Commitment Controversy : హిందూ మతం నాకు తల్లితో సమానం - క్షమాపణలు కోరిన 'కమిట్‌మెంట్' దర్శకుడు
'కమిట్‌మెంట్' ప్రోమోకి 'భగవద్గీత' శ్లోకం ఉపయోగించడం వివాదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హిందువులకు చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న క్షమాపణలు కోరారు.
తేజస్వి మదివాడ (Tejaswi Madivada), అన్వేషి జైన్ (Anveshi Jain), సీమర్ సింగ్, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కమిట్‌మెంట్'. ఇటీవల ఈ సినిమా ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. వాటికి నేపథ్య సంగీతంగా 'భగవద్గీత'లో శ్లోకం ఉపయోగించడం వివాదాస్పదం అయ్యింది.
రొమాంటిక్ సీన్స్‌కు భగవద్గీత శ్లోకమా?
'కమిట్‌మెంట్' ట్రైలర్ అంతా లిప్ లాక్స్, రొమాన్స్‌తో నింపేసి... చివర్లో 'మురికి చేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది' అంటూ 'భగవద్గీత'లో ప్రవచనం వినిపించడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా హిందువుల మనోభావాలు కించపరచడం తగదని చెబుతున్నారు. దాంతో దర్శకుడు క్షమాపణలు కోరారు.
'కమిట్‌మెంట్' కాంట్రావర్సీ నేపథ్యంలో దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ( కె చెన్నా ) స్పందించారు. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాము కావాలని విడుదల చేసిన వీడియో కాదని వివరించారు.
సినిమా టీమ్‌కు పంపిస్తే...
లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ ''అందరికీ నమస్కారం. నేనూ ఒక హిందువును. 'కమిట్‌మెంట్' చిత్ర దర్శకుడిని. ఇటీవల విడుదలైన మా సినిమా ప్రోమోకి భగవద్గీతలో కొన్ని లైన్లు వాడటం వెనుక ఎటువంటి సంచలనం సృష్టించే ఉద్దేశం లేదు. వ్యూస్ కోసం చేసింది అసలే కాదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే... ఆ వీడియో నేను కానీ, మా సినిమాలో నటించిన నటీనటులు గానీ, మా నిర్మాతలు గానీ విడుదల చేయలేదు. నా కథ తాలూకా ఆత్మ ఆ శ్లోకంలో ప్రతిబింబిస్తుంది కాబట్టి... నాకు నేనుగా ఆ వీడియో చేసి మా చిత్ర బృందంలోని సభ్యులకు పంపించాను. మాలో కొంత మంది ఎగ్జైట్ అయ్యి షేర్స్ చేయడం వల్ల వీడియో వైరల్ అయ్యింది'' అని వివరించారు.
దయచేసి క్షమించండి : దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా
హిందువులకు దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా క్షమాపణలు చెప్పారు. ''ఏది ఏమైనా వీడియో వైరల్ కావడంతో నా హిందూ సోదర సోదరీమణులు, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బ తిన్నందుకు... అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే... నాకు హిందూ మతం అనేది తల్లితో సమానం. నా హిందూ మతాన్ని నేను కించపరిస్తే... నా తల్లిని కించపరిచినట్టే. నేను అటువంటి పని చేయను. మీ మనోభావాలు దెబ్బతింటే... దయచేసి నన్ను క్షమించండి'' అని ఆయన విజ్ఞప్తి చేశారు. వీడియో పోస్ట్ చేసిన వాళ్ళు అందరినీ డిలీట్ చేయమని రిక్వెస్ట్ చేశారు.
Also Read : కొత్త బిజినెస్‌లోకి మహేష్ బాబు - త్వరలో హైదరాబాద్‌లో స్టార్ట్ చేయడానికి రెడీ
ఆగస్టు 19న 'కమిట్‌మెంట్' సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మహిళలకు ఎదురవుతున్న లైంగిక వేధింపులు, సహా జీవనం వంటి అంశాల నేపథ్యంలో సినిమా తీశారని తెలుస్తోంది.
Also Read : హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్