AP Election Results: జూన్ 4న ఆ టైమ్ వరకు ఏపీ ఎన్నికల తుది ఫలితాలపై క్లారిటీ: ముకేష్ కుమార్ మీనా
AP Assembly Elections 2024: జూన్ 4న ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం చేసినట్లు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా వివరించారు.
AP CEO Mukesh Kumar Meena | అమరావతి: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్లు నియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఓట్ల లెక్కింపునకు నియోజక వర్గాల నుంచి వారీగా చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు.
కౌంటింగ్ కోసం పటిష్ట ఏర్పాట్లు
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు కౌంటింగ్ జరగనుంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా ఓట్ల లెక్కింపు కొనసాగేలా ప్రణాళిక సిద్దం చేశారు.
సాయంత్రం 6 లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి
111 నియోజక వర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు, మిగతా 3 స్థానాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని చెప్పారు. టేబుళ్లను పెంచి పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు సకాలంలో లెక్కింపు పూర్తి చేస్తామన్నారు. అదేరోజు రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఓట్ల లెక్కింపు రోజు అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుతో పాటు సీనియర్ అధికారులను నియమించాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో డిజీపీతో పాటు నేను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించాం. అధికారులతో సమీక్షి నిర్వహించి వారిని అప్రమత్తం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో పర్యటిస్తూ ఓట్ల లెక్కింపునకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించినట్లు’ వివరించారు. ఏపీ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్. బాగ్చీ మాట్లాడుతూ.. జూన్ 4 న ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేయడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ మాట్లాడుతూ.. ఏపీకి సమర్థవంతమైన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉన్నారని, ఆయన నేతృత్వంలో ఈసీ మార్గదర్శకాలతో ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అన్ని నియోజక వర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే పీసీ, ఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి, 21ఇ లను అదే రోజు ఫ్లైట్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్లలో కూలీల సేవల వినియోగంపై ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి, అనుమతించాలని.. ముఖ్యంగా అల్లర్లు జరిగిన జిల్లాలోని అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.