మైలవరంలో వసంతకు లైన్ క్లియరైనట్టే - దేవినేని ఉమాకు మరోచోట సీటు ?
Milavaram: మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. సిటింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయింది. దేవినేని ఉమా కు ఎక్కడ అవకాశం కల్పిస్తారన్నదానిపై స్పష్టత లేదు.
The Line Is Cleared For Vasantha In Milavaram : కృష్ణా జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి అభ్యర్థుల జంపింగ్ చేస్తున్నారు. తాజాగా మైలవరం నియోజకవర్గంలోనూ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు రోజుల్లో టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.
టీడీపీలో చేరేందుకు సిద్ధమైన వసంత కృష్ణ ప్రసాద్
గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. గత కొన్నాళ్లుగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గానూ ఆయన ఉన్నారు. కానీ, ఈ సీటును సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడినట్టు తెలుస్తోంది. రెండో విడత జాబితాలో ఆయన పేరును ప్రకటించే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. పార్టీలో చేరిన తరువాత ఈ మేరకు ప్రకటన ఉండే అవకాశముంది.
ఇరువురి మధ్య తీవ్ర వైరం
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య తీవ్రస్థాయిలో విభేధాలు ఉన్నాయి. ఇరువురు నేతలు మొన్నటి వరకు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. మైలవరంలో దేవినేని ఓటమే లక్ష్యంగా రాజకీయాలు నెరిపిన కృష్ణప్రసాద్ గడిచిన ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రానున్న ఎన్నికల్లోనూ మైలవరం నుంచి పోటీ చేస్తానంటూ చెబుతూ వచ్చిన కృష్ణప్రసాద్ అనుకున్నట్టుగానే అక్కడ పోటీకి సిద్ధపడుతున్నారు. కాకపోతే ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ దాదాపు కన్ఫార్మ్ అయింది. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరం సీటు కేటాయిస్తే.. మాజీ మంత్రి దేవినేనికి ఎక్కడ సీటు ఇస్తారన్న దానిపైనా ఆసక్తి నెలకొంది. ఇందుకు టీడీపీ అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాన్ని చూస్తున్నట్టు చెబుతున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావుకు పెనమలూరు సీటు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఉమాకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ, ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడతారా.? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
దేవినేని ఉమకు టిక్కెట్ ఎక్కడ కేటాయిస్తారు ?
వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రెండు రోజుల్లో టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీటు కేటాయింపుపై హామీ లభించిన తరువాతే టీడీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా టీడీపీ అధిష్టానం నుంచి హామీ లభించడంతో పార్టీలో చేరడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు టీడీపీ నాయకులతోనూ ఆయన సమావేశమయ్యారు. పార్టీలో చేరుతున్నానని, అంతా సహకరించాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు. దేవినేతి ఉమాతో తనకు వ్యక్తిగత వేభేదాలు లేవన్న వసంత.. ఇద్దరం ఇప్పటి వరకు వేర్వేరు దారుల్లో ఉన్నామని, ఇప్పుడు ఒకే దారిలో నడవాల్సి ఉన్నందున టీడీపీ పెద్దల సమక్షంలో ఆయన్ను కలుస్తానని వసంత నేతల సమక్షంలో వెల్లడించారు.