TDP Janasena Alliance: సీట్ల సర్దుబాటుపై తేల్చని చంద్రబాబు, పవన్ .. కూటమి నాయకులను టెన్షన్ పెడుతున్న `ఫేక్ న్యూస్`
Andhra Pradesh News: ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న టీడీపీ, జనసేన మిత్రపక్షం మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదు. ఈలోపు నకిలీ వార్తలు ఇరు పార్టీలలోనూ గందరగోళం సృష్టిస్తున్నాయి.
TDP Janasena lliance: ఏపీ(AP)లో రాజకీయాలు వేడెక్కాయి. మరో రెండు మాసాల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల(Elections)కు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల ఎంపికతో వేగంగా దూసుకుపోతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు కనిపించడంలేదు. వైసీపీ మినహా ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని గద్దెదింపాలన్న లక్ష్యంతో చేతులు కలిపిన తెలుగు దేశం పార్టీ(TDP), జనసేన(Janasena) పార్టీలు అభ్యర్థు ల ఎంపిక ప్రక్రియ జోలికి పూర్తిస్థాయిలో వెళ్లలేదు. దీంతో ఈ రెండు పార్టీను టార్గెట్ చేస్తూ వెల్లువెత్తుతున్న నకిలీ వార్తలు(Fake News), ఊహాగానాలు సోషల్ మీడియాలో సెగపుట్టిస్తున్నాయి.
అందుకోసమే ఆగుతున్నారా?
వాస్తవానికి టీడీపీ-జనసేన మిత్రపక్షం(Alliance) వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఈ రెండే కాకుండా.. కీలకమైన జాతీయ పార్టీ బీజేపీ(BJP)ని కూడా కలుపుకొని వెళ్లాలనే వ్యూహం ఉంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. బీజేపీ తమతో కలిసి వచ్చే అవకాశం ఉందని.. ఆ దిశగా తాను ప్రయత్నాలు కూడా చేస్తున్నానని ఆయన ఇటీవల కాలంలో కూడా చెప్పారు. అయితే.. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఈ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదు. తాము కలిసి వస్తామని కానీ.. రాబోమని కానీ.. ఎక్కడా చెప్పలేదు. దీంతో ఆ పార్టీ తీసుకునే నిర్ణయం వరకు వేచి చూసే ధోరణి టీడీపీ-జనసేన మిత్రపక్షంలో కనిపిస్తోంది.
సీట్ల కోసం..
టీడీపీ-జనసేన మిత్ర పక్షంలో ఇరు పార్టీల నుంచి సీట్ల కోసం అనేక మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణల నుంచి యువత వరకు టికెట్ల కోసం పోటీ పడుతున్న పరిస్థితి రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. టీడీపీలో అంటే సంస్థాగతంగా అనేక మంది నాయకులు ఉన్నారు కనుక.. వారి విషయం పక్కన పెడితే.. జనసేనలో మాత్రం కాపు సామాజిక వర్గం(Kapu Community) నుంచి కమ్మ సామాజిక వర్గం వరకు నాయకులు టికెట్ల వేటలో దూసుకుపోతున్నారు. అదేసమయంలో పవన్ ఇమేజ్ విషయం కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. ఇరు పార్టీలు కలసి పోటీ చేస్తున్న దరిమిలా.. ఈ దఫా గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అంచనాలు వస్తున్నాయి. దీంతో పోటీ కోసం జనసేన నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.
ఆశావహుల.. సెగలు!
జిల్లాల వారీగా చూస్తే.. ఉభయ గోదావరి, విశాఖపట్నం(Vishakapatnam), ఉమ్మడి చిత్తూరు(chittoor), అనంతపురం, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో జనసేన నాయకులు ఎక్కువ సంఖ్యలోనే సీట్లను ఆశిస్తున్నారు. ఇక, ఇదేసమయం లో ఆయా నియోజకవర్గాల్లోని బలమైన టీడీపీ నాయకులు కూడా.. తమ సీట్లను వదులు కునేది లేదని స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోకలిసి పనిచేయాలని చెబుతున్నా.. సీట్ల విషయాన్ని తమకు వదిలి పెట్టాలని అధినాయకులు సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం సీట్ల విషయంపై సెగలు పెంచుకుంటూనే ఉన్నారు. ఉదాహరణకు విజయవాడ పశ్చిమ(Vijayawada West) నియోజకవర్గంలో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. కానీ, ఈసీటును ఎట్టి పరిస్థితిలోనూ వదులుకునేది లేదని టీడీపీ స్థానిక నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. ఇక, ఉమ్మడి పశ్చిమలోని పిఠాపురం పరిస్థితి కూడా ఇలానే ఉంది. అలాగే.. తూర్పుగోదావరిలోని జగ్గంపేట టికెట్‌పై జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. టీడీపీ ఇక్కడి సీటును వదులుకునే పరిస్థితి లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల నేతల మధ్య సీట్ల చిక్కులు కొనసాగుతున్నాయి.
ఊహాగానాలు.. వివాదాలు..
కారణాలు ఏవైనా.. టీడీపీ-జనసేన మిత్రపక్షం అభ్యర్థుల ఎంపిక..జాబితాల ప్రకటనపై చేస్తున్న జాప్యం.. అసలుకే ఎసరు పెట్టేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి జనసేనకు టీడీపీ ఎన్ని స్థానాలు కేటాయిస్తుందో తెలియదు. అలానే.. జనసేన ఎన్ని చోట్ల పోటీ చేయాలని అనుకుంటోందో కూడా చెప్పలేదు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం జనసేనకు 15-20 సీట్లేనని టీడీపీ(TDP) క్షేత్రస్థాయినాయకులు.. కాదు.. తమకు 40 నుంచి 50 సీట్లు ఖాయమని జనసేన నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కూడా ఇరు పార్టీల మధ్య నాయకుల సఖ్యతను దెబ్బతీస్తోంది. ఇప్పుడు తాజాగా.. టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు సంతకంతో వచ్చిన లేఖ మరింత దుమారం రేపింది. జనసేకు ఏకంగా 63 సీట్లు ఇస్తున్నామని.. టీడీపీ 112 చోట్ల పోటీ చేస్తోందని ఈ లేఖ సారాంశం. అయితే.. దీనిని టీడీపీ ఖండించింది. ఇది నకిలీ అని తేల్చి చెప్పింది. మొత్తంగా.. జాబితాలు ఆలస్యమవుతుండడం.. అభ్యర్థుల ఆశలు పెరుగుతుండడంతో ఈ గ్యాప్‌లో నకిలీ వార్తలు.. ఊహాగానాలు హల్చల్ చేసి.. మొత్తానికి మిత్రపక్షంలో చిచ్చురేపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు.