Bramayugam OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భ్రమయుగం’ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ ‘భ్రమయుగం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే డిజిటల్ వేదికపై అభిమానులకు అందుబాటులోకి రాబోతోంది.
Bramayugam OTT Release Date And Platform: విభిన్న కథాంశాలతో సినిమాలు చేయడంలో ముందుంటారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఇప్పటి వరకు ఆయన నటించిన ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలు చక్కటి ప్రజాదరణ దక్కించుకున్నాయి. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన రీసెంట్ మూవీ ‘భ్రమయుగం’. కేవలం మూడు, నాలుగు పాత్రలు ఉన్న ఈ సినిమాను రెండున్నర గంటల పాటు బ్లాక్ అండ్ వైట్ లో చూపించడం విశేషం. ఫిబ్రవరి 15న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. బ్లాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. మలయాళంలో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా తెలుగులోనూ విడుదల అయ్యింది. హారర్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
మార్చి 15 నుంచి 'భ్రమయుగం' స్ట్రీమింగ్
తాజాగా ‘భ్రమయుగం’ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మలయాళంలో థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వాస్తవానికి హిట్ సినిమాలు నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. కానీ, ఈ సినిమా మూడు వారాల తర్వాతే అభిమానులను అలరించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను సోని లివ్ దక్కించుకుంది. ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది. మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది.
View this post on Instagram
'భ్రమయుగం' కథ ఏంటంటే?
'భ్రమయుగం' సినిమా కథ 17వ శతాబ్దానికి చెందినది. మలబారు తీరంలోని ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా పనిచేసే దేవన్(అర్జున్ అశోకన్) అడవికి వెళ్లి తప్పిపోతాడు. అటూ ఇటూ తిరుగుతూ కుముదన్ పొట్టి(మమ్ముట్టి) నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా అక్కడే ఆశ్రయం పొందుతాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలని దేవన్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. చివరకు ఏమైంది? ఇంతకీ కుముదన్ పొట్టి ఎవరు? అనేది ఈ సినిమాలో చూపించారు దర్శకుడు. రాహుల్ సదాశివన్ 'భ్రమయుగం' సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భారతన్, అమాల్డా లిజ్, మణికందన్ ఆర్ ఆచారీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read Also: బాలయ్య మూవీలో ఛాన్స్ వచ్చినా ఎందుకు చేయలేదంటే?- అసలు విషయం చెప్పిన విశ్వక్ సేన్!