Film Critic Eats Shoe: ‘టాప్ గన్’కు సీక్వెల్ వచ్చిందని, షూ తినేసిన సినీ విమర్శకుడు - నోరు జారితే అంతేగా, అంతేగా!
ఓ సీని విమర్శకుడి నోటి దురద, అదే నోటితో షూ తినేలా చేసింది. ఇంతకీ అతడు ఏమన్నాడు? అతడు ఎందుకు షూ తినాల్సి వచ్చింది?
ఒక సినిమాకు 36 ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తుందని ఎవరైనా ఊహించగలరా? ఆ సినీ విమర్శకుడు అదే అనుకున్నాడు. చివరికి నోరు జారి.. అదే నోటితో తన షూ తానే తినాల్సి వచ్చింది. అదేంటీ, సినిమా సీక్వెల్ విడుదలకు, అతడు షూ తినడానికి సంబంధం ఏమిటనేగా మీ సందేహం? అయితే, చూడండి.
యాక్షన్ హీరో టామ్ క్రూజ్ హీరోగా నటించిన ‘టాప్ గన్: మావరిక్’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ రివ్యూలతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 1986లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‘టాప్ గన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘టాప్ గన్: మావరిక్’ను చిత్రీకరించారు. ఇందులో టామ్ క్రూజ్ యుద్ధ విమానాల పైలట్‌గా నటించాడు.
పీట్ మావెరిక్ మిచెల్ (టామ్ క్రూజ్) అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్. 36 ఏళ్లుగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం అతనికి ఉంది. అతడు ఉన్నతాధికారి స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నా.. పైలట్‌గా ఉండటానికే ఇష్టపడతాడు. పదోన్నతలను పొందకుండా కెప్టెన్‌గానే మిగిలిపోతాడు. ఒక యుద్ధ విమానాన్ని పరీక్షించే క్రమంలో పరిమితికి మించిన వేగంతో వెళ్తాడు. దీంతో ఆ యుద్ధ విమానం ధ్వంసమవుతుంది. దీంతో అతడిని టెస్ట్ పైలట్ విధుల నుంచి తొలగించి.. ‘టాప్ గన్’ అకాడమీలో బెస్ట్ పైలట్స్‌కు శిక్షణ ఇవ్వాలని ఆదేశిస్తారు. తక్కువ ఎత్తులో ఎగురుతూ ఎత్తైన పర్వతాల మధ్య శత్రు దేశం ఏర్పాటు చేసిన యురేనియం ప్లాంట్‌ను ధ్వంసం చేసేలా వారికి ట్రైనింగ్ ఇవ్వాలని చెబుతారు. మరి, వారికి ఆ ట్రైనింగ్ ఇవ్వడంలో మావెరిక్ సక్సెస్ అయ్యాడా? ఆ టార్గెట్‌ను ఛేదిస్తాడా అనేది మిగతా కథ.
‘టాప్ గన్’ సీక్వెల్ వస్తుందనే సమాచారం ప్రపంచంలో ఉన్న టామ్ క్రూజ్ అభిమానులు అందరినీ ఆనందానికి గురిచేసింది. కానీ, ఒకే ఒక్క వ్యక్తిని మాత్రం ఆందోళనకు గురిచేసింది. పాలిగాన్ డిప్యూటీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎడిటర్ మాట్ ప్యాచెస్ ‘టాప్ గన్’కు సీక్వెల్ వస్తుందని అస్సలు ఊహించలేదు. మనకు తెలిసిన ఓ ప్రముఖ దర్శకుడిలా ఓడ్కా కొట్టి ట్వీట్ చేశాడో ఏమో.. అది ఊహించని విధంగా వైరల్ అయ్యింది. అది ఇప్పుడు అతడిని షూ తినేలా చేసింది.
Also Read: ఓ మై గాడ్, ‘టాప్ గన్’లో టామ్ క్రూజ్ నడిపిన ఆ జెట్ ఫ్లైట్‌కు అంత అద్దె చెల్లించారా?
షూ ఎందుకు తిన్నాడు?: 2010 సంవత్సరంలో మాట్ ప్యాచెస్ ఓ శపథం చేశాడు. టామ్ క్రూజ్ ఎప్పుడో నటించిన ‘టాప్ గన్’ సినిమాకు సీక్వెల్ రాదని అప్పట్లో ట్వీట్ చేశాడు. ఒక వేళ ఆ సినిమాకు సీక్వెల్ వస్తే తన షూ తానే తింటానని ప్రకటించాడు. కానీ, అతడి జోస్యం తప్పైంది. ‘టాప్ గన్: మావెరిక్’ వస్తుందని ప్రకటించిన రోజు నుంచి అతడికి నిద్రలేదు. మాట్ తన పాత ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు. ఇలాంటిది ఏదో చేస్తాడని, అతడి ఫాలోవర్లు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మరి మాట్‌ను వెంటాడారు. దీంతో అతడు ఇచ్చిన మాట ప్రకారం షూ తింటానని ప్రకటించాడు. ఈ సందర్భంగా యూట్యూబ్‌లో అతడు ఓ వీడియో విడుదల చేశాడు. నోటి దురద వల్ల ఇప్పుడు షూ తినాల్సిన దుస్థితికి వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా పిల్లల షూ తినడానికి ప్రయత్నించింది. అది చాలా కష్టంగా ఉందని చెప్పాడు. దీంతో అతడే కొన్ని చాక్లెట్ పదార్థాలతో తినేందుకు వీలైన బూటును స్వయంగా తయారు చేసుకున్నాడు. కాసేపు దానితో నడిచి.. దాన్ని నమిలి తినేశాడు. ఆ వీడియోను ఇక్కడ చూడండి:
Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?