Pawan Kalyan : బూతులకు టాక్స్ వేస్తే నిధుల కొరతే ఉండదు - గుడివాడలో వైసీపీపై విరుచుకుపడిన పవన్
Andhra News : గుడివాడలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలని గుడివాడ ప్రజలకు పిలుపునిచ్చారు.
Elections 2024 : గుడివాడ ప్రచారంలో పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. నువ్వంటే నాకు భయంలేదు.. దమ్ముంటే నా సినిమాలు ఆపితే ఆపుకో అని సీఎం జగన్ కు సవాల్ చేశారు. జగన్ ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని.. వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో దీపమే అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయినరోజు ఎన్ని వేల రూ. కోట్లున్నా నిష్ర్పయోజనమే అని స్పష్టం చేశారు. చంద్రబాబు బలమైన నాయకుడని , జైలులో ఉన్నా కూడా ఆయన ఏ మాత్రం తొణకలేదన్నారు. అలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఆనాడే నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు.
30 కేసులుండి.. ఐదేళ్ల నుంచి జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నారని గుర్తు చేశారు. .మన నేలను విడిచి ఎక్కడికి పారిపోతాం.. మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా. మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ.. వెనక్కి తీసుకోకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరమేమొచ్చిందంటూ జగన్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరైనా చెరువులు తవ్విస్తారు.. కానీ వీళ్లు కబ్జా చేశారు. బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలి. రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరతే ఉండదు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. జగన్ ప్రభుత్వం.. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదు. జగన్ ను చూసి, వైకాపా నాయకులను చూసి భయపడాలా?.. అని ప్రశ్నించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చట్టం వల్ల... మన భూములపై కనీసం లోన్ తెచ్చుకునే అవకాశం కూడా ఉండదని, ఎందుకంటే, భూముల ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందని వివరించారు. ప్రజల భూములపై ప్రజలకు హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది జగన్ భూ దోపిడీ విధానం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ముందు పట్టాదారు పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్నాడని, ఆ తర్వాత సరిహద్దు రాళ్లపై తన బొమ్మ వేసుకున్నాడని తెలిపారు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని, జిరాక్స్ కాపీలు మనకు ఇస్తారట అని వివరించారు. జిరాక్స్ కాపీలతో మనకు ఎవరైనా లోన్లు ఇస్తారా... ఇదొక పిచ్చి చట్టం అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మద్దతుదారులకు కూడా ఒకటే చెబుతున్నా... మీరు జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై మీరు హక్కులు వదిలేసుకున్నట్టే అని హెచ్చరించారు. మీ ఆస్తులు గాలిలో దీపంలా మారిపోతాయి అని పేర్కొన్నారు.
ఏపీలో రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయం. జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి. మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉంది. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో ఉన్నారు... గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ఆయనను పార్లమెంటుకు పంపుదాం. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నేత వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు... ఆయనకు ఓటేసి గెలిపించాలని కోరారు.