Jaggayyapeta Assembly Constituency: జగ్గయ్యపేటలో విజయం ఇరుపార్టీల మధ్య దోబూచులాట,ఈసారి పైచేయి సాధించేదెవరో?
NTR District News: ఏపీ ముఖద్వారంగా ఉన్న జగ్గయ్యపేట ప్రజలు రాజకీయ విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. ఇక్కడ విజయం పలుమార్లు చేతలు మారగా...ఈసారి గెలుపొందేదెవరోనన్న ఆసక్తి నెలకొంది
Andhra Pradesh News: NTR జిల్లా జగ్గయ్యపేట..పశ్చిమ ఆంధ్రాకు ముఖధ్వారం ఈ నియోజకవర్గం. రెండువైపుల తెలంగాణ(Telangana),మరోవైపు కృష్ణమ్మను సరిహద్దుగా కలిగి ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. తొలుత కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కాంగ్రెస్ పాగా వేసింది. రెండుసార్లు స్వతంత్రులకు పట్టం కట్టిన జగ్గయ్యపేట(Jaggayyapeta Assembly Constituency) ప్రజలు.....తెలుగుదేశం(TDP) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలతో జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత రెండుసార్లు 'చేయి' జారినా మళ్లీ పట్టునిలుపుకుని రెండుసార్లు సైకిల్ పరుగులు పెట్టింది. 2019 జగన్ ఫ్యాన్ గాలి ఇక్కడా వీచింది. ప్రస్తుతం వైసీపీ(YCP) నుంచి సామినేని ఉదయభాను(Udaya Bhanu) గెలుపొంది ఎమ్మెల్యేగా ఉన్నారు.
జగ్గయ్యపేట స్వరూపం
విజయవాడ పార్లమెంంట్ పరిధిలోకి వచ్చే జగ్గయ్యపేట(Jaggayyapet) అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలు పూర్తిగానూ, నందిగామ మండలంలోని కొన్ని గ్రామాలు సైతం జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఆంధ్రరాష్ట్ర ఏర్పడటానికి ముందు మద్రాస్(Madras) శాసనసభ పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో తొలుత కమ్యూనిస్టుల హవా నడిచింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో మద్రాస్ శాసనసభకు సీపీఐ(CPI) నుంచి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత తొలుత ఎస్టీ (SC) రిజర్వ్ నియోజకవర్గంగా మారింది. 1962లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పొన్న కోటేశ్వరరావుపై పై తొలిసారి కాంగ్రెస్(Congress) అభ్యర్థి గాలేటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు.. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో జగ్గయ్యపేట జనరల్ స్థానంగా మారింది. 1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మూర్తిపై మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి శేషయ్య శ్రేష్ఠి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1972 ఎన్నికల్లో ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) తరపున బొద్దులూరి రామారావు విజయం సాధించగా...1983లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కినేని లోకేశ్వరరావు జయకేతనం ఎగురవేశారు.
తెలుగుదేశం హవా
1985లో తెలుగుదేశం(TDP) సంక్షోభం అనంతరం జరిగిన ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్(NTR) తిరుగులేని విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఆ ఊపులోనే యువకుడు, విద్యావంతుడైన నెట్టెం రఘురాం(Nettam Raghuram) విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముక్కపాటి వెంకటేశ్వరరావుపై తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 1989 జరిగిన ఎన్నికల్లో మరోసారి వసంత నాగేశ్వరరావుపై విజయం సాధించారు.1994లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీయగా...ముచ్చటగా మూడోసారి నెట్టె రఘురాం విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం జరిగిన పరిణామాల్లో నెట్టెం రఘురాం చంద్రబాబు(Chandra Babu) పక్షాన చేరి..మంత్రిపదవి సైతం దక్కించుకున్నారు. చంద్రబాబు కేబినెట్‌లో ఆబ్కారీశాఖ మంత్రిగా పనిచేశారు.
ఉదయించిన భానుడు
1999లో మరోసారి చంద్రబాబు మ్యాజిక్ చేసినా...జగ్గయ్యపేటలో తెలుగుదేశం అభ్యర్థి నెట్టెం రఘురాం ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి బరిలో దిగిన సామినేని ఉదయభాను(Samineni Udhaya Bhanu) గెలుపొంది తెలుగుదేశం అప్రతిహాత విజయాలకు అడ్డుకట్ట వేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడంతో జగ్గయ్యపేటలోనూ ఆ పార్టీ అభ్యర్థి సామినేని ఉదయభాను రెండోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో విప్‌గానూ ఉదయభాను పనిచేశారు.
నెట్టెం మంత్రాంగం
2009లో జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి మంత్రిపదవి దక్కించుకోవాలని ఉదయభాను చేసిన ప్రయత్నాలను తెలుగుదేశం నేత నెట్టెం రఘురాం గండికొట్టారు. ఉదయభాను ముఖ్య అనుచరుడు, జగ్గయ్యపేట మున్సిపాలిటి ఛైర్మన్ శ్రీరాం రాజగోపాల్(Sriram Raja Gopal)ను తెలుగుదేశంపార్టీలోకి తీసుకురావడమేగాక..తన సీటును త్యాగం చేసి రాజగోపాల్‌కు ఇప్పించారు. జగ్గయ్యపేట పట్టణంలో మెజార్టీస్థాయిలో ఉన్న ఆర్యవైశ్యుల ఓట్ల ప్రభావంతో తొలిసారి శ్రీరాం రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో మరోసారి జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరపున శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థిగా సామినేని ఉదయభానే ఉన్నా....ఆయన కాంగ్రెస్ వీడి వైసీపీ(YCP) వైకాపాలో చేరారు.
2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పాత ప్రత్యర్థులే పోటీపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన శ్రీరాం రాజగోపాల్ హ్యాట్రిక్ విజయం కోసం గట్టిగానే పోటీపడినా....జగన్(Jagan) గాలిలో కొట్టుకుపోయారు. వైసీపీ తరపున సామినేని ఉదయభాను మూడోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్ ప్రభుత్వంలో మరోసారి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. మళ్లీ పాత ప్రత్యర్థులే బరిలో నిలిచారు. ఈసారి ఎవరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఖాయమంటూ జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఇరుపార్టీలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి.