Mr Bachchan: మూవీలో అమితాబ్, రేఖా ఫొటోలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం - ‘మిస్టర్ బచ్చన్’ మేకర్స్‌కు ఊహించని షాక్
రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ ఆగష్టు 15న విడుదల కానుంది. రీసెంట్ గా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వెళ్లిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు పలు కట్స్ విధించడంలో పాటు కీలక సూచనలు చేసింది.
Mr Bachchan Movie: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్‘. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ప్రేక్షకులను ఓ రేంజిలో అలరిస్తోంది. ‘మిస్టర్ బచ్చన్‘ సినిమాపై ప్రేక్షకులలో ఓ రేంజిలో అంచనాలు పెంచింది.
సెన్సార్ బోర్డు కీలక సూచనలు
రీసెంట్ గా ‘మిస్టర్ బచ్చన్‘ సినిమా సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లింది. ఈ మూవీని చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా రన్ టైమ్ 2.30 గంటలుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు కట్స్ చెప్పడంతో పాటు కీలక సూచనలు చేశారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ –రేఖ పోస్టర్ ప్లేస్ లో అమితాబ్-జయా పోస్టర్ వేయాలని సూచించారు. యు/ఎ సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు సినిమాలో పలు మార్పులు చేయాలన్నారు. ఈ మూవీలోని కొన్ని బూతు పదాలతో పాటు రక్తం కారే సన్నివేశాలను తొలగించాలని సూచించింది. కొన్ని పదాలను మ్యూట్ చేయాలన్నారు. ఈ చిత్రంలో ఓ చిన్నారి పొగతాగుతూ కనిపించిన రెండు నిమిషాల నిడివిగల సన్నివేశాన్ని మార్చాలని సూచించారు. పిల్లల చేతిలో బీడీ స్థానంలో పెన్సిల్ పెట్టాలన్నారు. పలు మార్పులు, చేర్పుల తర్వాత సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారు.
ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా ఆకట్టుకోనున్న రవితేజ
‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఓ రేంజిలో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇన్ కం టాక్స్ అధికారిగా రవితేజ విశ్వరూపం చూపించబోతున్నారట. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ డోస్ కుర్రకారును కవ్వించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ, భాగ్యశ్రీ రొమాన్స్ మాంచి కిక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మాస్ మహారాజా చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. తన మార్క్ విలనిజంతో ఆయన ఆకట్టుకోబోతున్నారు.
బాక్సాఫీస్ దగ్గగ ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఢీ
ఇక తెలుగులో అగష్టు 15 నాడు రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతున్నాయి. యంగ్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు ఢీ కొట్టబోతున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.