Gajuwaka Assembly Constituency : గాజువాకలో ప్రభావితం చేసే అంశాలు ఏంటీ? వైసీపీ మళ్లీ గెలుస్తుందా ? టీడీపీ పునర్వైభవం చాటుతుందా ?
Vizag News: గాజువాక సిట్టింగ్ స్థానంలో వైసీపీ...మరోసారి సత్తా చాటాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో పునర్ వైభవం సాధించడమే లక్ష్యంగా టీడీపీ అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది.
![Gajuwaka Assembly Constituency : గాజువాకలో ప్రభావితం చేసే అంశాలు ఏంటీ? వైసీపీ మళ్లీ గెలుస్తుందా ? టీడీపీ పునర్వైభవం చాటుతుందా ? What are the factors that affect In Gajuwaka Assembly Constituency Elections Will YSRCP Win again or will TDP stand there Gajuwaka Assembly Constituency : గాజువాకలో ప్రభావితం చేసే అంశాలు ఏంటీ? వైసీపీ మళ్లీ గెలుస్తుందా ? టీడీపీ పునర్వైభవం చాటుతుందా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/be6bdd263f16c0fbd6327eeaaac458791711694679277215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Assembly Elections 2024: ఉమ్మడి విశాఖ (Visakhapatnam) జిల్లా గాజువాక (Gajuwaka Assembly Constituency : ) సిట్టింగ్ స్థానంలో వైసీపీ (YSRCP)...మరోసారి సత్తా చాటాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో పునర్ వైభవం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ (TDP) అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. అధికార పార్టీ తరపున పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amarnath)బరిలోకి దిగుతుంటే...తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు (Palla Srinivas Rao) పోటీ చేస్తున్నారు.
తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గాజువాక
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గాజువాక నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్టీల్ ప్లాట్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌తో పాటు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన భారీ పరిశ్రమలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో గాజువాక నియోజకవర్గం దశ దిశ మారిపోయింది. రాష్ట్రంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా మారింది. ఈ అసెంబ్లీలో 3 లక్షల 26 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లే ఎక్కువ. కాపులు, యాదవులు...అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తారు. వలస ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. కాపులు 56 వేలు, యాదవులు 52వేలు, వెలమలు 18వేలు, గవర 18వేలు, మత్స్యకారులు 11 నుంచి 12వేల మంది ఓటర్లు ఉన్నారు. ముస్లింలు 16వేలు, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 18వేల దాకా ఉన్నాయి. రాష్ట్రంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా మారింది. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కూడా భారీగానే ఉన్నారు.
మూడు ఎన్నికలు...మూడు పార్టీలు గెలుపు
రాజకీయంగా చైతన్యవంతమైన గాజువాక...2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. అంతకుముందు పెందుర్తి అసెంబ్లీలో భాగంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పెందుర్తిలో ఉన్నపుడు కూడా టీడీపీకి పట్టు ఉండేది. 2009లో ప్రజారాజ్యం తరపున చింతలపూడి వెంకట్రామయ్య గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 2014లో నాగిరెడ్డి వైసీపీ నుంచి, పల్లా శ్రీనివాసరావు టీడీపీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్‌రావు గెలుపొందారు. 2019లో ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. పవన్ కళ్యాణ్, పల్లా శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి పోటీ పడ్డారు. 2009, 2014లో ఓటమి పాలయిన తిప్పల నాగిరెడ్డి...2019లో సుమారు 18వేల ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. పవన్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో నాగిరెడ్డికి బదులు...మంత్రి అమర్‌నాథ్‌ను వైసీపీ బరిలోకి దించింది. టీడీపీ తరపున యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థులిద్దరూ స్థానికులే కావడంతో...ఎవరు ఏ వర్గం ఓటర్లను ఎంతమేర ప్రభావితం చేస్తారన్నది చూడాల్సి ఉంది.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే కీలకం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవైటీకరణ అంశాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్‌లో వేల మంది ఉద్యోగులుంటే...వారి కుటుంబాలకు ఆర్-కార్డ్స్ సమస్య ఇప్పటికీ తీరలేదు. నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆర్ కార్డ్స్ ఎలిజిబిలిటీ ఉన్నవారికి వయసు దాటిపోయింది. ప్లాంట్ అమ్మితే మా భూములు మాకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 35 ఏళ్లుగా ఇనాం భూముల్లో ఇళ్లు కట్టుకున్నప్పటికీ...ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ చేయలేదు. వైసీపీ ప్రభుత్వం కొంత ముందడుగు వేసినా సమస్య మాత్రం శాశ్వతంగా పరిష్కారం కాలేదు. విశాఖకు ఆగ్నేయంగా ఏర్పాటైన ఫార్మా సిటీలో వందకు పైగా పరిశ్రమలున్నాయి. అయితే నిర్వాసితులంతా పెందుర్తి నియోజకవర్గంలో ఉండాల్సింది. కానీ వారంతా గాజువాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చారు. వారి ఓట్లే దాదాపు 8 వేల వరకు ఉన్నాయి. వీటిపై ఎవరు ఎలాంటి హామీ ఇస్తారు ? వాటిని ఓటర్లు ఎలా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)