Neethu Chandra: ఒక బడా వ్యాపారవేత్త నన్ను ‘జీతం తీసుకునే భార్య’గా ఉండమని అడిగాడు,గుండె బరువెక్కే విషయాన్ని గుర్తు చేసుకున్న హీరోయిన్
తనకు ఎదురైన ఒక విచిత్ర, బాధాకరమైన సంఘటనను పంచుకున్న నీతూ చంద్ర.
సినిమా ఇండస్ట్రీలలో కొంత మంది హీరోయిన్లకు ఎంతో విచిత్రకరమైన, ఇబ్బంది పెట్టే అనుభవాలు ఎదురవుతాయి. కొంతమంది వాటిని వెంటనే మీడియా ముందు బయటపెడతారు. కానీ ఎక్కువ శాతం మంది అలాంటివి బయటికి రాకుండా జాగ్రత్త పడతారు. నీతూ చంద్ర కూడా తనకు ఎంతో ఇబ్బంది కరమైన ఆఫర్ వచ్చిందని, అది విన్నాక తన గుండె పగిలిపోయిందంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్య్వూలో కళ్ల నీళ్లతో తనకు ఎదురైన బాధాకరమైన సంఘటనను పంచుకుంది.
నెలకి జీతం ఇస్తానని...
తాను సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్నప్పుడు దేశంలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త తనకు ఆఫర్ ఇస్తా అన్నాడని చెప్పింది నీతూ. అది సినిమా ఆఫర్ అనుకున్నా కానీ, అతను తనకు భార్యగా ఉండమని కోరినట్టు చెప్పింది. ‘నాకు జీతం తీసుకునే భార్యగా ఉండు. నాతో ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలపాటూ... నెలకు పాతిక లక్షల రూపాయలు ఇస్తా’ అన్నాడు అంటూ గుండె బరువెక్కే గతాన్ని గుర్తుచేసుకుంది నీతూ. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఆమె ప్రస్తుతం తన చేతిలో సినిమాలు లేవని, డబ్బూ లేదని చెప్పింది. ఒక బడా డైరెక్టర్ తనను గంట సేపు ఆడిషన్ చేసి సినిమా ఆఫర్ ఇవ్వకుండా పంపేశాడని చెప్పింది. ఆ డైరెక్టర్ పేరు చెప్పడం తనకు ఇష్టం లేదని తెలిపింది. బాలీవుడ్ హంగామా అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పై విషయాలు పంచుకుంది.
ఆత్మాహత్యా ఆలోచనలు...
‘నేను 13 మంది జాతీయ అవార్డులు సాధించిన విజేతలతో కలిసి పనిచేశాను. చాలా పెద్ద సినిమాల్లో నటించాను. విజయవంతమైన నటి ఓటమి కథ నాది. ఇప్పుడు నన్ను ఎవరూ వద్దనుకుంటున్నారు’ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది నీతూ చంద్ర. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్యహత్య గురించి మాట్లాడుతూ తనకు కూడా చాలా సార్లు ఆ ఆలోచన వచ్చిందని చెప్పింది. ‘వ్యక్తులు మరణించాకే, వారు చేసిన పనులను మనం గౌరవిస్తామా?’అంటూ ప్రశ్నించిందామె.
నీతూ చంద్ర అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘13బి’. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ హిందీలోనే కాదు తెలుగులోనూ హిట్ కొట్టింది. అలాగే గోదావరి సినిమాలో హీరో మరదలిగా కూడా నటించింది. ఎక్కువ సినిమాలు హిందీలోనే నటించింది. అందుకే ఈమెకు తెలుగులో కాస్త గుర్తింపు తక్కువే. హిందీలో మంచి సినిమాలే చేసినప్పటికీ ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె సినిమా అవకాశాలు లేకపోవడంతో మధ్యలో నిర్మాతగా కూడా మారింది. అలా విజయవంతం కాలేకపోయింది.
">