Srikakulam News: పాలకొండ ఎప్పుడూ కీలకమే - ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఏ జెండా ఎగిరేనో?
Palakonda is always important.. Which flag will fly here next time : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మరో నియోజకవర్గం పాలకొండ. ఈ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో చేరింది.
Palakonda Constituency Present Politcal Scenario: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మరో నియోజకవర్గం పాలకొండ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలను పునర్విభజించింది. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో చేరింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా.. నాలుగు సార్లు టీడీపీ, నాలుగుసార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గడిచిన రెండు ఎన్నికల్లోను వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2,24,865 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,13,572 మంది, మహిళా ఓటర్లు 1,11,274 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
నాలుగు సార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్ విజయం
పాలకొండ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, మరో నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయాన్ని దక్కించుకున్నారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన పి.సంగం నాయుడు కేఎల్పి పార్టీ నుంచి బరిలోకి దిగిన ఎమ్మార్ నాయుడుపై 1632 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పిఎస్ అప్పారావు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కేఎస్ నాయుడుపై 772 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఎస్ నాయుడు ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిఎన్ అప్పారావుపై 5453 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జోజి ఇక్కడ విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కే నర్సయ్యపై 1895 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కే నరసయ్య తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పి జయమ్మ పై 19,506 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన కేజీ రాజారత్నం తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి ఆదినారాయణపై 11,758 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్యామారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జె.లచ్చయ్యపై 19,085 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీ.భద్రయ్య ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అమృత కుమారిపై 22,904 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పీజీ అమృతకుమారి ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జి.సత్తయ్యపై 1175 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టి.భద్రయ్య ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పీజే అమృత కుమారిపై 20,974 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పీజే అమృతకుమారి మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన టీ భద్రయ్య 1196 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 2004 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంబాల జోగులు ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టి.రాంబాబుపై 11,624 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నిమ్మక సుగ్రీవులు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మక గోపాలరావుపై 16,150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వసరాయి కళావతి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇక్కడ విశ్వసరాయి కళావతి విజయం సాధించారు. వైసీపీ నుంచి ఆమె మరోసారి ఇక్కడ బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మక జయకృష్ణపై 17,980 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుని వరుసగా రెండోసారి ఇక్కడ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను విశ్వసరాయి కళావతి మరోసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు నిమ్మక జయకృష్ణ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే పార్టీ నుంచి మరో అభ్యర్థి కూడా తన ప్రయత్నాలను సాగిస్తున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు కొంత ఇబ్బందికరంగా ఆ పార్టీకి మారాయి. గడిచిన మూడు ఎన్నికల్లోను ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో అధిష్టానం అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన సరళని పరిశీలిస్తే పలువురు రెండుసార్లు చొప్పున ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి గడిచిన రెండు ఎన్నికల్లోను విజయం సాధించారు. పీజే అమృత కుమారి, టి.భద్రయ్య, కే.సంఘం నాయుడు రెండుసార్లు చొప్పున ఇక్కడ విజయాన్ని సాధించారు.