Congress Final List In Telangana : అధినాయకత్వానికి గిఫ్ట్ ఇద్దామన్న అద్దంకి దయాకర్- కాంగ్రెస్‌లో మంటలు రేపిన చివరి లిస్ట్
Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో ఉంచిన స్థానాలకు గురువారం అభ్యర్థులను ఖరారు చేసింది. పలువురు ఆశావహులకు నిరాశ దక్కింది. దీంతో ఆందోళనలు చేస్తూ కార్యకర్తలు రోడ్డెక్కారు.
Congress Leaders Fire On Final List : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party)పెండింగ్‌లో ఉంచిన స్థానాలకు గురువారం అభ్యర్థులను ఖరారు చేసింది. దీనికి సంబంధించి చివరి విడత జాబితాను ప్రకటించింది. చార్మినార్ - ముజీబ్ షరీఫ్, తుంగతుర్తి (ఎస్సీ) - మందుల సామ్యూల్ (Mandula Samuel), పటాన్ చెరు - కట్టా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud), మిర్యాల గూడ - బాతుల లక్ష్మారెడ్డి (Bathula Lakshma Reddy), సూర్యాపేట్ - రామిరెడ్డి దామోదర్ రెడ్డి(Ramreddy Damodar Reddy)ను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు.
నీలం మధుకు మొండి చేయి
అయితే అనూహ్యంగా పటాన్ చెరు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మార్చేసింది. పటాన్ చెరు నుంచి తొలుత నీలం మధు (Neelam Madhu)ను ఎంపిక చేయగా, అతనికి బీ ఫాం ఇవ్వలేదు. తాజాగా ఈ స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించారు. దీనిపై నీలం మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకుండా మొన్న బీఆర్ఎస్ మోసం చేస్తే, ఇవ్వాల టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఆయనతో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీ
నమ్మించి గొంతు కోసిందని, పేరు ఖరారు చేసిన తరువాత తనను ప్రచారం చేసుకోమని చెప్పారని చివరకు బీ ఫారం ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. వీళ్లకు ముదిరాజుల తడాఖ ఏంటో చూపిస్తామని, దామోదర రాజనర్సింహకు ఒక్క ఓటు వేయొద్దని కోరారు. తాను ఇండింపెండెంట్‌గా సింహం గుర్తు మీద పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ముది రాజుల బలం ఏంటో తెలియజెప్పేందుకు తనను గెలిపించాలని కోరారు.
పటేల్ రమేష్ రెడ్డికి నిరాశ
సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. ఇక్కడి నుంచి టీపీసీసీ నేత పటేల్ రమేశ్ రెడ్డి (Patel Ramesh Reddy)తొలి నుంచి గట్టి పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకు నిరాశే మిగిలింది. అధిష్టానం దామోదర్ రెడ్డికే టికెట్ కేటాయించింది. దీంతో రమేష్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి సూర్యాపేట బీ ఫారం అమ్ముకున్నారని, ఈ రోజు తమకు సమాధానం చెప్పాలని పట్టుపట్టారు.
బోరున విలపించిన రమేష్ రెడ్డి
రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్‌లో చేరిన రమేష్ రెడ్డిని నడి రోడ్డుమీదకు తెచ్చారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు పని చేయించుకుని మొండి చేయి చూపించారని విమర్శించారు. టిక్కెట్టు దక్కకపోవడంపై రమేష్ రెడ్డి, కటుంబ సభ్యులు బోరున విలపించారు. అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని నమ్మినందుకు తగిన గుణపాఠం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ ప్రణాళిక త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
అద్దంకి దయాకర్‌కు మొండిచేయి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎస్సీ స్థానాన్ని మందుల శ్యామ్యూల్‌కు కేటాయించారు. 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఈ సారి సైతం అద్దంకి దయాకర్ (Addanki Dayakar)ఇక్కడ బాగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనకు అధిష్టానం షాక్ ఇచ్చింది. సీటు నిరాకరించింది. సీటు దక్కకపోవడంపై అద్దంకి దయాకర్ స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అన్ని రకాల విశ్లేషణలు చేసిన తరువాత గెలుపే లక్ష్యంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం అన్నారు.
నిజమైన కార్యకర్తగా, ఉద్యమ నేతగా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ మందుల శ్యామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. ఆయన గెలుపు కోసం తన వంతు ప్రచారం చేస్తానని వెల్లడించారు. తన మిత్రులు, సన్నిహితులు, క్షేమం కోరుకునే వారు బాధపడొద్దని కోరారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉంటాయని, వాటిని గమనించాలని అన్నారు. పార్టీని ఇబ్బంది పెట్టే కామెంట్లు, ఏ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని కోరారు. తానెప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పని చేసి శామ్యూల్‌ను గెలిపించి అధినాయకత్వానికి గిఫ్టు ఇద్దామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
మంత్రి హరీష్ రావు (Harish Rao) సమక్షంలో కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ ముషీనము శ్రీనివాస్ (మాంగోలు), కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్ఎస్‌యూఐ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రావణ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. చంటి పిల్ల కన్న తల్లి చేతుల్లో ఎంత క్షేమంగా ఉంటుందో కెసిఆర్ చేతుల్లో తెలంగాణ అంత సురక్షితంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ... అధికారం మీద యావ ఎక్కువ అని విమర్శించారు.
ఉమ్మడి జిల్లాలో పది కి పది మనమే గెలవబోతున్నామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగానలో గత 8 ఏళ్లుగా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. రైతు బంధు సృష్టి కర్త కేసీఆర్ అన్నారు. నేడు తెలంగాణలో రెండు పంటలు పక్కాగా పండుతున్నాయని అది కేసీఆర్ ఘనత అన్నారు. ఎండాకాలంలో కూడా చెరువులు, చెక్ డ్యామ్‌లు, వాగులు వంకలు నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. ప్రజల కోసం కేసీఆర్ బీమా, 400 లకే గ్యాస్ సిలెండర్ అందించనున్నట్లు చెప్పారు.