(Source: ECI/ABP News/ABP Majha)
వన్స్ కేసీఆర్ స్టెప్ ఇన్, తెలంగాణలో హిస్టరీ రిపీటేనా ?
అందరికంటే ముందే 115 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలకు షాక్ ఇచ్చారు. ఎవరి అంచనాలకు అందని వ్యూహాలతో నెగ్గుకొచ్చే గులాబీ బాస్, ప్రత్యర్థులపై మరోసారి పైచేయి సాధించారు.
అందరి కంటే ముందే 115 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎవరి అంచనాలకు అందని వ్యూహాలతో నెగ్గుకొచ్చే గులాబీ బాస్, ప్రత్యర్థులపై మరోసారి పైచేయి సాధించారు. ఎన్నికలకు ముందే తానేంటో మరోసారి చేసి చూపించారు. ఎన్నికలకు 40 రోజులు ముందే టికెట్లిచ్చామని, గెలుపు విషయంలో సీరియస్ గా ఉండాలని అభ్యర్థులకు చెప్పకనే చెప్పారు. యుద్ధంలో దిగకముందే సగం గెలుపు ఖాయం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ అసంతృప్తుల కోసం ఎదురుచూస్తున్న ఇతర పార్టీలకు, ఆ అవకాశం లేకుండా చేసే ప్రణాళికలు వేశారు. టికెట్లు దక్కనివారు పార్టీలోనే ఉండాలని, తర్వాత మంచి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. అందుకు అనుగుణంగానే తాడికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చెన్నమనేని రమేష్ బాబులకు నామినేటేడ్ పోస్టులు కట్టబెట్టారు. నిన్న మొన్నటి వరకు రాజయ్య, ముత్తిరెడ్డి, తామే అభ్యర్థులమంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ హామీతో మెత్తబడ్డారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేస్తామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ దిగనంతవరకే ప్రత్యర్థులకు ఛాన్స్. వన్స్ కేసీఆర్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్ అన్న డైలాగ్ కూడా రాజకీయాల్లోనూ రిపీట్ అవుతుందన్న గ్యారెంటీ బీఆర్ఎస్ నేతల్లో ఉంది.
సిట్టింగులకే సీట్లు
కేసీఆర్ చెప్పినట్టే ఈసారి మెజార్టీ సీట్లు సిట్టింగులకే కేటాయించారు. అభ్యర్థుల్ని కూడా ముందే ప్రకటించేశారు. తమ సంగతేంటో అని ప్రత్యర్థి పార్టీల్లో ఎంతో కొంత చర్చ జరగాలనే కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్రత్యర్థులను ఇరుకు పెట్టేలా, పార్టీ పరంగా బీఆర్ఎస్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకున్నారు. ప్రతిపక్షాల్ని గందరగోళపరచాలనే అజెండాతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ఎప్పుడైనా ముందస్తు నిర్ణయాలతో మంచే జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు, భౌగోలిక పరిస్థితులపై కేసీఆర్ ఉన్నంత అవగాహన, క్లారిటీ, రాష్ట్రంలో మరే నేతకు లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం, జిల్లాల చరిత్ర, సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు గురించి కేసీఆర్ ను కొట్టేవారే లేరు. బీఆర్ఎస్ కు కేసీఆరే కొండంత బలం. ఆయన ముందు తెలంగాణ ఏ పార్టీకి చెందిన నేతలైన దిగదుడుపే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. దీన్నే కేసీఆర్ అవకాశంగా మార్చుకున్నారు. చంద్రబాబు వచ్చి తెలంగాణలో ప్రచారం చేయడంతో కేసీఆర్ సెంటిమెంట్ ఉపయోగించారు. తెలంగాణలో ఆంధ్రోళ్ల పాలన, బానిసత్వం అవసరమా అంటూ ప్రచారం చేశారు. ఇది బాగా వర్కౌట్ అయింది.
