Thangalaan: డైలాగ్స్ లేవు, డబ్బింగ్ లేదు, ‘తంగలన్’ కంప్లీట్ డిఫరెంట్ మూవీ - విక్రమ్
చియాన్ విక్రమ్, పా రంజిత్ కాంబోలో వస్తున్న చిత్రం ‘తంగలన్‘. తాజాగా మూవీ టీజర్ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి విక్రమ్ కీలక విషయాలు చెప్పారు.
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన ఏ సినిమా చేసిన దాని కోసం ఎంతో కష్టపడతారు. పాత్ర ఏదైనా ఒదిగిపోయి జీవిస్తారు. ‘అపరిచితుడు,’ ‘శివపుత్రుడు,’ ‘నేను,’ ‘రావణ్’ లాంటి చిత్రాలు ఆయనలోని నటుడికి నిలువెత్తు నిదర్శనాలు. త్వరలో ‘తంగలన్‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు నుంచి విడుదలైన టీజర్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. ఆయన గెటప్, నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. గిరిజన నాయకుడిగా విక్రమ్ లుక్ చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. టీజర్ ఆద్యంతం ఒక్కంటే ఒక్క మాట కూడా లేకపోవడం విశేషం. వాగులో నీళ్ళల్లో పారిన రక్తం, పామును విక్రమ్ రెండు ముక్కలు చేయడం, పోరాట సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.
నా జీవితంలో ఎక్కువగా కష్టపడ్డ సినిమా ‘తంగలన్’- విక్రమ్
‘తంగలన్’ సినిమాలో డైలాగ్స్, డబ్బింగ్ అనేది ఏమీ లేదన్నారు నటుడు విక్రమ్. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం కష్టపడినట్లు చెప్పారు. “ఈ సినిమాలో నాకు డైలాగ్స్ ఉండవు. డబ్బింగ్ లేదు. ‘శివ పుత్రుడు’ మాదిరిగా కేవలం అరుపులే ఉంటాయి. ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా, రాగా, ఎమోషనల్ గా ఉంటుంది. ఇందులో సినిమా గ్లామర్ అస్సలు లేదు. పూర్తి డిఫరెంట్ మూవీ. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. రోజంతా రెస్ట్ ఉండేది కాదు. పొద్దున్నుంచి సాయంత్ర వరకు షూటింగ్ చేస్తూనే ఉండేవాళ్లం. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు నేను చేయలేదు. గిరిజనులు ఎలా జీవిస్తారో ఈ సినిమాలో అలాగే చేశాం. ఈ సినిమా తర్వాత దర్శకుడు రంజిత్ మరో లెవల్ కు వెళ్తాడని భావిస్తున్నా. ఈ సినిమా కోసం పని చేసిన అందరీ మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నా” అని విక్రమ్ వెల్లడించారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో తమిళ కూలీల అవస్థలు
దశాబ్దాల కిందట కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ‘తంగళన్’ తెరకెక్కింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో తమిళ కూలీలు అనుభవించిన అవస్థలను ఇందులో చూపిస్తున్నారు. ఈ విక్రమ్‌తో పాటు పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ కూడా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె.ఇ.జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. 'తంగలాన్' సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: కమెడియన్‌తో జతకట్టనున్న ‘చంద్రముఖి 2‘ బ్యూటీ, త్వరలో అధికారిక ప్రకటన!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial