Baby Movie: ‘బేబీ’ మూవీపై పోలీస్ కమీషనర్ ఫైర్ - నోటీసులు జారీ చేస్తామని వెల్లడి
‘బేబీ’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్స్‌కు డ్రగ్స్ అలవాటు ఉంటుంది. అందుకే ఈ సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రోత్సహించేలా ఉందని సీవీ ఆనంద్ మండిపడ్డారు.
సినిమాలు అనేవి సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. సినిమాల్లో చూపించనట్టు ఉండడానికి, వారి మాటలకు, వారి ప్రవర్తనకు ప్రేక్షకులు చాలా ప్రభావితం అవుతారు. ఈ విషయాన్ని సినిమావారు ఒప్పుకోరు కానీ ఇది చాలావరకు నిజమే అనిపించేలా బయట సమాజంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇక డ్రగ్స్ విషయానికొస్తే.. యూత్ అంతా చాలావరకు సినిమాల నుండే ప్రభావితం అవుతున్నారని ఇప్పటికీ చాలామంది చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో డ్రగ్స్ బయటపడ్డాయి. అయితే ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్.. ‘బేబీ’ సినిమాపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
‘బేబీ’ మూవీలో అలాంటి సీన్స్..
‘బేబీ’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్స్‌కు డ్రగ్స్ అలవాటు ఉంటుంది. అందుకే ఈ సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రోత్సహించేలా ఉందని సీవీ ఆనంద్ మండిపడ్డారు. ‘బేబీ’లో డ్రగ్స్‌ను ప్రోత్సహించే సీన్స్ ఉన్నాయన్నారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో రైడ్స్ నిర్వహించడం, అక్కడ డ్రగ్స్ దొరకడం గురించి ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆనంద్.. ‘బేబీ’ సినిమా గురించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మాదకద్రవ్యాలను ప్రోత్సహిస్తున్నట్టు సినిమాలో సీన్స్ ఉన్నాయి కాబట్టి ‘బేబీ’ మూవీ టీమ్‌కు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా ఇలాంటి సీన్స్ సినిమాల్లో ఉండకుండా ప్రతీ సినిమాపై ప్రత్యేకంగా నిఘా పెడతామని క్లారిటీ ఇచ్చారు. దీంతో సినిమావారంతా ఒక్కసారిగా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హీరో నవదీప్ కూడా భాగమే..
మాదాపూర్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా డ్రగ్స్ విషయంలో పలువురు బడా బాబుల పేర్లు బయటికి వచ్చాయి. హీరో నవదీప్ కూడా వారి దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే నవదీప్ పరారీలో ఉన్నట్టు సీవీ ఆనంద్ తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో భాగమయిన మాజీ ఎంపీ కుమారుడు దెవరకొండ సురేశ్‌ను మాత్రం అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఒక సినిమా అనేది ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తుంది అని పోలీసులు మాట్లాడడం ఇదేమీ మొదటిసారి కాదు. కానీ ప్రత్యేకంగా ‘బేబీ’లాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా పేరును సీవీ ఆనంద్ లాంటి ఉన్నతాధికారి వేలెత్తిచూపడంతో మేకర్స్ అంతా తమ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉండకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే, నవదీప్ ఈ విషయాన్ని కండించాడు. ఆ నవదీప్ తాను కాదని స్పష్టం చేశాడు.
మరోసారి చర్చనీయాంశంగా ‘బేబీ’..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రమే ‘బేబీ’. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సాయి రాజేష్. చాలామంది యూత్ జీవితాలకు ఈ సినిమా చాలా దగ్గరగా అనిపించడంతో వారంతా కలిసి ఈ మూవీని సెన్సేషనల్ హిట్ చేశారు. ఈ మూవీ హిట్ కొట్టడంతో పాటు ఎన్నో కాంట్రవర్సీలను కూడా క్రియేట్ చేసింది. అయినా అవన్నీ పక్కన పెడితే కలెక్షన్స్ విషయంలో ఇలాంటి ఒక చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి చూపించింది. అందుకే విడుదలయ్యి చాలా రోజులు అయినా కూడా ఇంకా ‘బేబీ’ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యల ద్వారా మరోసారి ‘బేబీ’ మూవీ చర్చనీయాంశంగా మారింది.
Also Read: రూ.1000 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్న బాలీవుడ్ హీరో గోవింద
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial