కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?
‘అవతార్ 2’ కి ఊహించని షాక్ ఎదురైంది అవతార్ సినిమాను కేరళ లో విడుదల చేయబోమని ఫియూక్ (FEUOK) ప్రకటించింది ప్రస్తుతం ఫియూక్ నిర్ఠయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తోన్న సినిమా ‘అవతార్ 2’. జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరుగుతుందని టాక్. ‘అవతార్ 2’కు ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి థియేట్రికల్ బుకింగ్స్ కూడా ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. అయితే కేరళలో మాత్రం ‘అవతార్ 2’కి ఊహించని షాక్ ఎదురైంది. ‘అవతార్’ సినిమాను కేరళలో విడుదల చేయబోమని ఫియూక్ (FEUOK-The Film Exhibitors United Organisation Of Kerala) ప్రకటించింది. ప్రస్తుతం ఫియూక్ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
‘అవతార్ 2’ సినిమాను డిస్నీ కేరళలోనూ పంపిణీ చేస్తుంది. సాధారణంగా సినిమా పంపిణీదారులకు థియేటర్లకు మధ్య ఓ ఒప్పందం ప్రకారం సినిమాను విడుదల చేస్తారు. అయితే ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. కేరళ విషయంలో డిస్టిబ్యూటర్లు థియేటర్లకు మధ్య ఒప్పందం కుదరకపోవడం వల్లే సినిమా విడుదల విషయంలో వివాదం మొదలైంది. సినిమా విడుదలైన మొదటి 3 వారాలలో 60 శాతం షేర్లను డిస్టిబ్యూటర్లకు ఇవ్వాలని డిస్నీ కోరగా ఫియూక్ నిబంధనల ప్రకారం 55 శాతం కంటే ఎక్కువ షేర్లను ఇవ్వలేమని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ వాటాల విషయంలో పొత్తు కుదరకపోవడంతో ఫియూక్ ‘అవతార్ 2’ను కేరళలో విడుదల చేయబోమని ప్రకటించింది.
కేరళలో ఫియూక్(FEUOK) ప్రకారం పరాయి భాషా చిత్రాలకు 50 శాతం మాత్రమే డిస్టిబ్యూటర్లకు ఇస్తున్నామని, అంతకంటే ఎక్కువ ఇస్తే తాము నష్టపోతామని థియేటర్ ఓనర్స్ వాపోతున్నారు. తాము ‘అవతార్ 2’ సినిమాను కేరళలో నిషేదించలేదని, అయితే పంపిణీదారు పెట్టే షరతులకు అంగీకరించలేమని చెప్తున్నారు. ఇప్పటికీ వారినుంచి చర్చల కోసం ఎదురు చూస్తున్నామని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ‘అవతార్ 2’ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక ‘అవతార్’ సినిమా 2009లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా విడుదలైన 13 ఏళ్ళ తర్వాత ‘అవతార్ 2’ను విడుదల చేస్తున్నారు. మొదటి చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కేమరూన్ ఇప్పుడీ ‘అవతార్ 2’ లో సముద్రంలో యుద్దంతో మరో ప్రపంచానికి తీసుకెళ్లనున్నాడు. మొదటి చిత్రంలానే ఇందులో కూడా సల్లీ, నేత్రి తమ ప్రపంచమైన పండోరాను కాపాడుకోవడానికి యుద్దం చేస్తారనే తెలుస్తుంది. కాకపోతే ఈ సారి నీటి అడుగున జరిగే యుద్దంలో వండర్ వాటర్ విజువల్స్ ప్రేక్షకుడిని మైమరపిస్తాయని టాక్. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు ముందే కొన్ని చోట్ల బుకింగ్స్ ఇవ్వగా ఊహించని స్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఇక మూవీ రిలీజ్ అయ్యాక ‘అవతార్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Also Read: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్ ఆమేనా?