సొంత గూటికి చేరుకున్న రామ్మోహన్ గౌడ్- హరీష్ సమక్షంలో చేరిక
ఎల్బీనగర్ టికెట్‌ను మధుయాష్కీ గౌడ్‌కు ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్న ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ దంపతులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఏ నాయకుడు ఏ క్షణంలో ఏ పార్టీలోకి వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల టికెట్లు ఆశించిన వారంతా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికార బీఆర్‌ఎస్‌లో వాతావరణం కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వంతు వచ్చింది. అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న కొద్దీ జంపింగ్ జంపాంగ్‌లు పెరిగిపోతున్నారు.
అలాంటి జాబితాలో చేరారు ఎల్బీనగర్ లీడర్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు. గతంలో వీళ్లు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ అక్కడ సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి కారు ఎక్కడంతో వీళ్లు కారు దిగేశారు. కాంగ్రెస్‌లో చేరి ఇన్నాళ్లు పని చేశారు. అయితే అక్కడ టికెట్ ఆశించిన ఈ దంపతులకు చుక్క ఎదురైంది.
ఎల్బీనగర్ టికెట్‌ను మధుయాష్కీ గౌడ్‌కు ఇవ్వడంతో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ అలక బూనారు. తాను ఎప్పటి నుంచో టికెట్ ఆశిస్తుంటే కనీసం టికెట్ ఇవ్వకుండా అవమానించారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అనుచరులతో సమావేశం అనంతరం కారు ఎక్కాలని నిర్ణయించుకున్నారు ముద్దగౌని దంపతులు. ఈ ఉదయం హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి, ఇతర నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌రావు.... రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశారు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాము. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశారు. ముక్కు సూటితత్వం ఉన్న మనిషి. రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోతారు. 11 మంది కార్పొరేటర్లు గెలిపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారు అని అన్నారు.
రామ్మోహన్ గౌడ్ కు బిఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుందన్నారు హరీష్. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయన్నారు. పార్టీ ప్రతినిధిగా తాను వచ్చానన్నారు. అందుకు బాధ్యత తీసుకుంటానన్నారు. ఇంటి సమస్య పరిష్కరించకుందామని హితవు పలికారు. కాంగ్రెస్ గెలిచేది లేదున్నారు హరీష్. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు. అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయిని అభిప్రాయపడ్డారు.