తెలంగాణలో యువ ఓటర్లే నిర్ణయాత్మక శక్తి, మెదక్ లో అత్యధికం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికల్లో యువ ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికల్లో యువ ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే నేతలు యువ ఓటర్ల నాడి పట్టుకోవాల్సిందే. ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సర్కారీ కొలువుల భర్తీ, నిరుద్యోగ సమస్యలపై అభ్యర్థులు హామీలు ఇవ్వాల్సిందే. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ప్రత్యేక హామీలు ఇవ్వక తప్పని స్థితి ఏర్పడింది. యువతే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఓటేయబోతున్న వారిలో అధికంగా 50.44 శాతం మంది 19 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారే.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389కు పెరిగింది. ఇందులో 1,59,98,116 అంటే 50.44% మంది 19-39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే. అందులోనూ 91,46,484 అంటే 28.84% మంది మధ్య వయస్సులో అడుగుపెట్టిన వారు ఉన్నారు. వీరంతా 30-39 ఏళ్ల ఓటర్లే. తొలిసారి హక్కు ఓటు పొందిన 18-19 ఏళ్ల నవ యువ ఓటర్లు 8,11,640 అంటే 2.56% మంది ఉన్నారు. 20-29 ఏళ్ల వయసున్న ఓటర్లు గణనీయంగా ఉన్నారు. 60,39,992 అంటే 19.04% మంది ఉన్నారు.
18-39 ఏళ్ల వారు 88 శాతం
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18-39 ఏళ్ల మధ్య వయస్సున్న ఓటర్లు 55.4 శాతం ఉంటే, తాజా జరగనున్న ఎన్నికల్లో 50.44 శాతం ఉన్నారు. అప్పట్లో 20-29 ఏళ్ల మధ్య వయస్సు ఓటర్లు 24.84శాతం ఉంటే, ఇప్పుడు 19.04 శాతానికి తగ్గింది. గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి యువ ఓటర్లు 5శాతం తగ్గినా ఫలితాల్లో మాత్రం నిర్ణయాత్మక పాత్ర పోషించేది వారే. 2018లో 50-59 ఏళ్ల మధ్య వయస్సు ఓటర్లున్నారు. అప్పుడు 12.73 శాతం ఉండగా, ఇప్పుడు 14.24 శాతానికి పెరిగారు. నాటితో పోల్చితే ఇప్పటి ఓటర్ల జాబితాలో మిగిలిన వయసున్నన వారి ఓటర్ల శాతాల్లో స్వల్ప తేడాలే ఉన్నాయి. రాష్ట్రంలో 60 ఏళ్లకు పైబడిన ఓటర్లు 45,96,051 మంది ఉంటే 40-50 ఏళ్ల మధ్య వయస్సు ఓటర్లు 20.83 శాతం మంది ఉన్నారు.
మెదక్, నర్సాపూర్‌లో యువ ఓటర్లదే పైచేయి
మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లో యువ ఓటర్లదే పైచేయి. 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 2,21,713 మంది ఉన్నారు. ఇందులో మెదక్ నియోకజవర్గంలో 1,03,610 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 5163, 20 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 43,644, 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 54,803 మంది ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం యువ ఓటర్లు 1,18,103 మంది ఉన్నారు. వీరిలో 18-19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 5775, 20 నుంచి 25 ఏళ్ల ఓటర్లు 50,697 మంది, 30 నుంచి 39 ఏళ్లు ఉన్న ఓటర్లు 61,631 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో యువ ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లోని రాజకీయపార్టీలు యువ ఓటర్లను ఆకర్శించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. శేరిలింగంపల్లి రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. వైశ్యాల్యంలోనే కాదు అత్యధిక ఓటర్లు ఉన్నది కూడా ఇక్కడే. ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లు ప్రధాన పాత్ర పోషించనున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వయస్సుల వారీగా చూసుకుంటే 19-39 ఏళ్లలోపు 3,36,287 మంది ఓటర్లు ఉన్నారు.