Chiranjeevi Godfather Success Meet : 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?
చిరంజీవి మనసును బాధ పెట్టిందెవరు? 'మెగాస్టార్ ను తొక్కేయాలని చూశారా? 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లో చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. దాంతో ఆయన ఆవేదన ఎవరి గురించి? అనే చర్చ మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాధ పడ్డారు. ఆయన బాధ ఏదో ఓ సినిమాకు మర్చిపోయేది కాదు. నలభై ఐదేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా ఉన్న చిరంజీవిని టార్గెట్ చేసి ఆయన సినిమాకు నష్టం కలిగేలా చేశారు. ఇదంతా ఎవరో మాట్లాడిన గాసిప్స్ కాదు. నేరుగా చిరంజీవే చెప్పుకొన్న ఆవేదన. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ వేదికగా మెగాస్టార్ మనసులో నుంచి వచ్చిన బాధ ఇది.
భయంతో 'గాడ్ ఫాదర్' టీమ్!
పాలిటిక్స్ దూరమై సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ రేంజ్ హిట్ పడలేదు. అప్పటి నుంచి ఆయన చేస్తున్న సినిమాల ఫలితాలు ఆయన చేతుల్లో లేకుండానే పోతున్నాయి. మరీ ముఖ్యంగా 'ఆచార్య' డిజాస్టర్ తర్వాత చిరంజీవి నుంచి జాలి పడిన వాళ్లు ఎందరో. ఎలాంటి చిరు ఏమై పోయారు అంటూ కామెంట్లు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మీడియా సంస్థలు 'గాడ్ ఫాదర్'ను కావాలనే టార్గెట్ చేశాయని చిరంజీవి నేరుగా విమర్శించారు. సినిమాకు బజ్ లేదని... సినిమా ఆడే అవకాశం ఉండదని కథనాల మీద కథనాలు ప్రసారం చేశారని... దీని వల్ల 'గాడ్ ఫాదర్' టీమ్ అంతా చాలా భయపడిందని చెప్పుకొచ్చారు మెగాస్టార్.
రాయలసీమలో వర్షంలో మాట్లాడింది అందుకే!
ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఆ కథనాలకు భయపడి నేరుగా తన దగ్గరకే వచ్చి 'ఏంటి ఇలా అంటున్నారు?' అంటూ బాధపడ్డారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. రాయలసీమలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినప్పుడు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాని చిరంజీవి చెప్పారు. వర్షం కారణంగా ఆ ఈవెంట్ రసాభాసగా మారిపోయిందని ఎక్కడ కథనాలు ప్రసారం చేస్తారో అని భయపడినట్లు చిరంజీవి తెలిపారు. అందుకే అప్పటికప్పుడు అనుకుని వర్షంలో తడుస్తూనే రాయలసీమతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నానని చెప్పారు.
విషపు ప్రచారం జరిగింది
తన చేతిలో లేని విషయాలను కూడా తనకే ఆపాదిస్తూ కెరీర్ లో తొలిసారి తన మీద జరిగిన ఈ విషపు ప్రచారం చాలా బాధ పెట్టిందని మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రతీ ఒక్కరూ సినిమాను అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారని తన లైఫ్ లో తీసిన మంచి సినిమాల్లో టాప్ 15లో గాడ్ ఫాదర్ ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Also Read : Chiranjeevi Vs Garikapati : 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్
మెగాస్టార్ గా ఆయన స్థాయి వేరు... ఆయన స్థానం వేరు. ఆయనతో జీవితంలో ఒక్క సినిమా అయినా తీయాలనే వేచి చూసే దర్శకులు ఇప్పటికీ కోకొల్లలు. అలాంటి చిరంజీవి 'గాడ్ ఫాదర్' విడుదల సందర్భంగా ఇంత ఒత్తిడిని ఎదుర్కొన్నాని చెప్పటం అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినిమా అభిమానులను ఆలోచించేలా చేస్తోంది.
దసరా సందర్భంగా తెలుగునాట థియేటర్లలో విడుదలైన 'గాడ్ ఫాదర్' కు హిట్ టాక్ లభించింది. తెలుగులో రెండు రోజుల్లో 69 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. హిందీలో కూడా సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. నార్త్ ఇండియాలో సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత 600 స్క్రీన్లు యాడ్ చేశారంటే... 'గాడ్ ఫాదర్'కు అక్కడ ఎటువంటి స్పందన లభిస్తుందో ఊహించవచ్చు.