Gaddar-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, ఆయన జేబులో చేయిపెట్టి డబ్బులు తీసుకొనేంత చనువు నాది: గద్దర్ వ్యాఖ్యలు వైరల్
పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పేవారు ప్రజా గాయకుడు గద్దర్. తాజాగా ఆయన చనిపోయిన నేపథ్యంలో పవన్ గురించి గద్దర్ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
జీవితాంతం ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. గుండెపోటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అన్ని పార్టీల నాయకులతో పాటు సినీతారలతోనూ మంచి సంబంధాలను కలిగి ఉండే వారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే గద్దర్ కు ఎంతో ప్రేమ ఉండేది. ఆయనే స్వయంగా పలుమార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ గురించి గద్దర్ ఏమన్నారంటే?
“పవన్ కల్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. పోరాట పరంగానూ, వ్యక్తిగతంగానూ బాగా ఇష్టపడతాను. నాకు ఆర్థికంగా అవసరం ఉన్న ప్రతిసారి వెళ్లి తనను కలిస్తాను. పవన్ జేబులో చేయి పెట్టి ఎన్ని డబ్బులు ఉంటే అన్ని తీసుకునే వాడిని. నా జేబులో పెట్టుకునేవాడిని. ఆయనతో నాకు అంత చనువు ఉంది. పవన్ తరచుగా నాకు లెటర్లు కూడా రాస్తాడు. అన్నయ్య బాగున్నవా? చల్లగా బతుకు అని చెప్పేవాడు” అని గద్దర్ తెలిపారు.
their bonding ❤️
— Rusthum (@RusthumHere) August 6, 2023
Miss u sir #Gaddarpic.twitter.com/1l50G0IU6X
గద్దర్ మృతిపట్ల పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
అటు గద్దర్ చనిపోయినట్లు తెలియగానే ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. గద్దర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకు వాయిస్ మెసేజ్ పంపినట్లు పవన్ గుర్తు చేశారు. ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకున్నానని, కానీ, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన్ వర్గాల కోసం పోరాడిన గద్దర్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయనతో పలు సందర్భాల్లో చాలా సమయం గడిపినట్లు చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచి శ్రీశ్రీ తర్వాత గద్దర్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
తుది శ్వాస విడిచిన ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.#Gaddar pic.twitter.com/5Ss0AtMhxa
— JanaSena Party (@JanaSenaParty) August 6, 2023
ప్రజా గాయకుడు గద్దర్ గురించి
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1949లో లచ్చమ్మ, శేషయ్య దంపతులకు తూప్రాన్ లో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించడంలో గద్దర్ ఎంతో కీలకపాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చిన ఘనత గద్దర్ దే. 1987లో కారంచేడులో దళితుల హత్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఫేక్ ఎన్ కౌంటర్లపై గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో గద్దర్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఏకంగా 2 లక్షల మంది ప్రజలు హాజరు కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 1997 ఏప్రిల్ లో గద్దర్ పై పోలీసులు కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒక్కటి తప్ప అన్ని బుల్లెట్ లను తొలగించారు. దాన్ని తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని కడుపులోనే బుల్లెట్ ను డాక్టర్లు వదిలేశారు. 76 ఏళ్ల వయసులో అనారోగ్యానికి చికిత్స పొందుతూ గద్దర్ కన్నుమూశారు.
Read Also: హిజ్రా పాత్రలో సుశ్మితాసేన్ - ‘తాళి’ ఫస్ట్‌లుక్ పోస్టర్ ట్రోల్స్‌పై షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial