Chiranjeevi Comments On Jailer : 'అలా చేస్తే నాకు తృప్తి ఉండదు'.. సూపర్ స్టార్‌పై మెగాస్టార్ సెటైర్ వేశారా?
కష్టపడి డాన్సులు, ఫైట్లు చేయకుండా.. అలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లి రీరికార్డింగ్‌తో సన్నివేశాన్ని లేపితే చాలదా అనుకుంటానని చిరంజీవి తెలిపారు. కానీ అలా చేస్తే ప్రేక్షకులకి, తనకు తృప్తి ఉండదన్నారు.
ఒక కథానాయకుడిగా సినిమాను ముందుండి నడిపించడానికి, ప్రేక్షకులని అలరించే మంచి చిత్రాన్ని అందించడానికి, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోడానికి 'హీరోలు' ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లో అభిమానులతో విజిల్స్ వేయిచాలంటే అధ్బుతమైన నటన కనబరచడమే కాదు, అదిరిపోయే డ్యాన్స్ లు చేయాలి.. రిస్కీ ఫైట్స్ చేయాలి. అలా ఎంతో కష్టపడి ఒళ్లు హూనం చేసుకుంటేనే తనకు తృప్తి ఉంటుందన్నారు మెగాస్టార్ చిరంజీవి.
68 ఏళ్ల వయసులో కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. రీ ఎంట్రీ తర్వాత ఒకే రోజు నాలుగు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్నారంటే.. సీనియర్ హీరో డెడికేషన్ ఎలాంటిదో, సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది అర్థమవుతుంది. తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణలో మాట్లాడిన చిరు.. ఏ రంగంలోనైనా సరే కష్టపడి పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా హీరోయిజం గురించి చిరు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
"ప్రతి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను కూడా ఎన్నిరోజులు ఇలా కష్టపడి డ్యాన్స్‌లు, ఫైట్‌లు చేయాలి, ఇక చాల్లేరా బాబూ అనుకుంటూ ఉంటాను. అలా నడుచుకుంటూ వెళ్లి, రీరికార్డింగ్‌తో భమ్ అని లేపేస్తే చాలదా అనుకుంటాను. హాయిగా వెళ్లి షూటింగ్ చేశామా.. మేకప్ తుడిపేసుకున్నామా.. డబ్బులిచ్చిరా జేబులో పెట్టుకున్నామా అన్నట్లు ఉంటే ఎంత బాగుంటుంది. కానీ అలాంటి పరిస్థితి కాదు మనది. మనం ఆడాలి, ఒరిగినల్గా ఫైట్లు చేయాలి, ఒళ్లు హూనం చేసుకోవాలి. అప్పుడు కానీ దర్శక నిర్మాతలకు తృప్తి ఉండదు, సినిమా చూసే ఆడియన్స్ కు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు" అని చిరంజీవి అన్నారు.
Also Read: టైగర్ నాగేశ్వరరావుకి మనసు ఇచ్చేసుకున్న మణి!
అయితే ఇప్పుడు చిరు కామెంట్స్‌ను కొందరు నెటిజన్లు 'జైలర్' సినిమాకు లింక్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఉద్దేశించే మెగాస్టార్ అలాంటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయ పడుతున్నారు. మరి కొందరు మాత్రం ఆయన ఉన్న విషయమే చెప్పాడని అంటున్నారు. ఇటీవల జైలర్ మూవీతో తలైవా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కీలక పాత్ర పోషించారు. తన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. రజినీ సైతం ఈ విషయాన్ని అంగీకరించారు.
‘జైలర్’ మూవీ సక్సెస్ మీట్‌లో అనిరుధ్ పై రజనీకాంత్ ప్రశంసలు కురిపిస్తూ.. ఈ విజయానికి మ్యూజిక్ ఒక కారణమని, బీజీఎంతో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడని అన్నారు. రీరికార్డింగ్ కి ముందు సినిమా చూసినప్పుడు యావరేజ్ ఫిలిం అవుతుందని అనుకున్నానని.. కానీ మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని అభిప్రాయ పడ్డారు. ఒక రకంగా అనిరుధ్ సంగీతమే ఈ చిత్రాన్ని కాపాడిందనే విధంగా మాట్లాడారు. ఇది దర్శకుడు నెల్సన్ పనితనాన్ని తలైవా తక్కువ చేసి మాట్లాడటమే అని ఆ సమయంలో సోషల్ మీడియాలో చర్చలు కూడా జరిగాయి.
కానీ ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యలు పరోక్షంగా రజినీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని, కష్టపడి డ్యాన్సులు ఫైట్లు చేయకుండానే బీజీఎంతో హీరోయిజం చూపించి హిట్టు కొట్టాడని చిరు అభిప్రాయ పడుతున్నట్లుగా వుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మెగాస్టార్ ఈ మాటలు నిజంగా 'జైలర్' ను రజినీకాంత్ ను ఉద్దేశించి అన్నారో లేదో కానీ, ప్రస్తుతం ఇదే అంశం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
కాగా, చిరంజీవి నటించిన 'భోళా శంకర్', రజనీకాంత్ 'జైలర్' చిత్రాలు రెండు రోజుల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. బాక్సాఫీసు దగ్గర భోళా భారీ డిజాస్టర్ గా మారితే, జైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో MEGA157 సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో రానున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. దీనితో పాటుగా తన కూతురు సుష్మిత నిర్మాణంలో గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చిరు ఓ సినిమా చేయనున్నారు.
Also Read: ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి.. ఎందుకంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial