Chiranjeevi: పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
Megastar Chiranjeevi: తన పర్మిషన్ లేకుండా తన పేరును వాడడంపై మెగాస్టార్ చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Hyderabad Court Grants Chiranjeevi Protection Of Personality Rights : మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. వాణిజ్య సంస్థలు, ఈ కామర్స్ సైట్స్, యూట్యూబ్ ఛానళ్లు అనుమతి లేకుండా ఆయన పేరును, మెగాస్టార్ ట్యాగ్‌ను వాడేందుకు వీల్లేదని ఆదేశాలిచ్చింది. దాదాపు 30కి పైగా ఆన్ లైన్ గార్మెంట్స్ సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలను నిరోధిస్తూ న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. AIతో కూడిన మెటావర్స్ ఫార్మాట్లకు ఇవి వర్తిస్తాయని చెప్పారు. తద్వారా చిరంజీవి వ్యక్తిగత, ప్రచార హక్కులకు రక్షణ కల్పించింది.
అనధికారికంగా తన పేరు వాడుకుంటూ వాణిజ్యపరంగా లబ్ధి పొందుతున్న సంస్థలను నిలువరించాలని కోరుతూ చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కొన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫాం సంస్థలు, రిటైల్ స్టోర్స్ తన పర్మిషన్ లేకుండా తన ఫోటోలు, వాయిస్, మెగాస్టార్, చిరు వంటి ట్యాగ్స్ ఉపయోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇది తన ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా సామాజికపరంగా, ఆర్థిక పరంగా తనకు నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.
అనుమతి లేకుండా వాడొద్దు
దీనిపై విచారించిన న్యాయస్థానం... చిరంజీవి వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడాన్ని వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. ఆయన పర్మిషన్ లేకుండా ఫోటోలు కానీ, వాయిస్ కానీ ఎలాంటి ట్యాగ్స్ కానీ వాడొద్దని సదరు ఆన్ లైన్ ప్లాట్ ఫాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. చిరు పేరును అనధికారికంగా వినియోగించడం వల్ల ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావిస్తోన్న న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఉత్తర్వులతో ఇక ఆన్ లైన్ ప్లాట్ ఫాం సంస్థలు, డిజిటల్ మీడియా, యూ ట్యూబ్ ఛానళ్లు ఏవీ కూడా మెగాస్టార్, చిరు, అన్నయ్య వంటి బిరుదులు, ఆయన ఫోటోలు, వాయిస్, వ్యాపార ప్రకటనల కోసం ఆయన పర్మిషన్ లేకుండా వాడకూడదు.
Also Read: 'కాంతార చాప్టర్ 1' ఓ అద్భుతం - రిషబ్ శెట్టి టీంపై అల్లు అర్జున్ ప్రశంసలు
సెలబ్రిటీల ఆందోళన
ఇటీవల పలువురు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలగడం, అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల కోసం తమ పేరు ట్యాగ్స్ వాడుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా కింగ్ నాగార్జున సైతం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇమేజ్ అడ్డం పెట్టుకుని కొందరు ఏఐ మార్ఫ్‌డ్ వీడియోస్, ఫోటోస్ క్రియేట్ చేసుకుని డబ్బులు చేసుకుంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని దాని ఆధారంగా డబ్బులు సంపాదిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఆయనతో పాటే అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, కుమార్ సాను, అరిజిత్ సింగ్, ఆశా భోంస్లే, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ సైతం తమ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు.





















