Mamata And YS Jagan: ఇక్కడ సిద్దం- అక్కడ జనగర్జన పేర్లు మాత్రమే తేడా - మిగతాది సేమ్ టు సేమ్!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అయితే ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, పశ్చిమబెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి.
Andhra Pradesh News: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు(Political Parties) ప్రచారం ప్రారంభించాయి. అయితే.. ఏపీ(Andhrapradesh)లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress party), పశ్చిమ బెంగాల్(West Bbengal)లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(TMC) మధ్య సారూప్యతలు కనిపిస్తు న్నాయి. ఏపీలో అయితే.. అసెంబ్లీ, పార్లెమెంటు ఎన్నికలు రెండూ కలిసి వస్తున్నాయి. దీంతో మరింత వేడి పెరిగింది. ఇక, పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది కేవలం పార్లమెంటు ఎన్నికలే ఉన్నాయి. ఇక్కడ కూడా రాజకీయం సలసల మరుగుతోంది. దీనికి కారణం.. కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కారును ఢీ అంటే డీ అన్నట్టుగా రాజకీయాలు సాగుతుండడమే. ఇటు ఏపీ, అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల తరఫున పార్టీ అధినేతలు.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మమతా బెనర్జీలే స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు.
ముందుగానే అంచనా!
ఏపీ(AP) విషయానికి వస్తే.. చేస్తున్న సంక్షేమం, అమలు చేస్తున్న పథకాలు తనను నిలబెడతాయని ముఖ్యమంత్రి(Chief Minister) జగన్(Jagan) భావిస్తున్నారు. ఇక, దాదాపు పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే తరహా ధీమాతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. అయితే.. ఏ విషయాన్నీ ఇద్దరూ కూడా తక్కువగా అంచనా వేయడం లేదు. ముందుగానే పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ రాకుండానే అటు మమతా బెనర్జీ ఎంపీ అభ్యర్థులను ప్రకటిం చేశారు. రాష్ట్రంలో మొత్తం 42 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తాజాగా వాటికి అభ్యర్థులను ఖరారు చేశారు.
వివాదాస్పదమే అయినా.. ఫైర్ ఉంటే!
ఈ జాబితాలో ఇటీవల వివాదాస్పద నాయకురాలిగా నిత్యం మీడియాలో నిలిచిన మహువా మొయిత్రా కూడా ఉన్నారు. కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి మహువా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఆమె ముడుపులు తీసుకుని ప్రశ్నలు సంధించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. దీంతో ఏకంగా సబ నుంచి బహిష్కరణ వేటుకు కూడా గురయ్యారు. అయినప్పటికీ.. కేంద్రంలోని మోడీ సర్కారును టార్గెట్ చేస్తుండడంతో ఆమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఇలా.. ఎన్నికలకు ముందుగానే వైసీపీ కూడా తన ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. కొందరిని తొలగించడం.. మరికొందరిని చేర్చుకోవడం వంటివి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయోగాలు. అయితే..ఇవన్నీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే చేయడం గమనార్హం. ఈ రెండు విషయాల్లోనూ అటు మమత, ఇటు జగన్ కూడా సమానంగా ముందుకు సాగుతున్నారు.
సిద్ధం-జనగర్జన!
ఇరు పార్టీల ప్రచార సరళిని గమనిస్తే.. భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఏపీలో ``సిద్ధం`` పేరుతో సభలు నిర్వహిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో ``జనగర్జన``పేరుతో సభలు చేపడుతున్నారు. రెండింటికీ కీలకమైన సారూప్యత ఏంటంటే.. ఒకే తరహాలో ప్లాన్ చేయడం. అంటే.. భారీ స్థలాన్ని సభలకు ఎంచుకో వడం. వీటిలో మధ్యలో `వై` షేపులో భారీ ప్లాట్ ఫాం నిర్మించడం.. పార్టీ అధినేత ఆ ప్లాట్ ఫాంపై తిరుగుతూ.. ప్రజలను ఆకట్టుకునే వారి చెంతకు చేరుకోవడం వంటివి కీలకంగా ఉన్నాయి. ఇక, మరో ప్రధాన సారూప్యత ఎన్నికల ప్రచార గీతాలు. ఏపీలో వైసీపీ తరఫున ఇప్పటికే 6 ప్రచార గీతాలు వీడియోలతో సహా యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లోనూ ప్రచార గీతాలు హుషారెక్కిస్తున్నాయి. వీటన్నంటినీ ఆర్గనైజ్ చేస్తోంది ఐ ప్యాక్. అందుకే రెండు చోట్ల ఇదే సారుప్యత కనిపిస్తుందని అంటున్నారు.
రెండు ఒకేలా..
+ ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. ఇటు వైఎస్సార్ సీపీ, అటు తృణమూల్ కాంగ్రెస్లు అభ్యర్థులను ప్రకటించడం.
+ బలమైన అభ్యర్థులు అయితే చాలు. కొంత వివాదాస్పదమైనప్పటికీ టికెట్లు ఇచ్చేయడం.
+ ఎవరితోనూ పొత్తులు లేకుండా ముందుకు సాగడం. (తృణమూల్ కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని అనుకున్నా.. వ్యూహం మార్చుకుని 42 స్థానాలకుఅ బ్యర్థులను ప్రకటించింది.)
+ ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించడం. అభివృద్ధి, పేదలు, సంక్షేమం అనే మూడు అంశాలను కీలకంగా చేసుకోవడం.
+ మమతా బెనర్జీ ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుంటే.. ఏపీ సీఎం జగన్ మాత్రం చంద్రబాబు కేంద్రంగా ముందుకు సాగుతున్నారు.
+ ఇరు పార్టీలకు `ఐప్యాక్` రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించడం.
+ ఒకే తరహాలో జన సమీకరణ చేపట్టడం, ఒకే తరహాలో వేదికలు నిర్మించడం.. వంటివి కూడా రాజకీయంగా ఆకర్షిస్తున్నాయి.