Naga Chaitanya Birthday : హ్యాపీ బర్త్ డే నాగ చైతన్య - ఆయన్నుంచి ఆ ఒక్కటీ నేర్చుకోవాలి బాస్!
HBD Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు (Akkineni Naga Chaitanya Birthday Special) నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఏబీపీ దేశం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నాగ చైతన్య (Naga Chaitanya)... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెండు అగ్ర కుటుంబాల వారసుడు. ఏయన్నార్ మనవడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు తెరపైకి హీరోగా వచ్చారు! తండ్రి వైపు నుంచి మాత్రమే కాదు... డి. రామానాయుడు మనవడిగా, నిర్మాత సురేష్ బాబు - హీరో వెంకటేష్ మేనల్లుడిగా తల్లి వైపు నుంచి చైతూకి సినిమా నేపథ్యం ఉంది. ఆయన జీవితం తెరిచిన పుస్తకం.
అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా వెండితెరపైకి రాక ముందు నుంచి తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుసు. ఇటు తండ్రిది, అటు తల్లిది సినిమా కుటుంబాలు కావడం, వాళ్ళిద్దరూ వేరు పడటంతో... ఆ ప్రస్తావన వచ్చినప్పుడు, అప్పుడప్పుడూ చైతన్య పేరు చర్చల్లోకి వచ్చేది. హీరో అయ్యాక... జయాపజయాలతో ఆయన పేరు వినిపించింది. ఆ తర్వాత సమంతతో వివాహం, వేరు పడటం వంటివి మరింతగా చైతూ పేరు వార్తల్లో ఉంది.
చైతన్య జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ... ఆ జీవిత మజిలీలో మలుపులు ఎన్నో ఉన్నాయి! వాటిలో కొన్ని ప్రేక్షకులకు తెలిసి ఉండవచ్చు. మరికొన్ని తెలిసే అవకాశం లేకపోవచ్చు. ఉదాహరణకు... సమంతతో వేరు పడిన విషయం అందరికీ తెలుసు. అయితే, ఎందుకు వేరు పడ్డారు? అనే ప్రశ్నకు సమాధానం ప్రేక్షకులు ఎవరికీ తెలియదు. సాధారణంగా ప్రతి మనిషిలో నవరసాలు ఉంటాయి. సంతోషం, కోపం, దుఃఖం వంటివి అప్పుడప్పుడూ పబ్లిక్‌గా ప్రదర్శిస్తూ ఉంటాం. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు... అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, చైతన్య విషయంలో అటువంటి కేస్ ఒక్కటి కూడా లేదు.
నాగ చైతన్య కంటే ఆయన వ్యక్తిత్వం ఎక్కువ మాట్లాడుతుంది. హీ ఈజ్ వెరీ కూల్. వెరీ కామ్! ఆయన చిరునవ్వే చాలా విషయాలకు సమాధానం చెబుతుంది. పబ్లిక్‌గా ఎప్పుడూ కోప్పడిన సందర్భాలు లేవు. చిన్న చిన్న విషయాలకు సైతం కొందరికి కోపం వస్తుంది... సినీ ప్రముఖులు అని కాదు, సామాన్యులకు కూడా! అటువంటి వారందరూ ఆయన నుంచి ఆ ఒక్కటీ నేర్చుకోవాలి. ఎవరెంత కవ్వించినా ఓపిగ్గా సమాధానాలు ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం చైతూ నుంచి నేర్చుకోవాలి.
సినిమాలకు వస్తే... నాగ చైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం కూడా అందుకు కారణం ఏమో!? ఆ తర్వాత వచ్చిన 'ఏ మాయ చేసావె'తో ఆయన మాయ చేశారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఉన్న రొమాంటిక్ ఇమేజ్ ఆయన విషయంలోనూ కంటిన్యూ అయ్యింది. చైతన్య లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు చేసిన ప్రతిసారీ ప్రేక్షకులు విజయాలు అందించారు.
Also Read : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం, ఆయన్ను ఎందుకు 'గురూజీ' అంటున్నారు?
'100 పర్సెంట్ లవ్', 'మనం', 'ప్రేమమ్', 'లవ్ స్టోరీ' చిత్రాలు మంచి వసూళ్ళతో పాటు అందరి ప్రసంశలు అందుకున్నాయి. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో రూపొందిన 'రారండోయ్ వేడుక చూద్దాం', 'వెంకీ మామ', 'మజిలీ', 'బంగార్రాజు' సినిమాలు సైతం విజయాలు సాధించాయి. పాత్రకు తగ్గట్టు తనను తానూ మార్చుకోగల సామర్థ్యం చైతన్య సొంతం. అవసరమైతే స్కూల్, కాలేజ్ స్టూడెంట్‌గానూ కనిపించగలరు.
నటుడిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న చైతన్య, ఇప్పుడు ప్రయోగాలకూ సై అంటున్నారు. మరొక హీరో అయితే హిందీ సినిమా 'లాల్ సింగ్ చడ్డా'లో ఆ క్యారెక్టర్ చేయడానికి సందేహించేవారు ఏమో!? హీరోగా మంచి పొజిషన్‌లో ఉండి కూడా వెబ్ సిరీస్ చేశారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో, వినూత్న కథలు, ప్రయోగాలు చేయడంలో నాగార్జున ముందుంటారు. చైతన్య కూడా అదే విధంగా రిస్క్ తీసుకోవడానికి రెడీ అన్నట్లు అడుగులు వేస్తున్నారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆసిస్తూ... ఆల్ ద బెస్ట్.
Also Read : కృష్ణ సంపాదనే కాదు, సంతానమూ సినిమాల్లోనే - మూడో తరం & రాజకీయం, కృష్ణ లైఫ్‌లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు