Prakash Raj Birthday: అటు సినిమాలు, ఇటు వివాదాలు - ప్రకాష్ రాజ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Prakash Raj Birthday Special: దక్షిణాది అగ్ర నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వర్సటైల్ యాక్టర్ కెరీర్ లోని ఆసక్తికరమైన విషయాలు మీకోసం...
Prakash Raj Birthday Special: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలిగే గొప్ప నటుడాయన. గత మూడు దశాబ్దాలుగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఏడు ప్రధాన భారతీయ భాషల్లో దాదాపు నాలుగు వందల సినిమాలకు పైగా నటించారు. నటుడిగానే కాకుండా టీవీ హోస్ట్ గా, నిర్మాతగా, దర్శకుడిగానూ ఇండస్ట్రీలో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక సినిమాల్లో ఎంత విలక్షణంగా నటిస్తారో, నిజ జీవితంలోనూ అంతే విలక్షణంగా ప్రవర్తిస్తుంటారు. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ప్రకాశ్.. తన అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా బయటపెడుతుంటారు. 'జస్ట్ ఆస్కింగ్' అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తుంటారు. అలాంటి వ్యక్తిత్వం ప్రకాశ్ రాజ్‌కే సొంతం. ఈ రోజు ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ లో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
- ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26న జన్మించారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి, రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన నెలకు 300 రూపాయల వరకూ పారితోషికం అందుకున్నారు. 80స్ లో టెలివిజన్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
- ఆరంభంలో కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన ప్రకాశ్ రాజ్.. 1994లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'డ్యూయెట్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీని గుర్తుగానే ఆయన తన సొంత నిర్మాణ సంస్థకు 'డ్యూయెట్ మూవీస్' అనే పేరు పెట్టుకున్నారు.
- డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన ప్రకాశ్ రాజ్.. 1995లో జగపతిబాబు హీరోగా నటించిన 'సంకల్పం' సినిమాతో నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. గన్ షాట్, వినోదం, పవిత్ర బంధం, సుస్వాగతం, హిట్లర్ లాంటి చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
- తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రకాశ్ రాజ్ నటించారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ప్రతీ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండబుల్ యాక్టర్ గా కొనసాగారు. అన్ని భాషలు కలుపుకొని ఆయన 400 సినిమాలకి పైగా చేశారు.
- ప్రకాష్ రాజ్ అధ్బుతమైన నటనకు గుర్తుగా ఇప్పటిదాకా నాలుగు జాతీయ చలన చిత్ర పురస్కారాల్ని అందుకున్నారు. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే 8 నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఇవే కాకుండా 8 తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు, 3 విజయ అవార్డులు, 4 సైమా అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి.
- మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇద్దరు' (1998) చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా తొలిసారిగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు ప్రకాశ్ రాజ్. ఆ తర్వాత ప్రియదర్శన్ తెరకెక్కించిన 'కాంచీవరం' (2009) చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం సాధించారు. ఆయన నటించిన 'పుట్టక్కన హైవే' కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా నేషనల్ అవార్డ్ గెలుచుకుంది.
- ప్రకాష్ రాజ్ ముందుగా లలిత కుమారి అనే తమిళ నటిని వివాహం చేసుకున్నారు. ఆమె నటి డిస్కో శాంతికి సోదరి. అయితే వారికి ముగ్గురు సంతానం కలిగిన తరువాత విడాకులు తీసుకున్నారు. అనంతరం 2010 ఆగస్టులో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.
- సేవా కార్యక్రమాలు చేయటానికి ఎప్పుడూ ముందుడే ప్రకాశ్ రాజ్.. తన ఫౌండేషన్ ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. లాక్ డౌన్ లో వలస కూలీలకు తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయం అందించి వారి జీవితాలకు భరోసా కల్పించారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం 'అప్పు ఎక్స్ ప్రెస్' పేరుతో అంబులన్స్ సేవలు అందిస్తున్నారు.
- సినిమాలతో పాటుగా వివాదాలతోనూ సహవాసం చేస్తుంటారు ప్రకాశ్ రాజ్. ఇప్పటి వరకూ ఆరుసార్లు సినీ పరిశ్రమ ఆయనపై బ్యాన్ విధించింది. 'ఆగడు' సినిమా టైంలో దర్శకుడు శ్రీను వైట్లతో చెలరేగిన వివాదం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
- ప్రకాశ్ రాజ్ 2021లో జరిగిన 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వంతత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైయ్యారు.
Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...