Anupama Parameswaran : అనుపమ ఇక ఉప్మా కాదు, గరం మసాలా - గ్లామర్ షో వర్కవుట్ అయ్యేనా?
ఇప్పటి వరకు అందం, అభినయంతో అలరించిన అనుపమ పరమేశ్వరన్, ‘టిల్లు స్క్వేర్’ మూవీలో గ్లామర్ షోకు తెరలేపింది. ముద్దులు, హద్దులు దాటిన అందాల ప్రదర్శనతో అందరినీ షాక్ కి గురి చేసింది.
Anupama Parameswaran's Bold Avatar: అనుపమ పరమేశ్వరన్.. ఫ్యాన్స్ అంతా ఆమెను ముద్దుగా అను ఉప్మా అని పిలుచుకుంటారు. నువ్వు నవ్వితే చాలు... అవే మాకు ముత్యాలని మురిసిపోతారు. అలాంటి అనుపమా ఇప్పుడు బిర్యానీలో వేసే గరం మసాలాలా మారిపోవడాన్ని చూసి.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘రౌడీ బాయ్స్’తోనే వామ్మో అనిపించిన అనుపమా.. ‘టిల్లు స్క్వేర్’లో గ్లామర్ డోసును మరింత పెంచేసి ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమె అభిమానులు.. ‘‘మేం ఉప్మానే అడిగాం. కానీ, నువ్వు బిర్యానీ వడ్డిస్తున్నావ్. అయినా కాదనం’’ అంటున్నారు.
ఇంతకాలం గ్లామరస్ పాత్రల జోలికి పోకుండా అందం, అభినయంతో అభిమానులను అలరించింది. పక్కింటి అమ్మాయిలా కనిపించే అనుపమ యాక్టింగ్ ను యూత్ చాలా ఇష్టపడతారు. ఇప్పటి వరకు ఆమె నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను చక్కగా ఆకట్టుకున్నాయి. కానీ, ఇప్పుడు అనుపమ కొత్త అవతారం ఎత్తింది. ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ లో అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపేసింది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ యాక్టింగ్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు మనం చూసి అనుపమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.
‘రౌడీ బాయ్స్’ చిత్రంలో లిప్ లాక్ సీన్
నిజానికి అనుపమ పరమేశ్వరన్ తనకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు లిప్ లాక్ సన్నివేశం ఉందని ఏకంగా సినిమానే రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, తను కూడా గ్లామర్ షోకు తెరతీసింది. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అయిన ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అనుపమ లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయింది. అభిమానులు ఈ సినిమాలో ఆమెను అలా చూసి అవాక్కయ్యారు. ఆ తర్వాత ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ల గురించి వివరణ ఇచ్చింది. సినిమా కాన్సెప్ట్ నచ్చినందుకే లిప్ లాక్ సీన్లలో నటించినట్లు చెప్పుకొచ్చింది.
‘టిల్లు స్క్వేర్’లో హాట్ హాట్ సీన్లు
ఇక ఇప్పుడు గ్లామర్ విషయంలో అనుపమ ఎవరి ఊహలకు అందనంత దూరం వెళ్లిపోయింది. ఆమె తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’లో హాట్ హాట్ సీన్లలో అలా ఒదిగిపోయింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో అనుపమ మాటలు, చేతలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. లిప్ లాక్ సీన్లతో అరాచకం సృష్టించింది రింగుల జుట్టు ముద్దుగుమ్మ. సిద్ధుతో కలిసి కిస్సింగ్ సీన్లను అవలీలగా చేసేసింది. సిద్దూ కూడా డైలాగులతో పాటు ముద్దు సీన్లతోనూ రచ్చ చేశాడు. వీరిద్దరి రొమాన్స్ చూసి ఆడియెన్స్ ఒక్కరు షాకయ్యారు. అనుపమ ఒక్కసారిగా ఇలా మారిపోయింది ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు.
పోటీని తట్టుకోవాలంటే గ్లామర్ షో తప్పదా?
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలోనూ అనుపమ లిప్ లాక్ సీన్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు సంప్రదాయ బద్దంగా కనిపించిన అనుపమ, ఒక్కసారిగా లిప్ లాక్ లతో రెచ్చిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అనుపమ ఎలాగైనా మళ్లీ ట్రాక్ లోకి రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆఫర్ల రావాలంటే ఇలాంటి బోల్డ్ సీన్లు చేయడం తప్పదంటున్నారు. ఆమె కూడా ఇతర హీరోయిన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవాలంటే ఈ మాత్రం గ్లామర్ షో తప్పదని భావిస్తోందట. ఇప్పటి వరకు అందం, అభినయంతో అలరించిన అనుపమ, గ్లామర్ పరంగా ఎలా రాణిస్తుందో చూడాలి. మార్చి 29న ‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే!