‘జవాన్‘ దర్శకుడితో చేతులు కలపనున్న ‘పుష్ప‘- త్వరలో పాన్ ఇండియన్ మూవీ షురూ!
అల్లు అర్జున్ మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘జవాన్’ దర్శకుడు అట్లీతో కలిసి ఆయన ఈ మూవీ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దేశంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘పుష్ప: ది రైజ్’ మూవీలో నటనకు గాను ఇటీవలే బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా తొలి పార్టుకు మించి హిట్ అయ్యేలా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అటు ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా రేంజిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2021లో విడుదలైన ఈ మూవీ రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన కొత్త చరిత్ర లిఖించింది.
బన్నీ-అట్లీ కాంబోలో పాన్ ఇండియా మూవీ
ఓవైపు సుకుమార్ తో సినిమా చేస్తుండగానే, బన్నీ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే తన అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కొన్ని నెలల క్రితమే ఆయనతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో పెద్ద దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ, తమిళంలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. విజయ్‌తో మూడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు సాధించాడు. ప్రస్తుతం షారుక్ ఖాన్ 'జవాన్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హిందీ చిత్రపరిశ్రమలో సరికొత్త రికార్డులు సాధిస్తుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.
బన్నీ ఇమేజ్ మరింత పెంచేలా కొత్త సినిమా
ఇక అల్లు అర్జున్ కు ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో, దర్శకుడు అట్లీ కూడా బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత పెంచేలా ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీకి అట్లీ కథ చెప్పాడట. ఈ స్టోరీ చాలా నచ్చడంతో ఓకే చెప్పిట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బన్నీకి జంటగా ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial