బండ్ల గణేష్ హీరోగా ‘డేగల బాబ్జీ’.. ‘బ్లేడ్ బాబ్జీ’ అంటూ ట్రోలింగ్!
బండ్ల గణేష్ హీరోగా తెరకెక్కున్న సినిమా టైటిల్‌ను ‘డేగల బాబ్జీ’గా ఖరారు చేశారు.
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ హీరోగా వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమాకు చెందిన టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘డేగల బాబ్జీ’ టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్‌లో బండ్ల గణేష్ భయానకంగా కనిపిస్తున్నాడు. కంటి మీద గాయం నుంచి రక్తం కారుతున్నట్లుగా పోస్టర్‌లో చూపించారు. అయితే, ఈ సినిమా టైటిల్ అలా విడుదలైందో లేదో.. నెటిజనులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ చిత్రానికి ‘డేగల బాజ్జీ’కి బదులు ‘బ్లేడు బాజ్జీ’ అని పెట్టాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. కొందరు బండ్ల గణేష్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన్ని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.
ఒకప్పుడు హాస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయమైన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. చివరికి రాజకీయ నాయకుడిగానూ తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు. అయితే, ఓ ఇంటర్వ్యూలో బ్లేడుతో పీక కోసుకుంటా అని కామెంట్ చేసి పుణ్యానికి.. బ్లేడు గణేష్ అంటూ నెటిజనులు ట్రోల్ చేశారు. మొత్తానికి ఆ ముద్ర నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బండ్ల గణేష్.. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, దర్శక నిర్మాతలు కావాలనే ‘డేగల బాబ్జీ’ అనే టైటిల్ పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా ఇప్పటికే ‘బ్లేడు బాజ్జీ’ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సినిమాకు ‘డేగల బాబ్జీ’గా టైటిల్ పెట్టడం వెనుక అంతర్యం ఆ ‘బ్లేడు’ మహిమే కావచ్చని అనుకుంటున్నారు. పైగా దీని వల్ల ఫ్రీ పబ్లిసిటీ కూడా దొరుకుతుంది. ఇది ఒక రకంగా నిర్మాతలకు కలిసొచ్చేదే.
తమిళ సూపర్ హిట్ సినిమా ‘ఒత్త సెరుప్పు అళపు 7’ చిత్రంలో హీరో పార్తిబన్ పోషించిన పాత్రలో గణేష్ కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేవలం ఒకే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ పాత్రలో పార్తీబన్ ఎంతో చక్కని నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా దర్శకుడు కూడా ఆయనే. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో హిందీలో అభిషేక్ బచ్చన్ రిమేక్ చేస్తున్నాడు. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ నెల నుంచే షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి అరుణ్ దేవినేని ఛాయాగ్రహకులు. అయితే, బండ్ల గణేష్ తనతంట తానుగా ఈ సినిమాను ఎంచుకోలేదు. దర్శక నిర్మాతలే ఆ పాత్ర కోసం బండ్ల గణేష్‌ను సంప్రదించారట. కథ భిన్నంగా ఉండటంతో బండ్ల గణేష్ కూడా ఇందుకు అంగీకరించారట. మరి బండ్ల గణేష్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని (ప్రత్యేక జ్యూరీ అవార్డు) అందుకుంది. ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డును కూడా దక్కించుకుంది. ఒకే వ్యక్తి రచన, దర్శకత్వం వహించడమే కాకుండా, సోలోగా నటించినందుకు ఈ చిత్రాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది. సోలో యాక్ట్‌తో ఈ సినిమా ప్రపంచంలో 13వ చిత్రంగా నిలిచింది. అభిషేక్ బచ్చన్ హీరోగా ఇప్పటికే ఈ చిత్రం రీమేక్ షూటింగ్ మొదలైంది. చెన్నైలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. మరి బండ్ల గణేష్ ఈ పార్తిబన్‌లా ఈ పాత్రలో ఒదిగిపోతారో లేదో చూడాలి.
Also Read: భీమ్లానాయక్‌కి దీటుగా డానియల్ లుక్.. కానీ, ఊరించి తుస్సుమనిపించారు