AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Vasamsetti Subhash | ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. మొన్న చంద్రబాబు క్లాస్ తీసుకోగా, నేడు స్పీకర్ సీరియస్ కావడంతో మంత్రి విషయం హాట్ టాపిక్ అయింది.
AP Assembly Sessions: అమరావతి: ఏపీ కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి దొరికిపోయారు. ఇటీవల రాజకీయాలకు పనికి రావాలంటే అప్రమత్తంగా ఉండాలని, పార్టీ కోసం పనిచేయాలని వాసంశెట్టి సుభాష్ కు ఏపీ సీఎం చంద్రబాబు క్లాక్ తీసుకున్నారు. తాజాగా అసెంబ్లీ వేదికగా మరోసారి వాసంశెట్టి సుభాష్ నిర్లక్ష్యంపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘాటుగా స్పందించారు. ప్రశ్నోత్తరాల సమయానికి అసెంబ్లీలో మంత్రి వాసంశెట్టి సుభాష్ లేకపోవడంతో ప్రశ్నను స్పీకర్ అయ్యన్న వాయిదా వేశారు.
సీరియస్ గా తీసుకోవాలని మంత్రికి అయ్యన్న చురకలు
అనంతరం వాసంశెట్టి సుభాష్ అసెంబ్లీకి రాగా, ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్ గా తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న మంత్రికి చురకలు అంటించారు. ప్రజల కోసం గళం విప్పాల్సిన అసెంబ్లీలో, అది కూడా బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి ఆలస్యంగా వస్తే ఎలా అని వాసంశెట్టి సుభాష్ ను స్పీకర్ అయ్యన్న నిలదీశారు. సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని, లేకపోతే అసెంబ్లీ సమయం వృథా అవుతుందని అయ్యన్న సూచించారు. అసెంబ్లీకి రావడానికి తన ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పారు.
కాగా, బాధ్యత గా ఉండాలంటూ చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్ కు క్లాస్ తీసుకోవడం తెలిసిందే. చంద్రబాబు తనకు చాలా గౌరవమని, ఆయన తనకు తండ్రిలాంటివారని.. తనను ఓ మాట అంటారని, అవసరమైతే కొడతారంటూ వైరల్ ఆడియోపై మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.
ఇటీవల క్లాస్ తీసుకున్న చంద్రబాబు
ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, పార్టీ వ్యవహారాల్లోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రి వాసంశెట్టి సుభాష్ కు క్లాస్ తీసుకున్న ఆడియో వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఉన్న కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మంత్రి సుభాష్ పై చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు ఓటర్ల నమోదుపై చంద్రబాబు ఎప్పటికప్పుడూ టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఎమ్మెల్యేలతోపాటు, కీలక నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల ఓట్ల నమోదు నమోదు జరుగుతోందని, మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుండగా.. వాటిని పట్టించుకోవడం లేదని.. ఇలా చేస్తే రాజకీయాలకు సరిపోవని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు తిడతారు.. అవసరమైతే కొడతారన్న మంత్రి
నువ్వు యంగ్‌స్టర్‌వి.. రాజకీయాలను ఇంకా సీరియస్‌గా తీసుకోలేదు. అందులోనూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, తొలిసారికే మంత్రివి దక్కించుకున్నావు. కానీ పట్లభద్రుల ఓటర్ల నమోదు, పార్టీ సభ్యత్వ నమోదులో నీ నియోజకవర్గం ఎక్కడుందో చూసుకున్నావా.. 20 శాతం చేశావ్.. రంపచోడవరం 20 శాతం, రామచంద్రపురం 29 శాతమే అయ్యింది.. ఫస్ట్ టైం గెలిచావ్ పార్టీ నీకు ఎంత గౌరవమిచ్చింది.. వేరే పార్టీ నుంచి వచ్చినా గెలిపించి మంత్రి పదవి ఇస్తే ఆమాత్రం పట్టుదల లేకపోతే ఎట్లయ్యా.. అందరూ సీరియస్‌గా ఉండాలని మీ బాధ్యత మీరు చేయండి.. మీరు చేయకుంటే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు ఎందుకయ్యా అని చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆ వైరల్ ఆడియోపై స్పందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు విలువైన సూచన చేశారని.. తనను తిడతారని, అవసరమైతే కొడతారని అందులో మీకేంటి సమస్య అన్నారు.