Actress Hema: బ్లాక్ మెయిల్ చేశారు, సెటిల్‌మెంట్‌కు పిలిచారు... త్వరలో ఆ ఫోన్ నంబర్స్ బయటపెడతా - హేమ సంచలన వీడియో
Hema Comments On Media: మీడియా మీద నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బ్లాక్ మెయిల్ చేశారని, సెటిల్మెంట్‌కు పిలిచారని ఆవిడ వీడియో విడుదల చేశారు. వేణు స్వామి తరహాలో ఆవిడ కూడా ఆరోపణలు చేశారు.
ఒక టీవీ ఛానల్ జర్నలిస్ట్ తనను ఐదు కోట్లు డిమాండ్ చేశారని వేణు స్వామి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. తన భార్యతో కలిసి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రజలలో అది చర్చకు దారి తీసింది. ఆ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదే రీతిలో నటి హేమ మీడియా మీద విరుచుకుపడ్డారు. మీడియా తనను బ్లాక్ మెయిల్ చేసిందని, సెటిల్మెంట్ చేసుకోమని కొందరు తనకు ఫోనులు చేశారని ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
వివాదానికి కారణమైన బెంగళూరు రేవ్ పార్టీ
బెంగళూరు నగరంలో ఆ మధ్య జరిగిన రేవ్ పార్టీ పలు వివాదాలకు కారణం అయ్యింది. అందులో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. పోలీసులు రెయిడ్ చేసినా ఫామ్ హౌస్ వద్ద నటి హేమ ఉన్నారు. ఆమెను విచారణకు పిలిచారు కూడా! ఆ సమయంలో మీడియా తన పరువు తీసిందని హేమ ఆవేదన వ్యక్తం చేశారు.
నా 35 ఏళ్ళ పరువును భూస్థాపితం చేశారు
''మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువును ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. అది లాండ్ ఆర్డర్ మ్యాటర్ కనుక వెంటనే బయటికి రాలేకపోయాను. ఏం జరిగిందనేది నేను చెప్పలేకపోయా. ఇప్పుడు కూడా విషయం కోర్టులో ఉంది. కానీ, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు... 'అక్క తప్పు లేకపోతే బయటికి రావాలి కదా! ఎందుకు రాలేదు?' అని అనుకుంటున్నారు. కోర్టు వ్యవహారాలు సంగతి మీకు తెలిసిందే. చాలా టైం పడుతుంది బయటకు రావడానికి. సో వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం జరిగిందో చెబుతా'' అని హేమ పేర్కొన్నారు. తన గురించి మీడియా లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేసిందన్నారు.
''నా బాధ ఏమిటంటే... నా శాంపిల్స్ పోలీసుల దగ్గర లేనప్పుడు నాకు పాజిటివ్ వచ్చిందని ఎలా కథనాలు ప్రసారం చేస్తారని బాధతో, ఉక్రోషంతో కొంచెం గట్టిగా అడిగా. అప్పుడు ఓవర్ యాక్టింగ్ అన్నారు. ఇప్పుడు నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. దీంట్లో నాకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది'' అని హేమ వివరించారు. తాను ఎటువంటి టెస్టులు చేయించుకోవడానికి రెడీ అని ఆవిడ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు.
View this post on Instagram
నేనొక తీవ్రవాది అన్నట్టు మీడియా ప్రచారం చేసింది!
తనను ఓ తీవ్రవాదిలా మీడియా చిత్రీకరించిందని, అందువల్ల పవన్ - రేవంత్ రెడ్డి దగ్గరకు ఎలా వెళ్ళాలో తెలియక వీడియో చేస్తున్నానని హేమ వివరించారు. తనను మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని, సెటిల్మెంట్స్ చేసుకోవడానికి రమ్మని కూడా పిలిచిందని ఆవిడ ఆరోపణలు చేశారు. కొందరు పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తామని పిలిచారని ఆవిడ పేర్కొన్నారు. ''నాకు, మీడియాకు ఎటువంటి గొడవలు లేవు. నేను ఎందుకు రావాలి? నేను తప్పు చేయనప్పుడు ఎందుకు సెటిల్మెంట్‌కు రావాలి. నన్ను ఎవరెవరు అయితే బ్లాక్ మెయిల్ చేశారో వాళ్ళ ఫోన్ నంబర్స్ నా దగ్గర ఉన్నాయి. నా నంబర్స్ కూడా త్వరలో అప్డేట్ చేస్తా'' అని హేమ చెప్పారు. తాను ఎటువంటి టెస్టులకు అయినా రెడీ అని ఆవిడ అన్నారు.
Also Read: వేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్, సూర్య సినిమాకు పోటీగా