Road Safety add: వివాదంలో అక్షయ్ కుమార్ ‘రోడ్ సేఫ్టీ’ యాడ్, వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ విమర్శలు!
బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా యాడ్ వివాదంలో చిక్కుకుంది. 6 ఎయిర్ బ్యాగులున్న కార్లనే వాడలంటూ రూపొందించిన ఈ యాడ్.. వరకట్నాన్ని ప్రోత్సహించేదిగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.
రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రజలను ఎడ్యుకేట్ చేసేందుకు రూపొందించిన ఓ వాణిజ్య ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదం అయ్యింది. బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ నటించిన ఈ యాడ్ వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో రెండు ఎయిర్ బ్యాగులున్న కారు అంత సురక్షితం కాదని.. ఆరు ఎయిర్ బ్యాగులున్న వెహికల్ సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యాడ్ ను తెరకెక్కించారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఇంతకీ యాడ్ లో ఏముందంటే?
పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లేందుకు పెళ్లి కూతురు కారులో కూర్చుంటుంది. అయితే.. తల్లిదండ్రులు వదిలి వెళ్తున్నానన్న బాధలో వారిని చూస్తూ కంటతడి పెట్టుకుంటుంది. అప్పుడు పెళ్లి కూతురు తండ్రి పక్కనే ఉన్న అక్షయ్ కుమార్.. ఇలాంటి కారులో పంపిస్తే మీ అమ్మాయి ఏడ్వకుండా ఉంటుందా? అని ప్రశ్నిస్తాడు. దానికి వధువు తండ్రి.. ఆ కారుకి ఏమైంది? అది ఆటోమెటిక్ కారు, సన్ రూఫ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందని చెప్తాడు. కానీ, ఎయిర్ బ్యాగ్స్ కేవలం రెండే ఉన్నాయిగా అంటాడు అక్షయ్. ఆ మాట వినగానే కారులో నుంచి వధువు, వరుడు వెంటనే దిగిపోతారు. ఆరు ఎయిర్ బ్యాగులున్న కారు సురక్షితమని అక్షయ్ చెప్పగానే.. వెనుక నుంచి వెంటనే ఒక కారు వచ్చేస్తుంది. ఆ కారులో 6 ఎయిర్ బ్యాగులుంటాయి. వెంటనే ఆ కారు ఎక్కి కొత్త జంట సంతోషంగా వెళ్తుంది.
6 एयरबैग वाले गाड़ी से सफर कर जिंदगी को सुरक्षित बनाएं।#राष्ट्रीय_सड़क_सुरक्षा_2022#National_Road_Safety_2022 @akshaykumar pic.twitter.com/5DAuahVIxE
— Nitin Gadkari (@nitin_gadkari) September 9, 2022
అసలు వివాదం ఏంటంటే?
కారులో 6 ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని నితిన్ గడ్కరీ పోస్ట్ చేసిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది రాజకీయ నాయకులు ఈ వీడియో యాడ్ ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వాణిజ్య ప్రకటన వరకట్న వ్యవస్థను ప్రోత్సహించేదిగా ఉందని మండిపడుతున్నారు. వాస్తవానికి ఈ యాడ్ లో ఎక్కడా కట్నం అనే విషయాన్ని చెప్పలేదు. కానీ అలాంటి అభిప్రాయాన్ని కలిగించేలా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.
రాజకీయ నాయకుల విమర్శలు
ఇలాంటి ప్రకటనలు మంచిది కాదని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది తెలిపారు. ప్రభుత్వం కారు భద్రత అంశాన్ని ప్రచారం చేయడానికి డబ్బు ఖర్చు చేస్తుందా? లేదా ఈ ప్రకటన ద్వారా వరకట్న సంస్కృతి ప్రచారం చేస్తుందా?’ అని ఆమె ప్రశ్నించారు. అటు తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే కూడా ఈ యాడ్ ను తీవ్రంగా తప్పుబట్టారు. భారత ప్రభుత్వమే అధికారికంగా వరకట్నాన్ని ప్రోత్సహిస్తుండటం అసహ్యంగా ఉందని విమర్శించారు.
Also Read: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటున్నారా? తక్కువ ధర కలిగిన బెస్ట్ టూ వీలర్స్ ఇవే!
Also Read: కారు కొంటున్నారా? అయితే, ఈ టాప్ 10 భద్రతా ఫీచర్లను పరిశీలించండి