Hari Hara Veera Mallu: ఎన్టీఆర్, ఎంజీఆర్ స్ఫూర్తితో వీరమల్లు... పవన్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు జ్యోతి కృష్ణ
NTR MGR inspiration for Veeramallu: దిగ్గజ నటులు - నాయకులు ఎన్టీఆర్, ఎంజీఆర్ స్ఫూర్తితో 'హరి హర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించినట్లు దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)... తమిళ చిత్రసీమను కొన్ని దశాబ్దాలు ఏలిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (ఎంజీఆర్)... జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ముగ్గురి మధ్య ఒక కామన్ కనెక్షన్ ఉంది తెలుసా?
ఎన్టీఆర్, ఎంజీఆర్, పవన్ కళ్యాణ్... ముగ్గురూ చిత్రసీమ నుంచి రాజకీయ సీమలో అడుగు పెట్టిన నాయకులు. తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించి, తమను ఇంతిలా ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ముఖ్యమంత్రులు అవ్వగా... పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. సినిమా టు రాజకీయాల్లో మాత్రమే కాదు... పవన్ తాజా సినిమా 'హరిహర వీరమల్లు'లోనూ సీనియర్ స్టార్లతో ఒక కనెక్షన్ ఉందని చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు. అది ఏమిటంటే...
ఎన్టీఆర్, ఎంజీఆర్ స్ఫూర్తితో వీరమల్లు
'హరిహర వీరమల్లు'లో పవన్ కళ్యాణ్ పాత్ర రాయడానికి దిగ్గజ కథానాయకులు - ప్రజలు మెచ్చిన నాయకులు ఎన్టీఆర్, ఎంజీఆర్ నుంచి ప్రేరణ స్ఫూర్తితో పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ''ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజాల మాదిరిగా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాత ఆయన పాత్ర రాయడానికి ప్రేరణ పొందాను ధర్మపరులుగా, బలవంతుడిగా మరియు ప్రజల మనిషిగా పవన్ గారికి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని 'హరి హర వీరమల్లు'లో ఆయన పాత్రను చాలా జాగ్రత్తగా రూపొందించాం'' అని చెప్పారు.
Also Read: నాగార్జున అంత ఈజీగా ఒప్పుకోలేదు... 40 ఏళ్ళలో మొదటిసారి ఆ మాత్రం జాగ్రత్త ఉండొద్దూ!
నాయకులుగా సందేశాత్మక సినిమాలు!
ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్, ఎంజీఆర్ సందేశాత్మక సినిమాలు చేశారని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఆ తరహా సందేశాత్మక సినిమా ఇవ్వాలని తాను పవన్ పాత్రను మలిచినట్టు జ్యోతి కృష్ణ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''సీఎంగా ఎంజీఆర్ గారు సందేశాత్మక, నిజాయితీతో కూడిన సినిమాలు చేశారు. నట జీవితాన్ని కొనసాగించారు. ఆ అంశం నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అందుకే 'హరి హర వీరమల్లు'లో పవన్ కళ్యాణ్ గారి చేత 'మాట వినాలి' అనే శక్తివంతమైన, ఆలోచింపజేసే పాటను రూపొందించాం. నటుడిగా ఎన్టీఆర్ పౌరాణిక, జానపద సినిమాలు చేశారు. ధర్మబద్ధమైన పాత్రలు చేశారు. తన శక్తిని, ధర్మాన్ని, సామర్థ్యాన్ని సూచించేలా విల్లు, బాణం పట్టుకున్న శ్రీరాముడిగా కనిపించారు. అందుకే వీరమల్లుగా పవన్ చేత బాణం పట్టించాము. పవన్ గారి శక్తిని సూచించడంతో పాటు న్యాయబద్ధంగా, ధర్మంగా నడుచుకుంటారని చెప్పడానికి అలా చేశాను'' అని వివరించారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు కేవలం కథానాయకుడిగా మాత్రమే కాకుండా నాయకుడిలా చూస్తున్నారని గ్రహించి ఆ పాత్రను మలిచినట్టు చెప్పుకొచ్చారు. ఈ నెల 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read: 'కూలీ' సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?





















