Thota Trimurtulu : తోట త్రిమూర్తులు జైలు శిక్షపై స్టేకు హైకోర్టు నిరాకరణ - పోటీ చేయడానికి అర్హత ఉంటుందా ?
Andhra News : తోట త్రిమూర్తులు కు విశాఖ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మే ఒకటో తేదీకి వాయిదా వేసింది.
Thota Trimurtulu Case News : వైఎస్ఆర్‌సీపీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులుకు హైకోర్టులో ఊరట లభించలేదు. విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే ఒకటో తేదీకి వాయిదా వేశారు. 28 ఏళ్ల కిందట దళిత యువకులకు శిరోముండనం చేయించిన కేసులో ఆయన్ను దోషిగా తేలుస్తూ విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టు మంగళవారం ఏప్రిల్ 16న తీర్పు ఇచ్చింది. తర్వాత శిక్షను నెల రోజులువాయిదా వేస్తూ.. బెయిల్ మంజూరు చేసింది.
నామినేషన్ల గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్ష పడిన వారి నామినేషన్ చెల్లుబాటు అవుతుందా లేదా అన్నదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. మామూలుగా అయితే రెండేళ్లు జైలు శిక్ష పడితే పోటీ చేయడానికి అర్హత ఉండదు. కానీ ఇక్కడ పద్దెనిమిది నెలలు మాత్రమే జైలుశిక్ష పడింది. కానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు కావడంతో ఆయనకు పోటీ చేయడానికి అర్హత ఉండదని చెబుతున్నారు. పైగా శిక్షపై స్టే లభించకపోతే ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ అంశంపై సీఎం జగన్ పార్టీ నేతలతో ఇప్పటికే చర్చించారు.
తోట త్రిమూర్తులు అభ్యర్థిత్వాన్ని మార్చి అక్కడ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను నిలబెడితే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఒక వేళ తోట త్రిమూర్తుల్ని కంటిన్యూ చేయిస్తే దళిత ఓట్లపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారుట. ఈ వ్యవహారంపై టీడీపీ నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. తోటను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కొన్ని దళిత సంఘాలు కూడా ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల దళితుల ఓట్లనే టార్గెట్ చేశారు. వైసీపీకి చెందిన పలువురు దళిత నేతల్ని పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు.
వైఎస్ఆర్‌సీపికి దళితులు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన అనేక పరిణామాలు దళితుల్ని దూరం చేశాయన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో శిరోముండనం కేసులో దోషి తేలిన వ్యక్తినీ సమర్థిస్తూ టిక్కెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దళితుడైన తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు వైసీపీలో ప్రాధాన్యం లభిస్తోంది. సస్పెండ్ చేసినట్లుగా ప్రకటన చేశారు కానీ.. ఆయన పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రంపచోడవరం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ప్రాధాన్యంపై ఇప్పటికే దళితుల్లో అసంతృరప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో తోట త్రిమూర్తుల్ని కూడా ప్రోత్సహిస్తే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంని చెబుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక సారి టిక్కెట్ ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గరని.. అభ్యర్థి మార్చరని.. తోట త్రిమూర్తులు వర్గం నమ్మకంతో ఉంది. శిక్షపై స్టే లభించలేదు కాబట్టి.. ఏం చేస్తారన్నది కీలకంగా మారింది.