రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందు మరో సినిమా చేయయబోతున్న మహేష్ బాబు - డైరెక్టర్ ఎవరంటే?
ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి కంటే ముందు మహేష్ మరో డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడట.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ఎస్.ఎస్ రాజమౌళి తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ మూవీ బౌండెడ్ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నారు. స్క్రిప్ట్ పూర్తి అవడానికి మరో ఆరు నెలలు పట్టొచ్చని చెబుతున్నారు. మహేష్ బాబు డిసెంబర్ నుంచి ఖాళీ అవుతాడు.
ఆ తర్వాత 'గుంటూరు కారం' ప్రమోషన్స్ కోసం తిరిగినా సంక్రాంతికి మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఆ తర్వాత ఫ్రీ టైం దొరుకుతుంది. అయితే రాజమౌళి మహేష్ ప్రాజెక్టు ను సెట్స్ పై తీసుకెళ్లేందుకు మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాను మొదలు పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడంతో ఆలోగా ఇంకో సినిమా చేయాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మహేష్ తో వేగంగా సినిమాలు చేసిన దర్శకులు ఇద్దరే. అందులో ఒకరు పూరి జగన్నాథ్ అయితే, రెండోది అనిల్ రావిపూడి. ఫస్ట్ ఆప్షన్ గా ఉన్న పూరి జగన్నాథ్ తో మహేష్ సినిమా అంటే ఇప్పట్లో అది సాధ్యం కాదు.
ఎందుకంటే పూరీ జగన్నాథ్ ప్రస్తుతం 'డబుల్ ఇస్మార్ట్' తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక రెండో ఆప్షన్ కొస్తే.. అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి'కి తుదిమెరుగులు దిగుతున్నాడు. దసరాకి సినిమా రిలీజ్ కూడా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఇంకెవరితోనూ ప్రకటించలేదు. కాబట్టి అనిల్ రావిపూడి తోనే మహేష్ బాబు మరో సినిమా చేసే అవకాశం ఉందట. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టైమ్ లోనే తన దగ్గర ఇంకో పవర్ఫుల్ సబ్జెక్టు ఉందని అనిల్ రావిపూడి అప్పట్లో హింట్ ఇచ్చారు. మహేష్ డేట్స్ ఇస్తే ఆరు నెలల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేసే టాలెంట్ అనిల్ రావిపూడికి ఉంది. కాబట్టి 'భగవంత్ కేసరి' రిలీజ్ తర్వాత మహేష్ ని కలిసి తన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని వినిపించబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మించబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 'ఏజెంట్', 'బోళాశంకర్' వంటి డబుల్ డిజాస్టర్స్ తో అనిల్ సుంకర తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాడు. కాబట్టి మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తే ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో వీరి కాంబోని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించేదాకా ఏమీ చెప్పలే కానీ, రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా రెండు, మూడేళ్ల టైం పడుతుంది. కాబట్టి రాజమౌళితో సినిమా కంటే ముందు మహేష్ మరో సినిమా చేయడం గ్యారెంటీ అని ఘట్టమనేని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read : విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు - అందుకే ఆయన అలా చేశారు: ముత్తయ్య మురళీధరన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial