దక్షిణాదిలోనే నెపోటిజం ఎక్కువ - ఒకే కుటుంబానికి చెందిన హీరోలకే అవకాశాలు: బాలీవుడ్ నటుడు గుల్షన్
దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి ఓ బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నెపోటిజం.. ఈ మాట వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్ చిత్రపరిశ్రమే. ఎందుకంటే...ఈ నెపోటిజం అనే టాపిక్ తెచ్చింది, హైలైట్ చేసింది, రచ్చచేసింది బాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోయినే. ఆమె ఎవరో ఈ పాటికి మీకూ తెలిసిపోయే ఉంటుంది. ఆమె మరెవ్వరో కాదు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. కొన్నేళ్ల క్రితం ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే కాఫీ విత్ కరణ్ షోకు కంగన వెళ్లింది. అప్పుడు కరణ్‌ని పట్టుకుని నెపోటిజంకు నువ్వు పెట్టింది పేరు అనేసింది. అప్పటినుంచి కరణ్‌కే కాదు తల్లిదండ్రుల అండ చూసుకుని ఇండస్ట్రీకి వస్తున్నవారిపై చాలా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు ఈ నెపోటిజం గురించి మళ్లీ ఎందుకు చర్చ వచ్చిందంటే.. గుల్షన్ దేవయ్య అనే బాలీవుడ్ నటుడు ఈ టాపిక్ గురించి ప్రస్తావిస్తూ.. మన సౌత్ స్టార్ల గురించి నోరుపారేసుకున్నాడు.
బాలీవుడ్‌లో నెపోటిజం ఉన్నప్పటికీ.. ఈ విషయంలో సౌత్ ఇండస్ట్రీ గురించే ఎక్కువగా మాట్లాడుకోవాలని ఎందుకంటే బాలీవుడ్‌లో ఉన్నంత స్వేచ్ఛ.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేదన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే.. నెపోటిజం అని గొంతుచించుకుంటూ ఉంటాం కానీ.. ఈ నెపోటిజం బాలీవుడ్ కంటే ఇప్పుడిప్పుడు పాపులర్ అయిపోతున్న దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే ఎక్కువగా ఉంది. ఇది నిజం. ఎంతైనా బాలీవుడ్‌లో బయటి నటులకు ఉన్నంత స్వేచ్ఛ టాలీవుడ్‌లో లేదు. కావాలంటే మీరే చూసుకోండి.. నాలుగు తరాలుగా ఒకే కుటుంబానికి చెందిన హీరోలే దక్షిణాదిని ఏలుతున్నారు. బయటి నుంచి వచ్చి టాలెంట్ నిరూపించుకుని నిలబడ్డవారు చాలా తక్కువ. బాలీవుడ్‌లో నెపోటిజం లేదు అనడంలేదు. నెపోటిజం ఉంది. కాకపోతే నాలాగా బయటి నుంచి వచ్చే వాళ్లకి కూడా మంచి ఛాన్సులు దొరుకుతున్నాయి. వాళ్లూ చక్కటి జీవితాలను అనుభవిస్తున్నారు. ఉదాహరణకు నాతో పాటు విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్‌ను తీసుకోండి. మేం బాలీవుడ్‌లో దొరికే అవకాశాలతో సంతోషంగానే ఉన్నాం. నిజానికి నెపోటిజం అనేది ఓ చెత్త వాదన. దీనిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లవి ఉంటాయి. కొందరికి సరైనది అనిపిస్తుంది. మరికొందరు తప్పుబడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ అనేది ప్రభుత్వ ఉద్యోగం కాదుగా.. ఇది ప్రైవేట్ జాబ్ లాంటిది. అలాంటప్పుడు ఎవరి రూల్స్ వాళ్లకి ఉంటాయి. ఫలానా క్యారెక్టర్‌కి ఎవరైతే బాగుంటారో వారినే తీసుకుంటారు. అంతేకానీ కేవలం టాలెంట్‌ని చూసి తీసుకోవాలనేం లేదు కదా. బహుశా అది సరైన పద్ధతి కాకపోవచ్చు. కానీ వాళ్లు అలాగే ఎంపికచేసుకుంటారు. ఇదేం ఐఏఎస్, ఐపీఎస్‌కి ఎంపికవ్వడం లాంటిది కాదు కదా మంచి ర్యాంకులు చూసి ఛాన్సులు ఇవ్వడానికి. నాక్కూడా అవకాశాలు వచ్చినట్లే వచ్చి పోయాయి. నాదాకా వచ్చిన క్యారెక్టర్ మరో నటుడికి వెళ్లిపోయేది. చాలా బాధపడ్డాను. కానీ ఎప్పుడూ కుళ్లుకోలేదు. అంతేకాదు ఇప్పుడు సినిమాలపై బాయ్‌కాట్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి కారణం కూడా నెపోటిజమే’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు గుల్షన్.
అయితే గుల్షన్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతను బాలీవుడ్‌కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటంలో తప్పు లేదు కానీ సౌత్ ఇండస్ట్రీలోని హీరోలను అనడం సబబు కాదని బాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రోగా మాట్లాడితే ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే అతను ఇలా కామెంట్లు చేస్తున్నాడని అంటున్నారు.