Bigg Boss Season 7 Day 11 Updates: హౌస్‌మేట్స్, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన ‘మొండి’ రతిక - బూతులు తిట్టిన అమర్!
ఆటను తానే డిసైడ్ చేయాలనే ఉద్దేశ్యంతో రతిక.. కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిచింది. ఆఖరికి బిగ్ బాసే స్వయంగా ప్రకటించేవరకు కూడా తన మొండితనాన్ని వీడలేదు.
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7)లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు కూడా దానిని ఆసక్తిగానే చూస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో మనుషుల మధ్య గొడవలు పెట్టి.. ప్రేక్షకులు అది చూసి ఎంజాయ్ చేసేలా చేయడమే మేకర్స్ ప్లాన్. ఆ ప్లాన్ అర్థమయిన కొందరు కంటెస్టెంట్స్ కూడా కావాలని ఇతర కంటెస్టెంట్స్‌తో గొడవలు పెట్టుకుంటారు. తాజాగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తుంటే.. రతిక కూడా అదే ప్లాన్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. నేడు (సెప్టెంబర్ 14న) ప్రసారమైన ఎపిసోడ్ మొత్తం చాలావరకు రతిక చుట్టూనే తిరిగింది. తను తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడే మాటలు చుట్టూనే ఎపిసోడ్ అంతా డిసైడ్ అయ్యింది.
పవర్ అస్త్రాను సొంతం చేసుకోవాలంటే ముందుగా మాయాస్త్రం కోసం పోటీపడాలి అంటూ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరినీ రెండు టీమ్స్‌గా విభజింజారు బిగ్ బాస్. అవే రణధీర, మహాబలి. ఆ రెండు టీమ్స్‌కు రెండు ఛాలెంజ్‌లు పెట్టగా.. ఆ రెండిటిలో రణధీర టీమ్ గెలిచింది. అందుకే రణధీర టీమ్‌లో ఉన్న శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, ప్రియాంక, శోభా శెట్టికు మాయాస్త్రాలు దక్కాయి. కానీ ఆ ఆరుగురి నుండి పవర్ అస్త్రా మాత్రం ఒక్కరితో దక్కే ఛాన్స్ ఉంది. అది ఎవరికి దక్కాలి అనుకుంటున్నారో మహాబలి టీమ్ నుండి కంటెస్టెంట్స్ వచ్చి వారి, వారి అభిప్రాయాలు చెప్పాలని బిగ్ బాస్ తెలిపారు. అక్కడ అసలు కథ మొదలయ్యింది.
మాయాస్త్రాన్ని కోల్పోయిన ముగ్గురు..
మహాబలి టీమ్‌లో శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, దామిని, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, రతిక ఉన్నారు. అయితే వారంతా కలిసి అసలు పవర్ అస్త్రా అసలు రణధీర టీమ్‌లో ఎవరికీ దక్కకుండా ఉండేలా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ చెప్పినదాని ప్రకారం.. మహాబలి టీమ్ నుండి కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వచ్చి రణధీర టీమ్‌లో ఎవరైతే పవర్ అస్త్రాకు అర్హులు కాదని అనుకుంటున్నారో వారి దగ్గర ఉన్న మాయాస్త్రాన్ని తీసుకొని అదే టీమ్‌లో ఇంకొక కంటెస్టెంట్‌కు ఇవ్వాలి. ముందుగా శుభశ్రీ వచ్చి శోభా శెట్టి దగ్గర నుండి మాయాస్త్రాన్ని తీసుకొని ప్రిన్స్ యావర్‌కు ఇచ్చింది. శోభా శెట్టి కంటే యావరే అర్హుడు అని కారణం చెప్పింది. ఆ తర్వాత వచ్చి పల్లవి ప్రశాంత్.. అమర్‌దీప్ ఆట సరిగా ఆడలేదని, నడుము నొప్పి వస్తుంది అన్నాడని కారణం చెప్పి శివాజీకి అమర్ మాయాస్త్రాన్ని తీసుకొని ఇచ్చాడు. ఆ తర్వాత దామిని వచ్చి ప్రియాంక దగ్గర తీసుకొని షకీలాకు ఇచ్చింది.
అందరూ బఫూన్స్..
మహాబలి టీమ్ నుండి వెళ్లాల్సిన మూడో కంటెస్టెంట్ ఎవరు అనే చర్చ మొదలయ్యింది. చివరిగా వెళితే ఆటను డిసైడ్ చేయవచ్చనే కారణంతో టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ చివరిలో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే రతికను ముందుగా వెళ్లమన్నారు. వారి స్ట్రాటజీ అర్థమయిన రతిక.. అసలు వెళ్లనంటూ మొండికేసింది. టీమ్‌లో తన మాట ఎవరూ వినడం లేదని నిందలు వేసింది. ‘గట్టిగా మాట్లాడకు. నేను కూడా మట్లాడగలను’ అంటూ దామినిపై అరిచింది. దీంతో దామిని కన్నీళ్లు పెట్టుకుంది. అలా ఎంతసేపు అయినా రతిక వెళ్లడానికి సిద్ధం కాకపోవడంతో గౌతమ్ కృష్ణ, సందీప్ కూడా సహనం కోల్పోయి అరిచారు. తన టీమ్ అంతా బఫూన్స్ అని, అలాగే ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్ చేసింది రతిక. దీంతో రతికకు, ఇతర మహాబలి టీమ్ మెంబర్స్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.
కోపంతో ఊగిపోయిన అమర్‌దీప్..
రతిక సమయాన్ని వృధా చేస్తుంది అని గమనించిన బిగ్ బాస్.. తరువాతి మహాబలి టీమ్ నుండి ఎవరు రావాలి అనేది రణధీర టీమ్ మెంబర్స్‌ను డిసైడ్ చేయమన్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం రణధీర టీమ్‌లో ఎవరి చేతిలో అయితే మాయాస్త్రం లేదో వారు ఇక ఆటలో లేనట్టే అని ప్రకటించాడు. అంటే శోభా శెట్టి, ప్రియాంక, అమర్‌దీప్ ఇక ఆటలో లేనట్టే. ఇలా ప్రకటించిన తర్వాత అమర్‌దీప్ కోపంతో ఊగిపోయాడు. రెండురోజులు అంత కష్టపడి ఆడిన తర్వాత ఇంత చిన్న కారణం వల్ల ఆట నుండి తప్పుకోవాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు పల్లవి ప్రశాంత్ చెప్పింది పాయింటే కాదంటూ విమర్శించాడు. చివరిగా భూతులు కూడా మాట్లాడాడు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 7లో రెండోవారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఉన్నది వారే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial