Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ‘లవ్ స్టోరీ’లు.. వీరి ప్రేమలు గాల్లో దీపాలు.. గెలుపు కోసం డ్రామాలు!
బిగ్ బాస్‌లో ప్రేమలు నిజమేనా? గత నాలుగు సీజన్లలో ఉన్న జంటలు బయటకు వెళ్లక కలిశారా? గెలుపుకోసమేనా ఈ ‘లవ్ స్టోరీ’లు?
‘బిగ్ బాస్’ సీజన్ మొదలవుతుందంటే.. ప్రతి ఒక్కరిలో ఏయే సెలబ్రిటీలు ఇంట్లోకి వెళ్తారనే ఆశక్తి కలుగుతుంది. ఆ తర్వాత ఆ కంటెస్టెంట్లలో ఉండే సింగిల్స్ మీద దృష్టి పడుతుంది. అయితే.. బిగ్ బాస్ మొదట్లో వచ్చిన కంటెస్టెంట్లకు తోటి సభ్యులతో లవ్ ట్రాక్ నడపాలనే ఆలోచన ఉండేది కాదు. అయితే, ఇటీవల మొదలైన సీజన్లో ‘సింగిల్’ కంటెస్టెంట్లు.. ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ నడిపి వంద రోజులు హౌస్‌లో పాతుకుపోవాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇందుకు కారణం.. గత సీజన్లో నడిచిన ‘లవ్ ట్రాక్’లే కారణం. ముఖ్యంగా ‘బిగ్ బాస్’ సీజన్ 4లో ‘అభి-మోనాల్-అఖిల్’ మధ్య నడిచిన ప్రేమాయణమే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త సభ్యులు.. వెంటనే సింగిల్ కంటెస్టెంట్లలో కొందరు మొదటి ఎపిసోడ్ నుంచే కుర్ర జంటలను కలిపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా కాజల్, యానీ మాస్టర్లు దీనిపై పెద్ద చర్చే జరిపారు. మరి, బిగ్ బాస్‌లో మనకు కనిపించే ప్రేమలు.. డ్రామాలేనా? ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండేందుకు ‘పులిహోర’ కలిపేందుకు కంటెస్టులు ఆసక్తి చూపుతున్నారా? గతంలో బిగ్ బాస్‌లో లవ్ ట్రాక్ నడిపిన జంటలు బయటకు వెళ్లాక వారి ప్రేమ కొనసాగిందా? బిగ్ బాస్ పంజరంలో కలిసి ఉన్న ప్రేమ పక్షులు.. బయటకు వెళ్లాక కలిశాయా? ఎగిరిపోయాయా?
‘బిగ్ బాస్’ సీజన్-1: బిగ్ బాస్ మొదటి సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సభ్యులకు కేవలం హిందీ బిగ్ బాస్ మీదే అవగాహన ఉండేది. అయితే, ప్రత్యేకంగా లవ్ ట్రాక్ నడపాలనే ప్లాన్ మాత్రం రాలేదనేది ఎపిసోడ్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే, ఒకే ఇంట్లో సింగిల్స్ ఎక్కువ రోజులు గడపాలంటే ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందని భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌కు దీక్షా దొరికింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దీక్షతో ప్రిన్స్ చనువుగా ఉంటూ.. ఇద్దరి మధ్య ఏదో ఉందనే భ్రమ కల్పించాడు. ఓ సందర్భంలో ఆమెకు ముద్దు కూడా పెట్టేశాడు. 70 రోజల బిగ్ బాస్‌లో ఈ జంట సుమారు 63 రోజులు హౌస్‌లో ఉన్నారు. అయితే, హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిద్దరూ ఎక్కడా కలిసిన సందర్భాలు కూడా లేవు. వీరికి సినిమాల్లో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఇద్దరు ఎవరు జీవితాన్ని వారు గడుపుతున్నారు. ఈ సీజన్లో శివబాలజీ టైటిల్ సాధించాడు.
సీజన్ 2లో..: బిగ్ బాస్ సీజన్ 2లో మాత్రం లవ్ ట్రాక్‌లు బాగానే నడిచాయి. ఈ సీజన్లో తనీష్-దీప్తి సునయనాల లవ్ ట్రాక్ చర్చనీయమైంది. అప్పటికే దీప్తి సునయనా.. షన్ముఖ్ జస్వంత్ (బిగ్ బాస్ -5 కంటెస్టెంట్)తో లవ్‌లో ఉంది. అయితే, హౌస్‌లో మాత్రం ఆమె తనీష్‌కు దగ్గర కావడంతో దీప్తి-షన్నులకు బ్రేకప్ అయినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు.. ఎనిమిదో రోజు వైల్డ్ ఎంట్రీ ఇచ్చిన నందినీ కూడా తనీష్‌తో లవ్ ట్రాక్ నడిపింది. మధ్యలో ఆమె గందరగోళానికి కూడా గురవ్వుతూ అందరినీ కన్‌ఫ్యూజ్ చేసేది. మిడ్ నైట్ హగ్గులతో హౌస్‌ను హీటెక్కించింది. మరో సభ్యుడు సామ్రాట్ కూడా తేజస్వితో ట్రాక్ నడిపాడు. అయితే, సామ్రాట్ తల్లికి ఆమెతో ప్రేమాయణం ఇష్టం లేకపోవడంతో వారిద్దరు బయట కలవడం కష్టమని తేలిపోయింది. ఈ జంటలు కూడా బయటకు వెళ్లిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. కేవలం రియాలటీ షోలో మాత్రమే కలిసి కనిపిస్తున్నారు. అయితే, ఈ సీజన్లో ఏ లవ్ ట్రాక్ నడపని.. కౌశల్ విజేతగా నిలిచాడు.
సీజన్ 3లో..: ఈ సీజన్లో లవ్ బర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవీ మధ్య నడిచిన లవ్ ట్రాక్.. ప్రేక్షకులకు కూడా నచ్చింది. వీరిద్దరు బయటకు వెళ్లిన తర్వాత కూడా కలిసి ఉంటారనే అనిపించేలా వారి బాండ్ కనిపించింది. అయితే, బయటకు వెళ్లిన తర్వాత వీరు క్లోజ్‌గానే కనిపించారు. రియాలిటీ షోల్లో సైతం కలిసి కనబడుతూ.. వీరు తప్పకుండా ఒక్కటవ్వుతారనేలా భ్రమ కల్పించారు. కానీ, ఊహించని విధంగా వారి మధ్య దూరం పెరిగింది. రాహుల్ సిప్లిగంజ్.. అనుకోకుండా అషు రెడ్డితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా పలు రూమర్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఈ సీజన్లో లవర్ బాయ్.. రాహుల్ విజేతగా నిలవడం గమనార్హం.
సీజన్ 4లో..: ఈ సీజన్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మీకు తెలిసిందే. మొదట ‘అభిజిత్-మోనల్’ మధ్య పుట్టిన ప్రేమ.. క్రమేనా ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా మారింది. మోనల్.. అఖిల్‌తో కూడా చనువుగా ఉండటం, అఖిల్.. మోనల్‌ను ఇష్టపడటంతో కథ మారిపోయింది. దీంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. అయితే, మోనల్‌కు అభి దూరమై.. హారికాకు దగ్గరయ్యాడు. దీంతో ప్రేక్షకులు ‘అభి-హారిక’ జంటను ఇష్టపడటం మొదలుపెట్టారు. ఈ సీజన్లో అభిజిత్ విజేతగా నిలిచాడు. అయితే, బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అభి.. హారికను ఒక్కసారి కూడా కలవలేదు. పైగా ఆమె తనకు చెల్లిలాంటిదని చెప్పడంతో ఆ ట్రాక్‌కు పుల్‌స్టాప్ పడినట్లయ్యింది. అయితే, అఖిల్-మోనల్ అప్పుడప్పుడు కలుస్తున్నా.. వారి మధ్య బిగ్ బాస్‌లో ఉన్నంత ప్రేమ ఉందా.. లేదా అనేది చెప్పడం కష్టం. జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా అరియానాతో లవ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నించినా.. అంతగా వర్కవుట్ కాలేదు. బయటకు వచ్చిన తర్వాత ఆ జంట లవ్ ట్రాక్‌ను వాడుకోవాలని ఓ టీవీ చానెల్ ప్రయత్నించింది. కానీ, పెద్దగా ఫలితం ఇవ్వలేదు.
సీజన్ 5లో..: గత సీజన్ల ప్రభావం ఈ కంటెస్టెంట్లు మీద బాగా పడింది. ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే.. ఎవరు ఎవరితో లవ్ ట్రాక్ నడిపితే బాగుంటుందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా కాజల్.. ఆ బాధ్యతలు తన భుజం మీద ఎత్తుకుంది. సింగర్ శ్రీరామచంద్ర.. హమీదాతో లవ్ ట్రాక్ నడిపేలా ప్రేరేపించింది. మరోవైపు మానస్ కూడా లహరీతో క్లోజ్‌గా ఉంటూ.. సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. అనిపించుకున్నాడు. అయితే ఆమె మధ్యలో వెళ్లిపోవడంతో మానస్ ఒంటరివాడయ్యాడు. అయితే, ప్రియాంక మాత్రం మానస్‌పై మనసుపడినా.. ప్రస్తుతం వన్ సైడ్ లవ్ మాత్రమే. మరి, శ్రీరామచంద్ర-హమీదా జంట చివరి వరకు తమ ప్రేమను కొనసాగిస్తారా.. లేదా అనేది చెప్పడం కష్టమే. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్. ఏమైనా జరగొచ్చు. మరి.. ఈ జంటైనా బయటకు వచ్చిన తర్వాత కలిసి ఉంటారో.. ‘తూచ్’ అని చెబుతారో చూడాలి.
ప్రేమా? డ్రామా?: అన్నేసి రోజులు ఒకే ఇంట్లో ఉండటం వల్ల సభ్యుల మధ్య ఆకర్షణ పెరగడం సాధారణమే. ప్రస్తుతం బిగ్ బాస్‌లో కూడా అదే జరుగుతుంది. కానీ, దానికి ‘ప్రేమ’ అని పేరు పెట్టి.. ఎక్కువ రోజులు గడిపేందుకు హౌస్‌మేట్స్ ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి గత సీజన్లే నిదర్శనం. ఇప్పటి వరకు బిగ్ బాస్‌లో ప్రేమించుకున్న జంటలు.. బయటకు వచ్చిన ఒక్కటైతే అది డ్రామా కాదు ప్రేమ అని నమ్మేవాళ్లం. కానీ, వారంతా బయటకు వచ్చాక ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కేవలం కొన్ని రియాలిటీ షోల్లో మాత్రమే కనిపిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. లోపల వారు ఇష్టపడిన వ్యక్తులను తల్లిదండ్రులు ఇష్టపడే అవకాశాలు ఉండవు. పైగా, వారికి అప్పటికే బయట బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. దీప్తి సునయన విషయంలో అదే జరిగింది. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండగానే బిగ్ బాస్ హౌస్‌లో తనీష్‌కు దగ్గరైనట్లు కనిపించింది. కానీ, బయటకు వచ్చిన తర్వాత షన్నుతూ యథావిధిగా బాండ్ కొనసాగించింది.
Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?
Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం