్సాఫీస్ బద్దలే!
ఎనిమిది నెలలు... 2022 మొదలై! ఈ ఏడాది భారతీయ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ఏది? 'ఆర్ఆర్ఆర్' సినిమా! వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. అందులో ఉన్నది ఏమిటి? దేశభక్తి. తెల్లదొరలపై ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన పోరాటం భాషలకు అతీతంగా భారతీయులను, విదేశీ ప్రేక్షకుల్నీ సైతం ఆకట్టుకుంది. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రాజమౌళి ఊహాజనిత కథతో తీశారు.
ఊహాజనితం కాదు... తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఎందరో మహానుభావులు దేశంలో ఉన్నారు. వాళ్ళలో కొందరి కథలూ తెరపైకి వచ్చాయి. ఇటీవల కాలంలో చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' చేశారు. స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో రూపొందిన చిత్రాలు అంటే ముందుగా మనకు గుర్తు వచ్చేది... ఎన్టీఆర్ 'సర్దార్ పాపారాయుడు', 'పల్నాటి యుద్ధం', కృష్ణ 'అల్లూరి సీతారామరాజు', కృష్ణంరాజు 'తాండ్ర పాపారాయుడు'. ఈ కోవలో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.
జాతిపిత మహాత్మా గాంధీ బయోపిక్ 'గాంధీ' అయితే హాలీవుడ్‌లోనూ విజయం సాధించింది. హిందీలోనూ స్వాతంత్య్ర సమరయోధుల నేపథ్యంలో రూపొందిన పలు చిత్రాలు రూపొందాయి. భారీ విజయాలు సాధించాయి. బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.
అవినీతిని ప్రశ్నించడమూ దేశభక్తే
స్వాతంత్య్రం తర్వాత దేశభక్తి రూపురేఖలు మారాయని చెప్పాలి. అప్పటివరకూ తెల్లదొరల నుంచి దేశాన్ని విడిపించడానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. పోరాటం చేశారు. స్వాతంత్య్రం సాధించిన తర్వాత ప్రజలను పట్టి పీడించిన, పీడిస్తున్న మహమ్మారి అవినీతి. స్వాతంత్య్రం తర్వాత దేశభక్తులు అవినీతిపై పోరాటం ప్రారంభించారు. ఉదాహరణకు... కమల్ హాసన్ 'భారతీయుడు', చిరంజీవి 'ఠాగూర్'. ఇటువంటి కథాంశాలతో రూపొందిన చిత్రాలూ బాక్సాఫీస్ బరిలో భారీ విజయాలు సాధించాయి. తన సినిమాల్లో సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ... శంకర్ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆయన తీసిన 'అపరిచితుడు'లోనూ అవినీతిని ప్రశ్నించారు. అవినీతిని కథానాయకుడు ప్రశ్నించే సన్నివేశాలు కమర్షియల్ చిత్రాల్లో హీరోయిజం ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతున్నాయి.
సైనికుడా... నీకు సలాం, బాక్సాఫీస్ నీరాజనం!
స్వాతంత్య్రం తర్వాత అవినీతితో పాటు దేశాన్ని పట్టి పీడిస్తున్న మరో సమస్య తీవ్రవాదం! దేశం లోపల, సరిహద్దులలో తీవ్రవాదాన్ని అణిచి వేయడానికి సైనికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. దేశభక్తి ముందు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. అటువంటి సైనికుల వీరగాధలు తెరపైకి వచ్చిన ప్రతిసారీ బాక్సాఫీస్ నీరాజనం పలికింది. ఈ ఏడాది అడివి శేష్ 'మేజర్'కు ఎటువంటి స్పందన లభించిందో చూశాం. అలాగే, ఓటీటీలో విడుదలైన హిందీ సినిమా 'షేర్షా', ఆ మధ్య వచ్చిన 'ఘాజీ'కి లభించిన గౌరవం చూశాం. ఇవన్నీ వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందినవి.
