AP Election Violence: ఏపీలో అల్లర్ల ఘటనలు - సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం, పోలింగ్ అనంతర హింసపై మరిన్ని కేసులు
Andhra Pradesh News: రాష్ట్రంలో పోలింగ్, అనంతరం జరిగిన హింసపై విచారించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. డీజీపీకి నివేదిక ఇచ్చిన అనంతరం దీనిపై ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు.
SIT First Report On Election Violence: రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్ రోజు, అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఈ రిపోర్ట్ ను సోమవారం డీజీపీకి విచారణ బృందం అందించనుంది. అలాగే, సీఎస్ కు కూడా నివేదిక అందించనుండగా.. ఆయన ద్వారా సీఈవో, సీఈసీకి నివేదిక చేరనుంది. డీజీపీకి నివేదిక సమర్పించిన అనంతరం సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. అయితే, పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు మరిన్ని రోజులు గడువు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. గత రెండు రోజులుగా 3 జిల్లాల్లో పర్యటించిన బృంద సభ్యులు.. నేతలు, స్థానికులు, పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనా స్థలాలను పరిశీలించి అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత ఆదివారం నరసరావుపేటలో పర్యటించి విచారించారు. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల ఆధారంగా వివరాలు సేకరించారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఘటనా స్థలాలను పరిశీలించారు. అటు, ప్రాథమిక విచారణ పూర్తైన క్రమంలో.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై కూడా సిట్ సమీక్ష పూర్తి చేయనుంది. ఈ కేసుల విచారణపై ఇక ముందు కూడా పర్యవేక్షణ కొనసాగనుంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్నారు.
మరిన్ని కేసులు
మరోవైపు, పోలింగ్ అనంతరం అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్టుపై కూడా సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
విచారణ సాగిందిలా..
ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం అల్లర్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా... ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఓ 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందం సభ్యులు గత రెండు రోజులుగా హింసా ఘటనలు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. ఆయా ఘటనా స్థలాలను పరిశీలించి వీడియోలు పరిశీలించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నరసరావుపేట పట్టణంలో శని, ఆదివారాల్లో పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక పోలీసులు నుంచి కూడా సమాచారం సేకరించారు.
అటు, తాడిపత్రిలోని హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిట్ బృందం.. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరిగిన వివాదంపై వివరాలు సేకరించింది. పోలింగ్ రోజున ఓంశాంతి నగర్ లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి కూడా వివరాలు సేకరించారు. అల్లర్లకు సంబంధించి మొత్తం 575 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీని సైతం సిట్ బృందం సభ్యులు ఆదివారం పరిశీలించి ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించడం సహా.. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూం సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు. రామిరెడ్డి, కూచివారిపల్లెలోనూ నేతల ఇళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల పూర్తి స్థాయి విచారణ అనంతరం ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు.
Also Read: AP Elections: ఓటును అమ్ముకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై, దెబ్బకు సస్పెండ్