బిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?
సాధారణంగా రోడ్డు విస్తరణలు, ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టినప్పడు నోటీసులు ఇచ్చి భవనాలను కూలకొడుతుంటారు.. అయితే ఎప్పుడో నిర్మించిన భవనాన్ని అకస్మాత్తుగా నోటీసులు ఇచ్చి తొలగించాలని అధికారులు ఆదేశిస్తే... సరిగ్గా ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్న ఓ ఇంటి యజమాని మూడు అంతస్తుల భవనాన్ని కూల్చడం ఇష్టంలేక 21 అడుగులు ముందుకు కదిపేందుకు బీహార్‌కు చెందిన ఓ సంస్థకు అప్పగించి భవనాన్ని ముందుకు కదల్చడంలో సఫలీకృతులయ్యారు..అంతేకాదు.. రెండు అడుగుల ఎత్తు కూడా పెంచేలా చేయించారు.. దీనికోసం రూ.70 లక్షలు ఖర్చు చేయగా రెండు నెలల క్రితం చేపట్టిన భవనం కదలింపు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.. దాదాపు 7 సెంట్లు స్థలంలో ఉన్న ఈ అతిపెద్ద భవనాన్ని విజయవంతంగా ముందుకు తరలించడంలో సక్సెస్ అయ్యారు భవన యజమాని. రాజమండ్రి హుకుంపేటకు చెందిన సిద్దార్ధ పాఠశాల యజమాని మద్దాల కృష్ణమూర్తి హుకుంపేట జాతీయ రహదారిని ఆనుకుని సిద్ధార్ధ పాఠశాలను నడుపుతున్నారు. రాజమండ్రి హుకుంపేట మీదుగా ప్రవహిస్తున్న ఆవకాలువ(మురుగు కాలువ) ను ఆనుకున్న నిర్మాణాలు తొలగించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.. దీంట్లో కృష్ణమూర్తికి చెందిన ఓ భవనం కూడా ఉండగా ఈభవనాన్ని తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది.. కార్పోరేషన్ ద్వారా నోటీసులు అందుకున్న కృష్ణమూర్తి అధికారులను కొంత సమయం కోరారు. వెంటనే భవనాన్ని ముందుకు కదలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికోసం స్ట్రక్చరల్ ఇంజనీర్ల ద్వారా బీహార్‌కు చెందిన 40 మంది నైపుణ్యమున్నవారిని రప్పించి పనులు చేపట్టారు. 100 అడుగుల పొడవు, 34 అడుగులు వెడల్పుతో దాదాపు 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని ట్రాలీ జాకీల సాయంతో పైకి లేపి 21 అడుగులు ముందుకు విజయవంతంగా జరిపారు. ఇప్పుడు రెండు అడుగులు ఎత్తు లేపే పనులు జరుపుతున్నారు. ఈ పనులు జరుగుతుండగా భవనంలో ఎక్కడి సామానలు అక్కడే ఉంచగా ఈ భవనంలో నివాసం ఉండే కుటుంబాలు యధాతధంగా నివాసం ఉండటం గమనార్హం..