వాస్తవ ఘటనల స్ఫూర్తితో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఫిక్షనల్ స్టోరీలతో రూపొందిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు... కొన్నేళ్ల క్రితం కృష్ణవంశీ తీసిన 'ఖడ్గం'. ఇప్పటికీ ప్రజల్లో దేశభక్తి రగిలించే చిత్రమది. ఏఆర్ మురుగదాస్ తీసిన 'తుపాకీ'లోనూ దేశభక్తి ఉంది. రామ్ గోపాల్ వర్మ 'ది ఎటాక్స్ ఆఫ్ 26/11'లో ముంబై ఉగ్రదాడిని చూపించారు.
హిందీలో ఈ మధ్య టెర్రరిజం నేపథ్యంలో ఎక్కువ చిత్రాలు వస్తున్నాయి. విక్కీ కౌశల్ 'ఉరి', సోనమ్ కపూర్ 'నీర్జా', ఆలియా భట్ 'రాజీ', అక్షయ్ కుమార్ 'బేబీ', హృతిక్ రోషన్ 'వార్' వంటి చిత్రాలు విజయాలతో పాటు గౌరవాన్ని సొంతం చేసుకున్నాయి.
ప్రేమకథలకూ స్ఫూర్తిగా నిలుస్తున్న దేశభక్తి
బయోపిక్స్, యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలకు మాత్రమే కాదు... ప్రేమకథలకూ దేశభక్తి స్ఫూర్తిగా నిలుస్తోంది. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అంటూ 'సీతారామం' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల దగ్గర స్పందన ఎలా ఉందో చూశాం. 'ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది' అని కొన్నేళ్ల క్రితం 'కంచె' వచ్చింది. తీవ్రవాదం నేపథ్యంలో మణిరత్నం తీసిన 'రోజా'ను మర్చిపోగలమా?
ప్రతి ఒక్కరి జీవితంలోనూ, ప్రేమలోనూ, ప్రయాణంలోనూ... దేశభక్తి అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని తట్టిలేపే సినిమాలు వచ్చినప్పుడు... తెలియకుండా మనలో హృదయం స్పందిస్తుంది. మనసు సంతృప్తి చెందుతుంది. అప్పుడు కులం, మతం, ప్రాంతం, భాష, వేషం వంటివి మాయమవుతున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రజలు థియేటర్లకు వెళుతున్నారు. పక్క పక్క సీట్లలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే, దేశభక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాలు అంత భారీ విజయాలు సాధిస్తున్నాయి.
Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?
బాక్సాఫీస్ బరిలో విజయాలు సాధించడమే లక్ష్యంగా హీరోలు, దర్శక - నిర్మాతలు దేశభక్తి సినిమాలు తీయడం లేదు. ప్రజలకు మన స్వాతంత్య్ర సమరయోధుల కథలు చెప్పాలని, సమాజంలో మార్పు తీసుకు రావాలని బలంగా నమ్మినప్పుడు మాత్రమే ఇటువంటి సినిమాలు వస్తాయి. వాళ్ళ ప్రయత్నానికి బాక్సాఫీస్ విజయం ఉత్సాహాన్ని ఇస్తోంది. మరొకరికి అటువంటి సినిమా తీయవచ్చని స్ఫూర్తి కలిగిస్తోంది. దేశభక్తి సినిమాలు ఏ ఒక్క భాషకో పరిమితం కావడం లేదు. 'మేజర్', 'ఘాజీ' చిత్రాలకు హిందీలోనూ మంచి స్పందన లభించింది. 'ఠాగూర్' తమిళ సినిమా రీమేకే కదా! డబ్బింగ్ లేదంటే రీమేక్, ఇప్పుడు కొత్తగా వచ్చిన పాన్ ఇండియా రిలీజ్ రూపంలో అన్ని భాషల ప్రేక్షకులను దేశభక్తి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
Also Read : బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!