Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !
Telangana Elections Voting Day : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
Telangana Elections 2023 : తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమయింది. పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు రాత్రే చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను (Polling Stations) అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1.85 లక్షల మంది ఉద్యోగులు పొల్గొంటున్నారు. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలనకు 22 వేల మంది అబ్జర్వర్లు, స్క్వాడ్లను నియమించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్
తెలంగాణవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ కోసం ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు ఈవీఎంలను తరలించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో 4 వేల 400 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. లక్ష మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ ఆధునిక సాంకేతికను వినియోగిస్తోంది. పోలింగ్ కేంద్రం, బూత్‌ల్లో ఆన్‌లైన్ విధానం అమలుకు రెడీ అయ్యింది.
దాదాపుగా 70వేల మందితో భద్రత
ఎన్నికల బందోబస్తుకు రాష్ట్రానికి చెందిన 45 వేల మంది పోలీసులు, 23,500 హోమ్ గార్డ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. 3వేల మంది ఎక్సైజ్ పోలీసులు, 50 వేల మంది రిజర్వ్ పోలీసులు విధుల్లో ఉన్నారు. వీటితో పాటు కేంద్ర బలగాలు విధుల్లో ఉంటాయి. ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలింగ్‌స్టేషన్‌లో వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంటాయి. బ్రెయిలీలో కూ డా 40 వేల బ్యాలెట్ ప్రింటింగ్ చేశానారు. మొత్తంగా 190 కేంద్ర కంపెనీల బలగాలు తెలంగాణలో విధుల్లో ఉంటాయి.
గుర్తులు, పేర్లు ఉన్న ఓటరు స్లిప్పులకు నో
ఓటరు స్లిప్పులను గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోరు. ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు ఇచ్చే ఓటరు స్లిప్పుపై అభ్యర్థి పేరు, గుర్తు, పార్టీ పేరు ఏవీ ఉండకూడదు. తెల్లకాగితంపై ముద్రించిన వాటిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్రు. ఈవీఎంల దగ్గరికి పోలింగ్ ఏజెంట్లు వెళ్లవద్దని, ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ఫోన్ తీసుకొనిరావద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఓటింగ్ రహస్యంగా వేయాల్సి ఉంటుంది. ఓటును ఫొటో తీయడానికి కూడా వీలులేదు.
27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
రాష్ట్రంలో 35,655 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 27,094 కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు. ఒకేచోట ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు ఉన్న 7,571 చోట్ల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 12 వేల కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను 3,806 సెక్టార్‌లుగా విభజించారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా, ఇతర సమస్యలున్నా సెక్టార్ అధికారులు పరిష్కరిస్తారు.