Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
నందమూరి నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ డిసెంబర్ 5న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకోవాల్సి ఉండగా.. సడెన్‌గా వాయిదా వేశారు. అంతే, ఈ వాయిదాతో మోక్షు ఎంట్రీపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
నందమూరి అభిమానులు ఎన్నాళ్లనుండో వేచి చూస్తున్న తరుణం ఆసన్నమైందని అంతా హ్యాపీగా ఉన్న సమయంలో.. షాకింగ్ న్యూస్ వాళ్లని కలవరపెట్టింది. అవును.. నందమూరి నట వారసుడి అరంగేట్రం విషయంలో నందమూరి అభిమానులు మరోసారి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు, టాలీవుడ్ అగ్రహీరో, పొలిటీషియన్ నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రానికి సంబంధించిన చిత్రం డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో సినిమా ఓపెనింగ్‌ను వాయిదా వేచినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అసలీ సినిమా వాయిదా పడిందా? లేక పూర్తిగా ఆగిపోయిందా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి.
ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
మొదటి సినిమా ఎవరికైనా చాలా స్పెషల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ నందమూరి నట వారసుడి ఎంట్రీ. నందమూరి అభిమానులు ఆనందోత్సవాల్లో ఉండగా... ఈ సినిమా ప్రారంభోత్సవం వాయిదా అంటూ ప్రకటన వచ్చింది. వాస్తవానికి ముహూర్తాల విషయంలో బాలయ్య ఎంత కచ్చితంగా ఉంటారో తెలియంది కాదు. అలాంటిది తన కుమారుడి మూవీని వాయిదా వేసే పరిస్థితి వచ్చిందో స్వయంగా బాలకృష్ణ చెప్పారు.
''ఈ రోజు సినిమా మొదలు పెట్టాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆయన (మోక్షజ్ఞ )కు ఒంట్లో బాలేకపోవడం వల్ల... ఇప్పుడు వాతావరణం బాలేదు కదా! మీరంతా చూస్తున్నారు... ఎక్కడ పడితే అక్కడ టైఫాయిడ్, ఫీవర్ వంటివి వస్తున్నాయి. రెండు రోజులుగా ఫీవర్ ఉన్నా... తగ్గుతుందని అనుకున్నాం. కానీ తగ్గలేదు. దాంతో ప్రారంభోత్సవం వాయిదా వేశాం. అంతా మన మంచికే'' బాలకృష్ణ వివరించారు. ప్రజల ఆశీస్సులు, మద్దతు తనయుడికి ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.
బాలకృష్ణ అంత చెప్పినా... కొందరిలో ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలు మొదలు అయ్యాయి. మోక్షజ్ఞకు నిజంగా ఫీవరే వచ్చి ఉండొచ్చు. కానీ, మోక్షజ్ఞ లేకుండా కూడా మూవీ ప్రారంభించవచ్చు. మూవీని ప్రారంభించేసి మోక్షుని పరిచయం చేయడానికి మరో వేడుక నిర్వహించి ఉండవచ్చు. అందులోనూ ప్రారంభోత్సవానికి నారా లోకేష్ గెస్ట్ అనేలా టాక్ వచ్చిన నేపథ్యంలో కూడా ఈ మూవీ ఓపెనింగ్ వాయిదా అంటూ ప్రకటించారంటే.. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందనేలా టాలీవుడ్‌లో గాసిప్స్ వర్గం మాట్లాడుకుంటోంది.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
మోక్షజ్ఞకు దిష్టి కొట్టిందా??
ఇంకా మొదటి చిత్రమే ప్రారంభోత్సవం జరుపుకోలేదు.. అప్పుడే మోక్షజ్ఞ రెండు, మూడు సినిమాల ప్రకటనలు కూడా వచ్చేశాయి. అసలు అరంగేట్రం సినిమా విషయానికి వస్తే.. నందమూరి మోక్షజ్ఞ సోదరి తేజస్విని సమర్పణలో SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెఱుకూరి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ‘హనుమాన్’ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఒక భాగంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం కాకుండానే, మోక్షు రెండో సినిమా ‘లక్కీ భాస్కర్’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అని (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది), మూడో సినిమా ‘ఆదిత్య 999’ అని.. ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహిస్తారనేలా ప్రకటన కూడా వచ్చేసింది. ఇలా వెంటవెంటనే మూడు సినిమాల ప్రకటనలతో దిష్టి కొట్టిందని, అందుకే మొదటి సినిమాకు బ్రేక్ పడిందనేలా నందమూరి అభిమానులు కొందరు కామెంట్స్ చేయడం విశేషం.