YS Sharmila: బద్వేల్‌లో షర్మిలపై కేసు నమోదు- కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని ఆరోపణ
Andhra Pradesh News: కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వైఎస్ వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించిన షర్మిలపై బద్వేల్‌లో కేసు నమోదు అయింది. దీనిపై విచారణ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బద్వేల్‌లో కేసు నమోదు అయింది. ఎన్నికల రూల్స్ అతిక్రమించారని ఆమెపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో ఉన్న షర్మిల పలు అంశాలు ప్రస్తావించారు. అందులో భాగంగా వైఎస్ వివేక మర్డర్ కేసు అంశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసు నమోదుకు కారణమైంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించొద్దని ఈ మధ్య కాలంలోనే కడప కోర్టు తీర్పు వెల్లడించింది. వైఎస్ వివేక హత్య కేసును ముఖ్యాంశంగా చేసుకొని పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని వైసీపీ లీడర్ ఒకరు కోర్టును ఆశ్రయించింది. దీని వల్ల ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అందులో తెలిపారు. వాదనలు విన్న కడప కోర్టు ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్యకేసు అంశాన్ని ప్రస్తావించొద్దని తీర్పు వెల్లడించింది.
ఈ కోర్టు కేసును ఉల్లంఘించి పదే పదే వైఎస్ వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారని షర్మిలపై కేసు నమోదు అయింది. రూల్స్‌కు వ్యతిరేకంగా కేసు అంశాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రత్యర్థులను టార్గెట్ చేశారని ఫిర్యాదులో వైసీపీ లీడర్లు పేర్కొన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేశారు.