Vishwak Sen: బాలయ్య మూవీలో ఛాన్స్ వచ్చినా ఎందుకు చేయలేదంటే?- అసలు విషయం చెప్పిన విశ్వక్ సేన్!
Gaami Movie: విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన అడ్వెంచరస్ ఫాంటసీ మూవీ ‘గామి’. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో విశ్వక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.
Vishwak Sen Gaami Movie: టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో చాందినీ చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. విద్యాధర్ దర్శకత్వంలో అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సరికొత్త కథాంశంతో రాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
బాలయ్య మూవీలో ఎందుకు చేయలేదంటే?- విశ్వక్ సేన్
‘గామి’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు ఛానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ పలు కీలక విషయాలు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం బాలయ్య సినిమాలో అవకాశం వచ్చినా, చేయకపోవడానికి గల కారణాలను వివరించారు. “బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం వచ్చినా వదులుకున్నట్లు వార్తలు వచ్చాయి. నేను అప్పుడు టైట్ కమిట్మెంట్స్ లో ఉన్నాను. అదే సమయంలో బాలయ్యతో ఇంకా మంచి రోల్ చేయాలి అనిపించింది. వచ్చింది మంచి రోల్ కాదని కాదు. కానీ, ఇంకా మంచి రోల్ చేయాలి అనుకున్నాను. ఈ రెండు కారణాల వల్లే ఆ సినిమాలో చేయలేకపోయాను” అని వెల్లడించారు.
వాళ్లు నా గురించి చెప్తుంటే హ్యాపీగా ఉంటుంది- విశ్వక్
ఇక తన గురించి స్టార్ హీరోలు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లు గొప్పగా చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందని విశ్వక్ సేన్ చెప్పారు. “మనం చేసే పని చేసుకుంటే పోవడమే కాదు, నలుగురికి చెప్పాలి అనుకుంటాం. కానీ, బాలకృష్ణ గారు, జూ. ఎన్టీఆర్ అన్న, చరణ్ అన్న నేను కలిసినప్పుడు నా గురించి చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీలవుతాను. నేను ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో ఎవరినీ ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నించలేదు. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో పెద్దగా సహకారం కూడా లభించలేదు. నేనే ప్రొడక్షన్ లోకి దిగి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు నేను ఎవరి సపోర్టు తీసుకోలేదు. ఇక పైనా ఎవరి సపోర్టు అడగకూడదు అనుకుంటున్నాను. నాకు కావాల్సిన వ్యవస్థను నేను ఫామ్ చేసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. తొలి రోజుల్లో కొన్ని సినిమా అవకాశాలు ఇచ్చి తొలగించారు. సాయం చేస్తామని చెప్పి చేయలేదు. నా సొంత డబ్బు పెట్టుకుని ఇండస్ట్రీలోకి దిగిన తర్వాత నా మైండ్ సెట్ మారింది. ఇప్పటి వరకు ఎవరిని ఏమీ అడగలేదు కాబట్టి, ఇక ముందు కూడా ఎవరిని ఏమీ అడగకూడదనే ఆలోచనలో ఉన్నాను” అని చెప్పారు.
మార్చి 8న ‘గామి’ విడుదల
‘గామి’ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అటు విశ్వక్ సేన్ ‘గామి’తో పాటు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోనూ నటిస్తున్నారు.
Read Also: వెల్‌కాం టు హైదరాబాద్ - ఒకే నగరం భిన్న జీవితాలు, ‘ప్రేమలు’ తెలుగు వీడియో సాంగ్ చూశారా?