Ayyanapatrudu News: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏడోసారి గెలుస్తారా ? అనకాపల్లిలో మాజీ మంత్రికి గెలుపు సాధ్యమేనా ?
హైవోల్టేజ్ రాజకీయాలకే కేరాఫ్ అడ్రస్ నర్సీపట్నం నియోజకవర్గం. ఇక్కడ మరోసారి పాత ప్రత్యర్ధులు తలపడనున్నారు. మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును తొలి జాబితాలోనే ప్రకటించింది.
Vizag TDP Candidates : విశాఖపట్నం జిల్లాలో మహామహులకు టీడీపీ (TDP), జనసేన (Janasenaa)టికెట్లు కేటాయించాయి. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఏడోసారి గెలుపే ధ్యేయంగా నర్సీపట్నంలో (Narsipatnam) పోటీ చేస్తున్నారు. అనకాపల్లి (Anakapalli) నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna)కు జనసేన సీటు కేటాయించింది. మరోసారి శాసనసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.
ఆరుసార్లు గెలిచిన అయ్యన్నపాత్రుడు
హైవోల్టేజ్ రాజకీయాలకే కేరాఫ్ అడ్రస్ నర్సీపట్నం నియోజకవర్గం. ఇక్కడ మరోసారి పాత ప్రత్యర్ధులు తలపడనున్నారు. మాజీమంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును తొలి జాబితాలోనే ప్రకటించింది టీడీపీ అధిష్టానం. ఇది ఊహించిన సీటే అయినప్పటికీ జనసేన-టీడీపీ కూటమి అభ్యర్ధిగా అయ్యన్న బరిలోకి దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అభ్యర్ధిత్వంపై వైసీపీ హైకమాండ్‌కు సానుకూలత ఉంది. ఇక్కడ మార్పులపై ఎటువంటీ సంకేతాలు లేకపోవడంతో ఈ సీటు గణేష్‌కు ఖాయంగానే కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తన పట్టు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి 15సార్లు ఎన్నికలు జరిగితే... ఏడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇందులో ఆరు సార్లు అయ్యన్నపాత్రుడు గెలుపొందారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో అయ్యన్న గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడు చంద్రబాబు కంటే చాలా సీనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. పార్టీకి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీని మాత్రం వీడలేదు. తెలుగుదేశం పార్టీకి నమ్మినబంటు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఆయన తన కుమారుడు విజయ్ పాత్రుడికి పార్లమెంట్ సీటు అడుగుతున్నారు. అయితే తొలి జాబితాలో అయ్యన్న పాత్రుడుకు అసెంబ్లీ సీటును కేటాయించారు. 1989, 2009 ఎన్నికల్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొంది...లోక్ సభ సభ్యుడిగానూ పని చేశారు
అనకాపల్లిలో జనసేన తరపున కొణతాల
అనకాపల్లిలో రాజకీయం అనూహ్యంగా మారింది. ఓ వెలుగు వెలిగిన దాడి వీరభద్రరావు, కొణతాల కుటుంబాలు దశాబ్ధకాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాల్లో భాగంగా దాడివీరభద్రరావు టీడీపీలో చేరితే...కొణతాల రామక్రిష్ణ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. కొణతాల రామకృష్ణను అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్దిగా ప్రకటించింది జనసేన. దీంతో ఇక్కడ టీడీపీ వర్గం భగ్గుమంటోంది. మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ సత్యన్నారాయణ ఇక్కడ టిక్కెట్ ఆశించి ఆరు నెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజా సమీకరణాల్లో ఆయనకు రావాల్సిన అవకాశం కొణతాలకు దక్కింది. కొణతాల 1989, 1991లో అనకాపల్లి నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసి...దాడి వీరభద్రరావుపై విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పని చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి సీటులో వైసీపీ కొత్త ముఖాన్ని తెచ్చిపెట్టింది. కశింకోటకు చెందిన మలసాల భరత్ ను సమన్వయకర్తగా నియమించింది. కొణతాల అభ్యర్ధిత్వం ఖరారైన నేపథ్యంలో భరత్ బలం ఎంత వరకు సరిపోతుందనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఐదుసార్లు విజయం సాధించింది.
అరకు లోయలో దొన్ను దొరకు టీడీపీ ఛాన్స్
ST రిజర్వ్డ్ స్ధానమైన అరకు లోయ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈక్వేషన్లు వేగంగా మారుతున్నాయి. గిరిజన ఉపకులాల్లో బలమైన కొండదొరలకు వైసీపీ,టీడీపీ చాన్స్ ఇచ్చాయి. రా...కదలిరా బహిరంగ సభ వేదికపై నుంచే సివేరి దొన్నుదొర అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తొలి జాబితాలోనే ఆయన పేరును ప్రకటించారు. ఈ సీటులో వైసీపీ అనేక మార్పులు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఫల్గుణను తప్పించి ఎంపీ మాధవికి చాన్స్ ఇచ్చింది. ఐతే, మాధవి నాయకత్వంపై వ్యతిరేకత రావడంతో పునరాలోచన చేసింది. హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం పేరును సమన్వయకర్తగా ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో శివేరి దొన్నుదొరకు గట్టిపట్టు వుంది. 2019 ఎన్నికల్లో అరకు సీటును వైసీపీ గెలుచుకోగా దొన్నుదొర సెకండ్ ప్లేస్ వచ్చింది.