చిక్కడు దొరకడు
కొన్నిచోట్ల సిట్టింగుల మార్పు ఖాయమని ప్రచారం జరిగిన నియోజకవర్గాల్లోనూ అనూహ్యంగా వారికే సీట్లు దక్కాయి. మెరుగైన అభ్యర్థులు లేకపోవడం, వ్యతిరేకత ఉన్నా గెలుపుకు ఢోకా లేదనే అంచనాలతో కొన్ని చోట్ల సిట్టంగ్ లకే ఛాన్స్ ఇచ్చారు. అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టారు. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థులనే ఎంపిక చేయలేదు. కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో, నేతలంతా ఒప్పటికే నియోజకవర్గాన్ని రౌండ్ వేసేశారు. కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవని మరోసారి ప్రూవ్ అయిందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా సరికొత్త వ్యూహాలు ఉంటాయని చెబుతున్నాయి. ప్రగతి ఆధారంగానే మళ్లీ గెలుస్తామని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని, వారు తమనే ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉన్నారు.
తొలి విడత ప్రచారం పూర్తి
మిగతా పార్టీల్లో అభ్యర్థులు ఖరారయ్యే లోపే బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక విడత ప్రచారం పూర్తి చేసేశారు. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడానికి, మరింత బలం పెంచుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించారు గులాబీ బాస్. ఒక్క అభ్యర్థుల ప్రకటనే కాదు, మ్యానిఫెస్టోలోనూ కీలక హామీలుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15న హుస్నాబాద్ వేదికగా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ తప్పదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. సీట్లు కూడా తగ్గుతాయని సవాల్ చేస్తున్నాయి. కానీ ఉన్న సీట్లు పెరుగుతాయని బీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు. అందుకే తమను ప్రతిపక్షం ఎక్కడా సవాల్ చేసే స్థితిలో లేదని ప్రూవ్ చేయడానికి గత ఎన్నికల మాదిరిగానే అడ్వాన్సుడ్ గా అడుగులు వేస్తున్నారు కేసీఆర్. ఆ విధంగా ప్రజల్లోకి బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రతిపక్షాలవి తాటాకు చప్పుళ్లేననే సంకేతాలు బలంగా పంపాలనుకుంటున్నారు.
గత ఎన్నికల్లో కూడా ఏడుగురు సిట్టింగుల్ని మార్చిన కేసీఆర్, మంచి ఫలితాలే సాధించారు. కొత్తగా టికెట్లు దక్కిన వారంతా విజయం సాధించారు. ఈసారి కూడా సిట్టింగు స్థానంలో గెలిచేవారినే ఎంపిక చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్ని ప్రాతిపదికలు తీసుకున్నా, అంతిమంగా గెలవాలనే లక్ష్యంలో రాజీలేదంటున్నాయి. అసలు టికెట్లు దక్కనివారికి కొన్ని నెలలు ముందుగానే అగ్రనేతలు పరోక్ష సంకేతాలు ఇస్తూనే వచ్చారు. కొంతమందికి అయితే నేరుగా ముఖం మీదే చెప్పేశారు. అలా అసంతృప్తిని వీలైనంత వరకు ముందే తగ్గించేలా వ్యూహం రచించారు. ఎక్కడా అసమ్మతి అదుపు తప్పుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక లిస్ట్ ఫైనల్ చేశాం కాబట్టి.. చర్చలు అనవసరం అని కేసీఆర్ చెప్పేశారు. పంచాయితీలు మానేసి.. ప్రచారంపై దృష్టి పెట్టాలనే సంకేతం ఇచ్చేశారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని అభ్యర్థులకు కూడా సూచించారు. ప్రత్యర్థులు అభ్యర్థుల్ని ఫైనల్ చేసే లోపే అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏకతాటిపైకి రావాలనే ఉద్దేశంతోనే మూడ్నెళ్ల ముందే అభ్యర్థుల్ని ప్రకటించారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చారు. అదే ప్లాన్ ను ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ అమలు చేస్తున్నారు. 15 నుంచి హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఎలాంటి హామీలు ఇస్తారో వేచి చూడాలి.