Chiranjeevi Birthday Special: 30 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఘరానా మొగుడు’
మూడు దశాబ్దాల క్రితం విడుదలై తెలుగునాట సంచలన విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఘరానా మొగుడు’. చిరు బర్త్ డే సందర్భంగా థియేటర్లలో మరోసారి సందడి చేయబోతుంది..
తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. అభిమానులు గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాలి అనే లక్షణాన్ని అక్షరాలా పాటించే చిరంజీవి.. ఈ నెల 22న తన 67వ బర్త్ జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించి ఓ బ్లాక్ బస్టర్ మూవీని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.
టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ మొదలయ్యింది. స్టార్ హీరోల పుట్టిన రోజుల సందర్భంగా వారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మెగాస్టార్ వరకు చేరింది. ప్రిన్స్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలు అయిన ‘పోకిరి’, ‘ఒక్కడు’ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ‘ఘరానా మొగుడు’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అటు చిరంజీవి బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 22న సంబరాలు అంబరాన్ని అంటేలా ప్లాన్ చేస్తున్నారు.
మూడు దశాబ్దాల క్రితం తెలుగు నాట సంచలన విజయాన్ని అందుకుంది ‘ఘరానా మొగుడు’ సినిమా. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అందాల ముద్దుగుమ్మలు నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నటుడు రావు గోపాల రావు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. దేవి వర ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. 1992 ఏప్రిల్ 9 ఈ సినిమా విడుదల అయ్యింది. అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అదే సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది. కొన్నిసెలెక్ట్ చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అటు ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రతగా ఎదురుచూస్తున్నారు. 30 ఏండ్ల క్రితం చిరంజీవిలోని ఎనర్జీ, యాక్టింగ్, స్టైల్ ను చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్నారు. అటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో 154వ సినిమాను లైన్లో పెట్టారు. మరికొన్ని సినిమాలకు సంబంధించి కథలు కూడా వింటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కుర్రహీరోలతో పోల్చితే మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన నటించిన ఆచార్య సినిమా విడుదలైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ భావించినా.. అనుకున్న స్థాయిలో ఆడలేదనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా.. తండ్రితో పాటు తనయుడు రామ్ చరణ్ కూడా ఇందులో నటించారు.
Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?