AP Police Preparations : మాక్ డ్రిల్స్ - ప్రత్యేక అధికారులు - కౌంటింగ్‌కు పోలీసులు రెడీ
Andhra News : కౌంటింగ్‌కు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని చోట్లా మాక్ డ్రిల్స్ పూర్తి చేశారు. తాజాగా ప్రత్యేకాధికారుల్ని నియమించారు.
Elections 2024 : దేశంలోకల్లా అత్యధిక పోలింగ్ జరిగినప్పటికీ అత్యంత హింసాత్మకంగా జరిగిన ఎన్నికలు కూడా ఏపీలోనే నమోదయ్యాయి. ఈ కారణంగా కౌంటింగ్ కోసం కోసం పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్ది రోజులుగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా .. పోలీసులు పరిస్థితుల్ని చక్కదిద్దేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
విస్తృతంగా మాక్ డ్రిల్స్, కార్డన్ సెర్చ్
మరో వైపు అన్ని చోట్లా పోలీసులు అధికారుల్ని అప్రమత్తం చేశారు. కింది స్థాయిలో ఎవరైనా రాజకీయ నేతలతో కుమ్మక్కయి లా అండ్ అర్డర్ సమస్యలు తీసుకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతకు ముందు జరిగిన అల్లర్ల కేసుల్లో చాలా మంది పోలీసులు .. అల్లర్లు పెరగడానికి పరోక్షంగా సహకారం అందించారని సిట్ నివేదికలో తేలినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో పోలీసు అధికారులపై వేటు పడింది. అందుకే అధికారులు కూడా సీరియస్ గా .. ఎలాంటి లోపాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పదవ్యక్తుల ఇళ్లల్లో ఉన్న ఆయుధాలు, సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Cordon&Search operations across the State to maintain Law&Order-#APPolice: On the instructions of #DGP Shri Harish Kumar Gupta IPS, Cordon&Search operations, mock drills have been conducted across the State with an aim to maintain L&O, control #crime&(1/3) pic.twitter.com/UAtA3rqtSS
— Andhra Pradesh Police (@APPOLICE100) May 25, 2024
ప్రత్యేకాధికారుల్ని నియమించిన డీజీపీ
కౌంటింగ్ కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇవాళ సాయంత్రం లోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పల్నాడు జిల్లాకు 8 మంది పోలీసు అధికారులను కేటాయించారు. వారిలో ఆరుగురు అదనపు ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు ఉన్నారు.
ఈ సారి ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు
పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడం.. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులతో కౌంటింగ్ అనంతర హింస ఎక్కువగా ఉంటుందన్న ఆందోళనతో.. పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాల్ని మోహరిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలకు ఎక్కువ బలగాల్ని పంపుతున్నారు. విజయోత్సవ ర్యాలీలను.. బాణసంచాలను నిషేదిస్తున్నారు.