TDP News: సీట్లు రాని నేతలను బుజ్జగిస్తున్న చంద్రబాబు
CBN News: తొలి జాబితాలో సీట్లు దక్కని తెలుగుదేశం నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో పార్టీ సీనియర్లు కూడా ఉన్నారు. అలాంటి వారితో నేరుగా చంద్రబాబే మాట్లాడుతున్నారు. బుజ్జగిస్తున్నారు.
TDP NEWS: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వక ముందే దాదాపు 70శాతం సీట్లు ప్రకటించి మంచి ఊపుమీద తెలుగుదేశం(TDP)-జనసేన(Janaseana) కూటమికి అసంతృప్తులు, అలకలు తీవ్ర తలనొప్పిగా మారాయి. జనసేనతో పొత్తులో భాగంగా కీలక సీట్లను సైతం తెలుగుదేశం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. ఐదేళ్లుగా కష్టపడి తాము పనిచేస్తుంటే....ఇప్పుడు వేరొకరికి సీటు ఇవ్వడం ఏంటని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అలాంటి వారందరినీ చంద్రబాబు(CBN) పిలిచి మాట్లాడి బుజ్జగిస్తున్నారు. మరికొందరు పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడంపై తెలుగుదేశం-జనసేన నేతలు అప్రమత్తమయ్యారు.
చంద్రబాబు బుజ్జగింపులు
తెలుగుదేశం తొలి జాబితాలో సీటు దక్కని వారిని, జనసేనకు కేటాయించడం వల్ల సీటు కోల్పోయిన నేతలను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కొందరు కీలక నేతల పేర్లు తొలిజాబితాలో కనిపించలేదు. ఒకప్పుడు జిల్లాలను శాసించి... 4,5 సార్లు గెలిచిన వారికి సైతం ఈసారి తొలిజాబితాలో పేర్లు ప్రకటించ లేదు. దీంతో ఆయా నియోజకవర్గ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు(CBN) వారిని స్వయంగా పిలిచి కారణాలు వివరిస్తున్నారు. సీటు కోల్పోతున్నవారిని బుజ్జగిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. మరికొందరికి మలి జాబితా వరకు వేచి చూడమని చెప్పారు. ఇంకొందరికి నియోజకవర్గం మారాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చారు. తెలుగుదేశం(TDP) ఈసారి కచ్చితంగా గెలుస్తుందని నమ్మకం ఉన్న స్థానాల్లో తెనాలి(Tenali) ఒకటి. అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ నేత ఆలపాటి రాజా(Alapati Raja) ఐదేళ్లపాటు నియోజకవర్గంలో తిరిగి పార్టీని పటిష్టం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సీటు జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పోటీ పడుతున్నారు. దీంతో ఆలపాటి రాజాను ఇంటికి పిలిచి చంద్రబాబు పరిస్థితి వివరించారు. ఈసారి తెలుగుదేశం విజయం అత్యవసరం కాబట్టి...జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి అంగీకరించిన రాజా...పార్టీ నిర్ణయం శిరోధార్యమన్నారు. అలాగే అనకాపల్లి సీటు త్యాగం చేయాల్సి వచ్చిన పీలా గోవింద్ సైతం చంద్రబాబును కలిశారు. అనకాపల్లి అసెంబ్లీ సీటు కాకపోయినా....పార్లమెంట్ సీటు అయినా ఇవ్వాలని ఆయన కోరారు. అయితే లోక్ సభ సీటు సైతం ఇప్పటికే జనసేనకు హామీ ఇచ్చినట్లు సమచారం. ఆయనకు సైతం ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిసింది. బీజేపీ(BJP)తో పొత్తు విషయం ఇంకా ఏమీ తేలలేదని..ఒకవేళ వారు రాజమండ్రి లోక్ సభ సీటు అడగకుంటే ఇస్తామని బొడ్డు వెంకటరమణ చౌదరికి హామీ ఇచ్చారు. రాజంపేట పార్లమెంట్ సీటు ఆశీస్తున్న ముక్కా రూపనందరెడ్డికి సైతం చంద్రబాబు నచ్చజెప్పి పంపారు.
చంద్రబాబుతో దేవినేని, గంటా భేటీ
తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు( Devineni Uma), గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao)చంద్రబాబుతో సమావేశమయ్యారు. తొలిజాబితాలో వారిరువురి పేర్లు లేకపోవడంతో చంద్రబాబే వారిని పిలిపించారు. సీట్లు కేటాయించకపోవడానికి కారణాలను వారికి వివరించి చెప్పారు. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో చేరుతుండటంతో మైలవరం(Mylavaram) టిక్కెట్ హోల్డ్ చేశారు. ఇదే సీటును ఆయన ఆశిస్తుండటంతో దేవినేని ఉమకు తొలి జాబితాలో పేరు ప్రకటించ లేదు. అయితే మరోసారి వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prsad)తో చంద్రబాబు చర్చించనున్నారు. ఆయన్ను పెనమలూరు నుంచి పోటీ చేయాల్సిందిగా కోరనున్నారు. ఒకవేళ ఆయన అంగీకరించకుంటే దేవినేనే పెనమలూరు వెళ్లాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం. అయితే పెనమలూరు సీటు స్థానిక నేత బోడే ప్రసాద్ ఆశిస్తున్నారు. అలాగే మరో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైతం చంద్రబాబు(CBN)తో భేటీ అయ్యారు. ఆయన్ను చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు కోరారు. బొత్సను ఢీకొట్టాలంటే గంటానే కరెక్టని చంద్రబాబు భావిస్తున్నారు. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తావని...ఆ నమ్మకం నాకు ఉందని కాబట్టి బొత్సపై పోటీ చేయాలని కోరారు. అయితే తాను విశాఖ జిల్లా వదిలి వెళ్లాలనుకోవడం లేదని....తన పాత నియోజకవర్గమైన భీమిలిలోనే పోటీ చేస్తానని చెప్పినట్లు గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై మరోసారి మాట్లాడదమని చంద్రబాబు చెప్పారని ఆయన వివరించారు.
అవనిగడ్డలో కాక
తొలి జాబితాలో సీటు దక్కని మరో సీనియర్ నేత మండలి బుద్ధాప్రసాద్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల తన మనస్థత్వానికి సరిపోవని మండలి బుద్ధప్రసాద్ సముదాయించుకున్నా....ఆయన అనుచరులు మాత్రం అంగీకరించడం లేదు. మోపిదేవి లో ఇవాళ 6 మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం అవుతున్నారు. ఈ సీటు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైంది. ఆ పార్టీ నుంచి మాదివాడ క్రిస్టియన్ లేదా విక్కుర్తి శ్రీనివాస్ లు పోటీచేసే అవకాశం ఉంది.